NTV Telugu Site icon

Off The Record: కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ.. అధిష్ఠానం మల్లగుల్లాలు

Kadapa Tdp

Kadapa Tdp

Off The Record: కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం. లింగారెడ్డి ఉన్నారు. వచ్చే మార్చి నాటికి ఆయన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతుంది. 2024లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్టీ జిల్లా పగ్గాలు మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందట. అయితే ఎవరిని ఆ హాట్ సీటులో కూర్చోబెట్టాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జుల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన సమయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు సమాచారం. కడప జిల్లా టీడీపీ చీఫ్‌ అయ్యేందుకు పలువురు నాయకులు బలంగా లాబీయింగ్‌ చేస్తున్నారట. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న ఆర్‌. శ్రీనివాసులరెడ్డి కడప జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తితో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయనే కడప ఎంపీగా పోటీ చేస్తారని అనుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో శ్రీనివాసుల రెడ్డే చక్రం తిప్పారు. 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లా అధ్యక్షులు వచ్చారు. ఆ విధంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు లింగారెడ్డి చేతికి వచ్చాయి. అయితే పార్టీకి లింగారెడ్డి ఏమీ చేయలేదని స్వపక్షంలోని ఆయన వైరివర్గం విమర్శ. ఆర్. శ్రీనివాసులరెడ్డి ఆసక్తితో ఉన్నా.. ఆయన పేరును ఎందుకు ఖరారు చేయడం లేదన్నది తెలుగు తమ్ముళ్ల ప్రశ్న.

Read Also: Off The Record: పవన్‌ కల్యాణ్‌పై గెలిచినా ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం లేదా? ఆయన వర్గంలో అసంతృప్తి

పార్టీ పదవి కోసం ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కూడా పోటీ పడుతున్నారట. ప్రస్తుతం పులివెందుల అసెంబ్లీ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు బీటెక్‌ రవి. గతంలోనూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేస్‌లో రవి పేరు వినిపించింది. ఏ కారణాలవల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు బీటెక్‌ రవి పేరు మరోసారి చర్చల్లో నలుగుతోంది. ఇటీవల పులివెందుల ఇంఛార్జ్‌ హోదాలో టీడీపీ పెద్దలతో రవి భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే తనకు జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆయన కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పులివెందుల టికెట్‌ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని.. జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే చాలని రవి చెప్పారట. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను తనకు అనుకూలంగా వర్గాలను తయారు చేసుకుని బీటెక్‌ రవి అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్‌. శ్రీనివాసులరెడ్డికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు, కేడర్‌ రవితో టచ్‌లోకి వెళ్తోందట. ఈ క్రమంలో పోటాపోటీగా పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్తున్నాయట. ప్రస్తుతం ఈ విషయంలో వాసు, రవి ప్రయత్నాలు టీడీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అయితే పార్టీ పదవుల విషయంలో ఈ స్థాయిలో నాయకులు తెరవెనుక వేస్తున్న ఎత్తుగడలే తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తున్నాయట. మరి.. అధిష్ఠానం ఈ ఇద్దరిలో ఒకరికి పట్టం కడుతుందో లేక కొత్త వారిని ఎంపిక చేస్తుందో కాలమే చెప్పాలి.