NTV Telugu Site icon

Off The Record: కామ్రేడ్స్‌ కంట్లో నలుసు పడిందా? వాళ్లు అనుకున్నదొక్కటీ.. అవుతోంది ఒక్కటా?

Left Parties

Left Parties

Off The Record: వచ్చే ఎన్నికల్లో BRS, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మునుగోడు బైఎలక్షన్‌ తర్వాత చర్చ ఊపందుకుంది. ఉభయ పక్షాల నుంచి ఈ దిశగా ప్రకటనలు వచ్చాయి.. మాటలు కలిశాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్‌, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేస్తాయా? అని ఆరా తీస్తున్నారు. తాజాగా వామపక్ష శిబిరాల నుంచి వస్తున్న స్టేట్‌మెంట్లతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. పొత్తులో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని ఇన్నాళ్లూ సీపీఐ, సీపీఎం వర్గాల్లో చర్చ నడిచింది. కామ్రేడ్లు ఎక్కడ తమ సీట్లకు ఎసరు పెడతారో అని గులాబీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందేవారు. అయితే బీఆర్ఎస్‌ అనుసరిస్తున్న తీరుపై కమ్యూనిస్టులు అసంతృప్తితో ఉన్నారట. లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉంటుంది కానీ.. సీట్లు ఇవ్వబోరని అడపాదడపా మంత్రులు కామెంట్స్‌ చేస్తున్నారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలపై ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికలు… పొత్తులు గురించి చర్చ రాకముందే .. మంత్రుల అలా ఎలా వ్యాఖ్యలు చేస్తారని కామ్రేడ్లు ప్రశ్నిస్తున్నారట. రాజకీయంగా తమను దెబ్బతీసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అని CPI, CPM నేతలు సందేహిస్తున్నారట. CPM అయితే ఓ అడుగు ముందుకేసి.. మంత్రులను కట్టడి చేయాలని బీఆర్‌ఎస్‌ను కోరింది.

Read Also: Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..

ఉభయ కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పట్టు ఉంది. గెలిచే నియోజకవర్గాలు ఎక్కువ లేకపోయినా… గెలవడానికి సరిపడా మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నామనేది లెఫ్ట్ నేతల భావన. ఇటీవల మునుగోడు ఉపఎన్నికలో లెఫ్ట్ పార్టీల మద్దతుతోనే గులాబీ పార్టీ బయటపడిందనేది కమ్యూనిస్ట్‌ నాయకుల వాదన. వచ్చే ఎన్నికల్లో CPI, CPMలు తలా రెండు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. అయితే లెఫ్ట్ అడిగే సీట్స్‌ ఇవ్వడానికి అధికారపార్టీ అనుకూలంగా లేదనే ప్రచారం జరుగుతోంది. CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేస్తారని లీకులు వచ్చాయి. CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో పోటీ చేస్తారని చర్చ సాగింది. వీటికి తోడు CPM మిర్యాలగూడ కోరుకుంటోంది. CPI మునుగోడు, దేవరకొండ, హుస్నాబాద్‌లలో పోటీ చేయాలని అనుకుంటోంది. అధికారపార్టీ మాత్రం ఎన్నికల్లో లెఫ్ట్‌తో కలిసి పనిచేయడమే తప్పితే సీట్లు ఇవ్వబోరనే చర్చ మొదలుకావడంతో కమ్యూనిస్టులు కలవర పడుతున్నారట. ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా అధికారపార్టీ మరో ప్రత్యామ్నాయం చూపిస్తుందని అనుకుంటున్నారు. ఉభయ లెఫ్ట్ పార్టీలకు MLC ఆఫర్‌ చేయొచ్చని టాక్‌. మార్చి, మే నెలలో దాదాపు 7 శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిల్లో CPI, CPMలకు చెరో సీటు ఇస్తారా లేక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మండలి స్థానాలు ఆఫర్‌ చేస్తారా అనేది స్పష్టత లేదు. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌కు సీట్లు ఇచ్చే ఆలోచనలో బీఆర్‌ఎస్‌ లేదని ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీ చేసే ప్రతిపాదనలపై ఏం చేయాలనే దానిపై ఉభయకమ్యూనిస్టు పార్టీలు త్వరలో సమావేశం కాబోతున్నాయి. పొత్తులో భాగంగా తమకు సీట్లు ఇస్తే అది అధికార పార్టీకే లాభమని.. లేదంటే ఇబ్బందులు తప్పవనే సంకేతాలు పంపే ఆలోచనలో కామ్రేడ్లు ఉన్నారట. పరస్పరం సహకారం లేకపోతే పొత్తులు ఎలా పొడుస్తాయనేది వాళ్ల ప్రశ్న. అందుకే ఎర్రగులాబీల పొత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.