Site icon NTV Telugu

Off The Record: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి పదవి గండం..!?

Gummadi Sandhya Rani

Gummadi Sandhya Rani

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన, శిశు సంక్షేమ‌ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు అడకత్తెరలో ఇరుక్కున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రిగా ఆమె మెడ మీద కత్తి వేలాడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే… దీనికి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సాలూరు నియోజకవర్గం నుంచి పోరాడి పోరాడి ఏదోలా ఎమ్మెల్యే అయిపోయిన గుమ్మడి.. మంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారన్నది లోకల్‌ టాక్‌. ఇలా మంత్రి అయ్యారో లేదో… అలా ఆమె తీరు మారిపోయిందని స్థానిక తెలుగుదేశం నాయకులే చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖలో తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు పెద్ద దుమారానికే కారణమైనట్టు తెలిసింది. ఆ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సబ్బవరపు శ్రీనివాస్‌కు సంబంధించిన నిర్ణయం మంత్రి సంధ్యా రాణి పదవికి ముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఏసీబీ చరిత్రలోనే తొలిసారి డైకెర్ట్‌గా అత్యంత ఎక్కువ క్యాష్‌ను లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు శ్రీనివాస్‌. అధికారులు రైడ్‌ చేసిన టైంలో ఆయన దగ్గర పాతిక లక్షల క్యాష్‌ దొరికింది. ఆయన మీద గతంలో పలు అవినీతి కేసులు ఉన్నప్పటికీ.. క్లీన్‌చిట్‌ ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఎవరి ఇంట్రస్ట్‌తో ఒక లంచగొండి అధికారికి క్లీన్‌చిట్‌ వచ్చిందన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

Read Also: YSRCP: బీజేపీకి మళ్లీ వైసీపీ దగ్గరవుతుందా..?

ముఖ్యంగా… ఈ నెలలో రిటైర్‌ అవ్వాల్సిన శ్రీనివాస్‌ పదవీకాలాన్ని మరో రెండేళ్ళు పొడిగించడానికి ఫైల్‌ తయారు చేయడం, అదే సమయంలో ఆయన ఏసీబీకి పట్టుబడటంతో అనుమానాలు పెరుగుతున్నాయట. అంతే కాదు…, మేడమ్‌ వరలక్ష్మీ వ్రతానికి ఎంతోకొంత ఇవ్వాలనుకున్నానని గతంలో శ్రీనివాస్‌ మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటికి వచ్చి మంత్రి మెడకు చుట్టుకున్నట్టుందని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. తన శాఖలో జరుగుతున్న వ్యవహారాలను మంత్రి ఆ మాత్రం చూసుకోలేరా, లేక ఆంతా ఆమెకు తెలిసే జరుగుతోందా అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. పోరాడి గెలిచిన నియోజకవర్గానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలి కానీ, ఇలాంటి అక్రమార్కులకు సాయం చేసి పరువు తీయడం ఏంటని సొంత కేడర్ కూడా తప్పుపడుతున్నట్టు సమాచారం. తొందరపడి ధర్మాన్ని మరిస్తే ఇలాగే ఇంటుందని చెప్పుకుంటున్నారు మంత్రి వెల్ విషర్స్. గుమ్మడి సంధ్యారాణి వ్యవహారం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లిందని, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు ఏంటి, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశానికి సంబంధించి లోకేష్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్టు నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు గుమ్మడి సంధ్యారాణి ఇటీవల‌ రాజకీయ శత్రువులను పెంచుకున్నారన్నటాక్ నడుస్తోంది. మంత్రి వ్యవహారాలపై వీళ్లు ఎప్పటికప్పుడు కూపీ లాగుతున్నారన్నది సాలూరు వాయిస్‌. స్థానికంగా ఉన్న మంత్రి వ్యతిరేకులు పూర్తి నిఘా పెట్టి ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు పంపుతున్నారట. ఈ వ్యవహారం సంధ్యా రాణికి పెద్ద పొలిటికల్ సెట్ బ్యాక్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో ఆమెను మంత్రిగా కొనసాగిస్తారా లేక ఎప్పుడు మార్పులు చేపడితే అప్పుడు పక్కన పెట్టేస్తారా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయవర్గాల్లో.

Exit mobile version