Site icon NTV Telugu

Off The Record: ఎన్నారైల విషయంలో టీడీపీ అధిష్టానానికి జ్ఞానోదయం అయిందా..?

Otr Tdp

Otr Tdp

Off The Record: ఎన్నారైల విషయంలో టీడీపీ అధిష్టానానికి జ్ఞానోదయం అయిందా? ఏళ్ళ తరబడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాకుండా ఇన్‌స్టెంట్‌ నూడుల్స్‌ని నెత్తికి ఎక్కించుకుంటే ఏం జరుగుతుందో తెలిసొచ్చిందా? టిక్కెట్స్‌ రాని పార్టీ సీనియర్స్‌ అంతా కిక్కురుమనకుండా ఉంటే… డబ్బు సంచులతో దిగిపోయిన నూడుల్స్‌ నేతలు విమర్శించడాన్ని పసుపు పెద్దలు ఎలా చూస్తున్నారు? టీడీపీని విమర్శిస్తున్న ఎన్నారైలు ఎవరు?

అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఏడాదిన్నర టైం ఉందనగా… టీడీపీలోకి ఎన్నారైల వరద పారింది. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అని లేకుండా.. ఛాన్స్‌ ఉంటుందనుకున్న ప్రతిచోట ఇంపోర్ట్‌ అయిపోయారు ప్రవాసులు. కొందరైతే.. ఫలానా నియోజకవర్గం అని కాకుండా…పోటీ చేయడానికి ఏదోక నియోజకవర్గం ఇచ్చేయండి.. అంతా చూసుకుంటాం.. గెలిచి వచ్చేస్తాం అంటూ గప్పాలు కొట్టారు. అప్పట్లో పార్టీ హై కమాండ్‌ కూడా ఇలా వచ్చిన వారిలో కొందరిని ప్రోత్సహించింది. అలా అన్ని ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐలు వచ్చి పడిపోయారు. పార్టీలోకి వచ్చి పని చేస్తామన్నవారిని తామెందుకు కాదనాలనే రీతిలో అప్పట్లో అందరికీ ఓకే చెప్పింది అధినాయకత్వం. దీంతో స్థానికంగా ఉన్న నేతలకు.. కొత్తగా దిగుమతైన ఎన్నారైలకు క్లాష్‌ వచ్చింది. చాలా సెగ్మెంట్లలో రచ్చ మొదలైంది. పార్టీ పెద్దలు కూడా ఇదేంటని ప్రశ్నించిన స్థానిక నేతల్నే కంట్రోల్‌ చేయడంతో…. సణుక్కుంటూనే కాంప్రమైజ్‌ అయ్యారు చాలామంది. సెగ్మెంట్‌ భౌగోళిక స్వరూపం కూడా తెలియదు.. పార్టీలో ఎవరు పని చేసే వారు.. ఎవరు పక్క చూపులు చూసేవారో అర్ధంకాదు, అసలు ఎలక్షనీరింగ్‌ తెలియని వారు ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలరు..? అని లోలోపల రగిలిపోతూనే పనిచేశారు స్థానిక నేతలు. ఇన్నాళ్ల వ్యవహారం ఎలా ఉన్నా… ఇప్పుడు అసలు టైం వచ్చింది. దీంతో అన్ని రకాలుగా బేరీజు వేసుకున్న టీడీపీ అధిష్టానం.. ఓ రెండు చోట్ల టిక్కెట్స్‌ ఇవ్వడం తప్ప మిగతా వారిని పక్కన పెట్టేసింది. దీంతో ఇప్పుడు రగిలిపోవడం ఎన్నారైల వంతయింది. వ్యవహారం పార్టీని విమర్శించడం, పార్టీలు మారడందాకా వెళ్ళింది. ఎస్‌ కోట నుంచి టిక్కెట్‌ ఆశించిన గొంప కృష్ణా విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ తనను మోసం చేశారని.. తనకు అన్యాయం చేశారనే ఆరోపణలతో రోడ్డెక్కారాయన. అలాగే ఏలూరు పార్లమెంట్‌ సీటు ఆశించిన గొర్రెముచ్చు గోపాల్‌ యాదవ్‌ అయితే చంద్రబాబు, లోకేష్‌, యనమల వంటి వారిని తెగ విమర్శించేసి.. ఇప్పుడు తీరిగ్గా వైసీపీలో చేరిపోయారు.

ఎన్నికలకు ముందు ఇలా దిగుమతి అయిన ఎన్నారైలు కావచ్చు.. డబ్బు సంచులతో వచ్చే బడా బాబులు కావచ్చు.. ఏదేదో ఆశించి పార్టీలోకి వస్తారని.. వారికి ఎన్నిక చేత కాదని, ఎంత చెప్పినా.. వినకుండా అప్పట్లో ప్రోత్సహించారని.. ఇప్పుడు వాళ్లతోనే తిట్టించుకోవాల్సి వస్తోందన్నది టీడీపీలో లేటెస్ట్‌ టాక్‌. ఏళ్ళ తరబడి పార్టీ కోసం కష్టపడ్డవారిని కాకుండా డబ్బు సంచులతో వచ్చిన వాళ్లను ప్రోత్సహిస్తే రిజల్ట్‌ ఇలాగే ఉంటుందన్న సంగతి పెద్దలు గ్రహించాలంటున్నారు ఆయా నియోజకవర్గాల నాయకులు. టీడీపీలో చాలా మంది సీనియర్స్‌కు సైతం రకరకాల కారణాల వల్ల టిక్కెట్లు దక్కలేదు. అలాంటి వారంతా చంద్రబాబు జిందాబాద్‌ అంటూనే… ఉక్రోషం పట్టలేక ఏదో చిన్నపాటి ఆందోళనలు చేశారే తప్ప పార్టీని ఇబ్బంది పెట్టలేదని, మరి ఈ ఎన్నారైల వ్యవహారం ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని అంటున్నారు పార్టీ నేతలు. దేవినేని ఉమ, ఆలపాటి రాజా, బండారు సత్యనారాయణ, పీలా గోవింద్‌ లాంటి సీనియర్స్‌ని ఉదహరిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు అన్న సంగతిని టీడీపీ పెద్దలు గుర్తించగలిగితే అదే పదివేలంటున్నారు. ఇలా.. డబ్బు సూట్‌కేసులేసుకుని విమానాల్లో దిగిపోయిన వాళ్ళని నెత్తిన ఎక్కించుకుంటే… చివరికి పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవడం తప్ప ఏం మిగలదని అంటున్నారు. ఈ అనుభవాల తర్వాతైనా పార్టీలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది.

 

Exit mobile version