Site icon NTV Telugu

Off The Record: జేసీ బ్రదర్స్ పోలీసులను టార్గెట్ చేశారా?

Jc Brothers

Jc Brothers

Off The Record: దూకుడు, తెగింపు లేకుంటే రాజకీయాల్లో రాణించడం కష్టమని అంటారు. ఆ విషయంలో జేసీ బ్రదర్స్‌ ఒక ఆకు ఎక్కువే చదివారని అంటారు పొలిటికల్‌ పండిట్స్‌. పొజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా… చట్టం మా చుట్టం అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటుందన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. మరీ… ముఖ్యంగా పోలీసుల విషయంలో జేసీ బ్రదర్స్‌ వైఖరి ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కూడా ఎదుర్కొన్నారు… మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పుడు అదే బాటలో ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. 2018లో తాడిపత్రి ప్రాంతంలో ప్రభోదానంద స్వామి ఆశ్రమంపై దాడి జరిగినప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సమయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని, పోలీసుల్లో మగాళ్లే లేరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దివాకర్‌. ఆ ఘటన తర్వాత పోలీసు అధికారుల సంఘం తరఫున స్పందించిన అప్పటి జిల్లా కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని అన్నారు.

అయితే… తనను వ్యక్తిగతంగా దూషించారని భావించిన సీనియర్‌ జేసీ… అప్పుడు తాడిపత్రి పోలీసుస్టేషన్‌లో మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా పోలీసుల టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలే చేశారు దివాకర్‌రెడ్డి. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక, చెప్పినట్లు వినే పోలీసులను తెచ్చుకుంటామని అన్నారు. మొదట్లో పోలీస్‌గా ఉన్నప్పుడు దివాకర్ రెడ్డి మీద మీసం మెలేసి కౌంటర్ ఇచ్చిన గోరంట్ల మాధవ్‌…. ఎంపీ అయ్యాక కూడా అగే ఊపు కొనసాగించారు. పోలీసులు అంటే… ఎవరి బూట్లో నాకేవారు కాదంటూ… పోలీస్ బూట్లను ముద్దాడి జేసీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పుడు తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి కూడా అదే తరహాలో అన్న బాటలోనే వెళ్తున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. తాడిపత్రి ఏఎస్పీగా పనిచేస్తున్న రోహిత్ కుమార్ చౌదరిపై తాజాగా నోరు పారేసుకున్నారు ప్రభాకర్‌రెడ్డి. అందునా పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. నా దగ్గరా… గన్‌ ఉంది, దానికీ లైసెన్సు ఉంది.. మీ ఇంట్లోకి దూరతానంటూ తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారాయన. అసలు నువ్వు పోలీసు ఉద్యోగానికి పనికిరావు, నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చారంటూ ఏఎస్పీని ఉద్దేశించి ఇష్టానుసారం నోరు పారేసుకోవడంపై మండి పడుతున్నాయి పోలీస్‌ సంఘాలు. అతనికి చదువు మాత్రమే ఉంది.. బుద్ధి, జ్ఞానం, తెలివి లేవు, ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడు.. ఏఎస్పీ కార్యాలయం ముందు నేను నిరసన చేస్తే.. రోహిత్ బయటకు రాకుండా దాక్కున్నాడని వెటకారంగా మాట్లాడ్డంపై పోలీస్‌ వర్గాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు ప్రభాకర్‌రెడ్డి. ఆ వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని పోలీస్ అధికారుల సంఘం అడహక్ కమిటీ డిమాండ్ చేసింది. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల సేవలను కీర్తిస్తుంటే.. ఇంకోవైపు అదే పార్టీకి చెందిన వ్యక్తి ఇలా దూషించడమేంటని ప్రశ్నిస్తున్నాయి సంఘాలు. తాడిపత్రి ఈరోజు ప్రశాంతంగా ఉందంటే… ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి చర్యల వల్లనేనని చెబుతున్నారు పోలీస్‌ సంఘాల నేతలు. ఏఎస్పీ వల్ల ఏదైనా తప్పు జరిగితే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు కానీ.. ఇలా బహిరంగంగా మాట్లాడటం ఏంటన్నది వాళ్ల క్వశ్చన్‌. మరోవైపు పోలీస్‌ అధికారుల సంఘం అంటే ఏంటి? దానికి రిజిస్ట్రేషన్ ఉందా.. ఉంటే చూపించాలంటూ తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్స్‌ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీస్ అధికారుల సంఘంలో ఉన్నవారు అసలు డ్యూటీలు చేయరా వారు యూనిఫాం వేసుకోకుండా టైంపాస్ చేస్తూ తిరుగుతూ ఉంటారని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జెసి ప్రభాకర్ రెడ్డి చేయడం పుండు మీద కారం చల్లినట్టయింది. ఈ వివాదంపై జిల్లా ఎస్పీ జగదీష్ కూడా స్పందించారు. జేసీ మీద చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సంగతి ఎలాఉన్నా… అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు… ఇలా జేసీ సోదరులు ఇద్దరూ తాము చట్టానికి అతీతులం అన్నట్టుగా పోలీస్‌ అధికారుల మీద నోరు పారేసుకోవడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.

Exit mobile version