Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ఆ అంశం ఏంటి..?

Meenakshi Natarajan

Meenakshi Natarajan

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గుర్తించిందో ..లేదో గానీ… కార్యకర్తలకు,స్థానిక నేతలకు మధ్య గ్యాప్ అయితే బాగానే ఉందంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. రాను రాను అది బాగా పెరిగిపోతోందని, వెంటనే సెట్‌ చేయకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పుకుంటున్నారు. ఈ జిగ్‌జాగ్‌ సిస్టంని సెట్ చేయాల్సిన బాధ్యత అయితే… రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ మీద ఉందని, కానీ… ఆమె ఆ పనిలో ఉన్నారో లేదో అర్ధం కావడం లేదని పార్టీ వర్గాలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి మీనాక్షి నటరాజన్‌ హార్డ్‌కోర్‌ కాంగ్రెస్‌ వాది. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలు. ఆ విషయంలో ఎక్కడా ఎవరికీ రెండో ఆలోచనే లేదు. సింపుల్‌ లైఫ్‌ స్టైల్‌లో వచ్చిన కొత్తల్లో పార్టీ వర్గాలను బాగానే ఆకట్టుకున్నారు. దాంతో… ఇక ఫర్లేదు…. ఆమె పార్టీని ట్రాక్‌లో పెడతారు. ఆల్‌సెట్‌ అని అనుకున్నారు అంతా. కానీ… టైం గడిచేకొద్దీ… అసలేం జరుగుతోందో కాంగ్రెస్‌ నాయకులకు కూడా అర్ధం కావడం లేదట. మీనాక్షి ఇన్ఛార్జ్‌గా వచ్చి నెలలు గడుస్తున్నా… ఆశించిన వేగంగాని, నిర్దిష్ట కార్యాచరణగానీ… ఎక్కడా కనిపించడం లేదన్న ఫీలింగ్‌ కాంగ్రెస్‌ లీడర్స్‌లో పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పాత వారిని పక్కకు పెట్టిమరీ….. బయట నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న గగ్గోలు పెరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఏం చేయాలన్న క్లారిటీ లేదు. మంత్రులు జిల్లాలకు వెళ్తే… ఖచ్చితంగా అక్కడి పార్టీ ఆఫీస్‌కు వెళ్ళాలన్న నిబంధన అమల్లోకి రాలేదు. అలాగే… క్షేత్ర స్థాయిలో కూడా ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకే పెద్ద పీటవేస్తున్నారన్న విమర్శలున్నాయి. వాళ్ళు చెప్పిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని మండిపడుతున్నారు పాత నేతలు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెడుతున్నారు. ఇంతవరకు ఆ విషయాన్ని పట్టించుకుని సెట్‌ చేసే ప్రయత్నం మాత్రం జరగలేదు. దీంతో సొంత ఇంట్లో కిరాయి దారులుగా మారిపోయామంటూ… తెగ ఫీలైపోతున్నారట ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం పార్టీకి తలనొప్పులు తప్పవంటున్నారు సీనియర్స్‌. కొత్త పాత మిళితమైన నాయకత్వం అవసరమే గానీ…. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నడిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్‌ అన్నది ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ చేసిన పొరపాట్లే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తోందన్న ఫీలింగ్ పెరిగిపోతోందట పార్టీ వర్గాల్లో. సొంత వారికి ప్రాధాన్యత ఇస్తూనే… మిగిలిన వాళ్ళని వెంట నడుపుకోవాలని, అలా చేయకుంటే…. ఎన్నికల సమయంలో ఇలాంటివన్నీ కలగలిసి జటిలంగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయట కాంగ్రెస్‌ నాయకత్వానికి.

ఈ క్రమంలోనే…. కొత్త ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ పై చాలా ఆశలు పెట్టుకున్నా… ఆమె ఆ దిశగా దృష్టి పెడుతున్నారో లేదో కూడా అర్ధం కావడం లేదన్న చర్చ పెరుగుతోంది పార్టీలో. కాంగ్రెస్‌ నిర్మాణం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి అంతా చూసుకుంటారని భావిస్తున్నా…. ఆమె మాత్రం ఇప్పటివరకు గాంధీ భవన్‌కే పరిమితం అయ్యారన్న మాటలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లో సమస్యలు.. అంతర్గత కలహాలపై ఇంకా ఫోకస్ చేయలేదు. ఇటీవల జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల నియామకాల పరిశీలకుల సమావేశాల్లో కూడా ఒక్కో చోట ఒక్కో రకమైన గలాటా జరుగుతోంది. కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ వర్గం, ఇన్ఛార్జ్‌ శ్రీనివాస్ వర్గం మధ్య ఘర్షణ జరిగింది. గద్వాలలో ఎంపీ మల్లు రవి వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వివాదం నడుస్తోంది. ఇలాంటి వ్యవహారాలకు.. మొదట్లోనే చెక్‌ పెట్టకుంటే.. ముదిరి ముంచే ప్రమాదం ఉంటుంది. ఇలా… మీనాక్షి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలకు.. మేడం ఏం చెప్తారు.. సమస్యలు లేకుండా సెటిల్ చేస్తారా..? లైట్‌ తీస్కో అన్నట్టు దాటవేసుకుంటూ పోతారా అన్నది ప్రస్తుతానికి బిగ్‌ క్వశ్చన్‌.

Exit mobile version