Off The Record: MIM హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన పార్టీగా ఇన్నాళ్లు గుర్తింపు ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోటీ చేయకపోయినా నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మహారాష్ట్ర, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంది. ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాలపై ఎంఐఎం దృష్టిపెట్టింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్-ఎంఐఎం వాగ్వాదంలో తాము ఈసారి కనీసం 50 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు అక్బరుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ పాతబస్తీలో MIM 8 నుంచి పది సీట్ల దాకా పోటీ చేస్తోంది. 2018 ఎన్నికల్లో ఏడుగురు MIM ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ సీట్లలో BRS-MIM ఫ్రెండ్లీ కంటెస్ట్‌గా ఉంటోంది. గతంలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లాంటి చోట్ల అభ్యర్థులను నిలబెట్టారు ఎంఐఎం నేతలు. 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో పోటీ చేసిన నవీన్ యాదవ్ ఏకంగా రెండోస్థానంలో నిలిచారు. రాజేంద్రనగర్‌లో కూడా ఫలితం తారుమారు చేసే సత్తా ఆ పార్టీకి ఉండటంతో అప్పుడు ఎంఐఎంతో మంతనాలు జరిగాయి. ఈసారి మాత్రం 50 సీట్లలో పోటీ చేస్తామన్న అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటనతో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది.
Read Also: Off The Record: పవన్ కల్యాణ్‌పై గెలిచినా ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం లేదా? ఆయన వర్గంలో అసంతృప్తి
రాష్ట్రంలోని తాండూరు, జహీరాబాద్, మహబూబాబాద్, బోధన్, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ అర్బన్, నల్లగొండ, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ముషీరాబాద్ లాంటి నియోజకవర్గాలపై MIM కన్నేసింది. అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రకటన చేసినప్పటి నుంచి ఇక్కడి ఎమ్మెల్యేల్లో ఒకటే టెన్షన్. మజ్లీస్ పార్టీ నిజంగా 50 చోట్ల పోటీ చేస్తుందా? పోటీ చేస్తే ఎన్ని ఓట్లను చీలుస్తుంది? MIM ఓట్లు చీల్చడం వల్ల ఎవరికి లాభం అనే చర్చల్లో మునిగిపోయారు గులాబీ ఎమ్మెల్యేలు. ఈ ప్రకటన తర్వాత అక్బర్‌తో కాంగ్రెస్ ముఖ్యనేతల మంతనాలు ఎమ్మెల్యేల హాట్ బీట్ మరింత పెంచుతోందట. స్వతంత్రంగా ఎంఐఎం పోటీ చేస్తే ఒక రకమైన నష్టం.. అదే ఇతర పక్షాలతో కలిసి పోటీ చేస్తే మరింత నష్టం అని అంచనా వేస్తున్నారట. మరి.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో.. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో క్లారిటీ వచ్చే వరకు అధికారపార్టీ శాసనసభ్యుల్లో టెన్షన్ తప్పకపోవచ్చు.