Off The Record: తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే బెందాళం అశోక్. ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవిలో కూడా ఉన్నారాయన. అయితే… ఇన్నేళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులే ఆయన మీద గుర్రుగా ఉన్నారట. అదే సమయంలో ఇన్నిసార్లు గెలిపిస్తే.. నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారు సార్.. అన్న ప్రశ్నలు సైతం ప్రజల నుంచి మొదలవుతున్నాయి. ఇప్పటిదాకా లేనిది, ఉన్నట్టుండి ఈ మార్పు ఏంటంటే… అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయన్నది పరిశీలకుల మాట. ఈ టీడీపీ కంచుకోట మీద 2019-24 మధ్య తాము అధికారంలో ఉన్నప్పుడు బాగా ఫోకస్ పెట్టింది వైసీపీ. ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కలిపి ఉద్దానంగా పిలుస్తారు. ఇక్కడి ప్రజలకు కిడ్నీ వ్యాధులన్నది కామన్‌గా, ఇంకా చెప్పాలంటే ఉసురు తీసే మహమ్మారిగా మారిపోయింది. దీంతో ఆ పాయింట్‌నే బేస్ చేసుకుని… కిడ్నీ వ్యాధుల సమస్యకు పరిష్కారం వైపు అడుగులు వేసింది నాటి వైసీపీ సర్కార్. వరుసగా ఎన్నికల్లో ఓటములు ఎదురవుతున్నా… తగ్గకుండా.. ఇచ్చాపురానికి ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ హైకమాండ్. ఓవైపు ఇక్కడి ప్రధాన సమస్యను పరిష్కరించే అంశం మీద దృష్టి పెడుతూనే… మరోవైపు రాజకీయంగా కూడా పార్టీని బలపరిచే చర్యలు తీసుకున్నారు అప్పట్లో. ఆ క్రమంలోనే… ఇచ్ఛాపురం వైసీపీ నేతలకు రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు దక్కాయి.
Read Also: US tariff on India: ట్రంప్ టారిఫ్ బాంబ్.. స్పందించిన భారత్.. ఏమన్నదంటే?
ఎమ్మెల్సీ నర్తు రామారావు , జడ్పీ చైర్‌పర్సన్ పిరియ విజయలక్మితోపాటు డీసీఎంఎస్ చైర్మన్ , బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ సహా పలు డైరెక్టర్ పోస్టులు కూడా ఈ నియోజకవర్గానికే ఇచ్చారు అప్పట్లో. కానీ….2024 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ఓటమి తప్పలేదు. ఆ ఓటమి సంగతి అలా ఉంచితే… తమ నియోజకవర్గానికి వైసీపీ అంత ప్రాధాన్యం ఇస్తే… వరుసగా గెలిపిస్తూ… నెత్తిన పెట్టుకుంటున్న టీడీపీ ఏం ఇస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయట ఇప్పుడు. ప్రత్యేకించి ఎమ్మెల్యే బెందాళం అశోక్ పని తీరు, ఆయన సాధించిన పదవుల గురించి సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులే ముఖం చిట్లిస్తున్నారట. ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటన్నది వాళ్ళ క్వశ్చన్. అటు మూడు సార్లు ఆయన కోసం కష్టపడి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టినా, తమను అస్సలు పట్టించుకోవడం లేదంటూ పదనుల విషయంలో తీవ్ర అసహనంగా ఉన్నారట తమ్ముళ్ళు. ఎమ్మెల్యే వైఖరిపై గుర్రుగా ఉన్నా… బయటపడలేక పోతున్నారట టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు సౌమ్యుడిగా పేరుంది. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కూడా చెప్పుకుంటారు. అయినాసరే… ఏం లాభం ఎలాంటి అభివృద్ధి చేయకుండా, హైకమాండ్ మీద వత్తిడి తెచ్చి నియోజకవర్గానికి పదవులు సాధించకుండా… కేవలం మంచితనం ఒక్కటే ఉంటే సరిపోతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయట సొంత కేడర్‌లోనే. ఆయనకు తన సొంత సామాజికవర్గం కాళింగుల మద్దతుతో పాటు మత్స్యకార గ్రామాల్లో పార్టీకి ఎన్టీఆర్ టైమ్ నుంచే గట్టి పట్టు ఉంది. బలమైన క్యాడర్ వెన్నుదన్ను ఉండటం ప్లస్ అయితే…నియోజకవర్గం అభివృద్ధి మీద ఆయన ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదన్నది మైనస్ అవుతోందని అంటున్నారు. ఇచ్ఛాపురంలో టీడీపీ 8 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది.
Read Also: Rakshabandhan Gifts: రాఖీ స్పెషల్.. మీ సోదరికి ట్రెండీ గాడ్జెట్‌లను గిఫ్ట్ గా ఇవ్వండి.. బెస్ట్ ఇవే!
ఇక వైసీపీ ఎంత ప్రయత్నించినా… బోణీ కొట్టలేకపోయింది. ఇక్కడి జనం అంతలా ఆదరించినా… ఉద్దానంతో పాటు అనేక సమస్యలకు ఎమ్మెల్యే పరిష్కారం చూపలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి మాట అలా ఉంటే… నామినేటెడ్ పదవుల విషయంలో కేడర్ చాలా అసహనంగా ఉందట. ఎమ్మెల్యే బెందాళం ఒక్క రాష్ట్ర స్థాయి పదవిని కూడా నియోజకవర్గానికి ఇప్పించలేకపోయారని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే కోపంగా ఉన్నారట. అయితే… ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. పెద్ద పెద్ద పదవుల్ని ఇక్కడి నేతలకు ఇప్పిస్తే… తన అస్తిత్వానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని ఎమ్మెల్యే బెందాళం భయపడుతున్నట్టుందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి లోకల్‌గా. దాంతో… దశాబ్దాలుగా పార్టీని, అశోక్‌ని నమ్ముకుని రాజకీయం చేస్తున్న వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా లోలోపల మథనపడుతున్నారట. రాష్ట్రానికి చివరన, ఒడిశా పక్కన విసిరేసినట్టు ఉన్న తమ నియోజకవర్గం టీడీపీ అధిష్టానానికి కనిపించడం లేదో… లేక వాళ్ళు ఇస్తామన్నా… మా నాయకుడు పట్టించుకోవడం లేదోగానీ…. మాకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆవేదనగా ఉన్నారట ఇచ్ఛాపురం తమ్ముళ్ళు. దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న వాళ్ళను అధికారంలో ఉన్నప్పుడు కూడా వదిలేస్తే… రేపు ఏం జరుగుతుందో ఎవరు చూడొచ్చారంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారట కొందరు.
