Off The Record: అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…100 శాతం స్ట్రైక్ రేట్‌తో అధికారంలోకి వచ్చాక కూడా జనసేన నడవడికలో తడబాటు కనిపిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికల వరకు అన్ని రకాలుగా పార్టీని ముందుండి నడిపించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీ అయ్యారు. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి హోదాలో బిజీ అవడంతో… పార్టీ వ్యవహారాలు గాడి తప్పుతున్నాయన్న అభిప్రాయం సొంత వర్గాల్లోనే బలపడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ నేతలతో సమావేశాలు తగ్గడంతో నాయకులు కార్యకర్తలకు దూరం అవుతున్నారన్న ఫీలింగ్ బలపడుతోంది. అదే సమయంలో నిజంగా పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో… పార్టీ గాడి తప్పకుండా…చర్యలు తీసుకుంటూ కొత్త నేతకు బాధ్యతలు అప్పగించారట పవన్‌కళ్యాణ్. బయట ఎక్కడా పెద్దగా ఎక్స్‌పోజ్ అవకుండా…ఏళ్ళ తరబడి తనతో కలిసి ప్రయాణిస్తున్న రామ్ తాళ్లూరికి కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న రామ్… ఇకపై పూర్తి స్థాయిలో జనసేన వ్యవహారాలు చూడబోతున్నట్టు తెలిసింది.
ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాళ్ళూరి సినీ నిర్మాత, వ్యాపార వేత్త. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నా… ఎప్పుడూ పదవుల్లో లేరు. కానీ… ఇప్పుడు మారిన పరిస్థితులు, పార్టీ అవసరాల దృష్ట్యా ఆయన్ని తెర మీదికి తెచ్చారట పవన్. ప్రస్తుతం ఆయన మంగళగిరి జనసేన కార్యాలయం నుంచే ఏపీ, తెలంగాణలోని పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పార్టీ కమిటీల్ని రద్దు చేసి కొత్త వాటిని ఏర్పాటు చేసే పెద్ద పనిని కూడా రామ్ తాళ్లూరికే అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం ఆయన వరుసగా పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లతో భేటీ అవుతున్నారట. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్… అందుకోసం ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కోసం పార్టీని సిద్ధం చేసే బాధ్యతను కూడా తాళ్లూరి భుజాల మీదే పెట్టినట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు, పార్టీ నాయకత్వానికి మధ్య వచ్చిన గ్యాప్‌ను తగ్గించడమే ఇప్పుడు రామ్ ముందున్న పెద్ద టాస్క్ అని, దాన్ని బట్టే… స్థానిక ఎన్నికల్లో ఎంత వరకు పర్ఫామ్ చేస్తామన్నది ఆధారపడి ఉంటుందని మాట్లాడుకుంటున్నాయి జనసేన వర్గాలు.
అలాగే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో నాయత్వాన్ని మార్చేసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం మొదలైందట. వోవరాల్‌గా రెండు రాష్ట్రాల్లో జనసేన భవిష్యత్ రూట్ మ్యాప్‌ని రామ్ తాళ్లూరి చేతుల్లో పెట్టారు పవన్. 2018 నుంచి ఇప్పటి వరకు జనసేన రాజకీయ వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నడిచాయి. ఒక దశలో పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా కీలక నిర్ణయాలన్నీ మనోహర్ చేతుల్లోనే ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మనోహర్ అనుమతి తప్పనిసరి అన్న వాతావరణం పెరిగిపోతోందని అప్పట్లో కొందరు నాయకులు ఆరోపించారు. కానీ… ఇప్పుడు ఆయన మంత్రి అయ్యాక కుదరకపోవడంతో…ఆ బాధ్యతలను రామ్ తాళ్లూరికి అప్పగించారన్నది ఇంటర్నల్ టాక్. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసుకుంటున్నారు. నాగబాబుకే పార్టీ వ్యవహారాల బాధ్యత ఇస్తారని కూడా ఒక దశలో ప్రచారం నడిచింది.కానీ సడన్‌గా రామ్ పేరు బయటికి రావడం, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతో జనసేనలో పెద్ద మార్పులే జరగబోతున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు.