Off The Record: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. సమస్య ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. బహిరంగ సభైనా.. అసెంబ్లీలోనైనా ధర్మాన ప్రసంగం ఒబ్బిడిగా.. సోది లేకుండా ఉంటుంది. ఈ విషయంలో విమర్శకుల ప్రశంసలు సైతం ధర్మానకే. ఆహార్యంలోనే కాదు.. మాటలోనూ గాంభీర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రసాదరావు ఇప్పుడు ప్రసంగాల్లో హుందాతనం కోల్పోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్.. వరుసగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం డిమాండ్ మొదలుకొని.. పవన్ కల్యాణ్ అభిమానుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నవారు.. ఈయన ఆ ధర్మానేనా? ఆ ధర్మానే అయితే ఆయనకు ఏమైంది? ఎందుకిలా మాట తూలుతున్నారు అని ప్రశ్నిస్తున్నారట.
Read Also: Off The Record: పవన్ కల్యాణ్‌పై గెలిచినా ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం లేదా? ఆయన వర్గంలో అసంతృప్తి
రీల్ లైఫ్ రియల్ లైఫ్ వేరు అంటూనే.. హీరోలకు అభిమానులుగా ఉండాలి కానీ నిజ జీవితంలో కాదని ఇటీవల ధర్మాన వ్యాఖ్యానించారు. ఆ చెప్పే విధానంలో వ్యంగ్యంతోపాటు తనదైన శైలిలో యువతను తిట్టిపోస్తున్నారు ఈ మంత్రిగారు. ప్రభుత్వం అన్నీ ఇస్తున్నా యువత సినిమా హీరో వెంట తిరగడం ఏంటని ధర్మాన ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తే రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాలోని యువత పవన్‌కు అనుకులంగా మారుతారేమోనన్న భయం మంత్రిలో ఉండొచ్చనేది కొందరి అభిప్రాయం. మంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలపై ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సిన పనిలేదనేది రాజకీయ వర్గాల వాదన. ఒకవేళ రాజకీయ విమర్శలు చేయాలని అనుకుంటే అదెలాగో ధర్మానకు చెప్పాల్సిన అవసరం లేదని.. కానీ ఆ లైన్ మీరి ఎందుకు మాట తూలుతున్నారో ఆలోచించాలని మరికొందరు చర్చకు పెడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మొదటి తూటా పేలేది వాలంటీర్లపైనే అని మంత్రి ధర్మాన మరో కామెంట్ చేశారు.
అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉన్న వాలంటీర్లు వైసీపీకి ఉపయోగపడాలనే అర్థం వచ్చేలా పద ప్రయోగం చేశారు. రైట్ డైరెక్షన్‌లోకి ప్రజలను తీసుకెళ్లకపోతే నష్టపోయేది వాలంటీర్లే అన్నది ధర్మాన మాట. అంటే గ్రౌండ్ లెవల్లో నెలకొన్న పరిణామాలేంటి? ఫీల్డ్ నుంచి మంత్రికి అందుతున్న ఫీడ్ బ్యాక్ ఏంటి? ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాలంటీర్ల విషయంలో ఆ వ్యాఖ్యలు చేశారు అనేది ప్రశ్న. మంత్రి ధర్మాన ప్రసాదరావులో అసంతృప్తి స్థాయిలు పెరగడం వల్లే ఆయన గతానికి భిన్నంగా మాట్లాడుతున్నారనేది పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ. ప్రజలను నిందించడం.. ఏ పార్టీ ఏం చేస్తుందో తెలుసుకుని చైతన్యం కావాలని చెప్పడం ఆయనలోని అసహనాన్ని, అభద్రతను తెలియజేస్తున్నాయని మరికొందరు భావిస్తున్నారు. తమ పార్టీ, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాల్సింది పోయి.. పరిధి దాటి విమర్శలు చేయడం.. ప్రత్యర్థులపై, యువతపై నిందలు వేసే పంథాను ధర్మాన ఎంచుకోవడమే చర్చగా మారుతోంది.