NTV Telugu Site icon

Off The Record: క్లారిటీ ఇవ్వమని పెద్దోళ్లు చెప్పారా.. ? ఆదినే ఇచ్చాడా..?

Hyper Aadi

Hyper Aadi

Off The Record: పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. మెగా కాంపౌండ్‌లో వీళ్ళిద్దరికి ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్‌ టాప్‌ ఫైవ్‌లో ఉన్న ఈ స్టార్స్‌ ఇద్దరూ ఒక రకంగా తెలుగు సినీ రంగాన్ని శాసిస్తున్నారు. అంతవరకు ఓకే గానీ… ఆ మధ్య జరిగిన రకరకాల పరిణామాలతో ఇద్దరి మధ్య ఏదో… పైకి కనిపించని అగాధం ఉందన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆధిపత్య పోరుతో అంతరం పెరిగిందన్న మాటలు కూడా వినిపించాయి. వాటికి ఊతమిస్తున్నట్టుగా జరిగాయి కొన్ని పరిణామాలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైంలో అల్లు అర్జున్‌ వ్యవహారశైలే అందుకు కారణం అన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అప్పట్లో ఆయన నంద్యాల టూర్‌పై వంద సందేహాలు వ్యక్తం అయ్యాయి.

తాజా ఎన్నికల్లో డూ ఆర్‌ డై అన్నట్టుగా పోరాడాయి వైసీపీ, కూటమి పార్టీలు. అందులోనూ.. ఈసారి వైసీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వబోనని శపథం చేసిన పవన్‌ కళ్యాణ్‌ తాను ఎక్కడ తగ్గాలో తెలుసుకుని మరీ… చివరికి నెగ్గారు. వంద శాతం స్ట్రైక్‌ రేట్‌తో సూపర్‌ హిట్‌ అయింది జనసేన. ఆయన పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో అప్పట్లో పలువురు టాలీవుడ్‌, టీవీ నటులు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. పవన్‌ తరపున ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం గతానికి భిన్నంగా ఈసారి ఓపెనైపోయింది. పవన్‌ను గెలిపించాలంటూ కుటుంబ సభ్యులంతా ప్రచారం చేశారు. చిరంజీవి నేరుగా వెళ్ళలేదుగానీ.. పవన్‌కు మద్దతుగా వీడియో సందేశం పంపారు. ఆయన తప్ప మిగతా ఫ్యామిలీ మొత్తం నేరుగా ఫీల్డ్‌లోకి దిగేసింది. అయితే… అదే టైంలో అల్లు అర్జున్‌ వ్యవహార శైలి మీద రకరకాల సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన పిఠాపురం వైపు చూడలేదు సరే… జనసేన ప్రత్యర్థిగా భావించే వైసీపీ తరపున నంద్యాలలో పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించారు. పోలింగ్‌కు ముందు ఆయన ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. తనవాళ్ళు ఎక్కడున్నా వెళ్తానని, వాళ్ళ మేలు కోరుకుంటానని ఆ టైంలో చెప్పారు అల్లు అర్జున్‌. అక్కడే అందరికీ డౌట్‌ కొట్టింది. అంటే … పవన్‌కళ్యాణ్‌ ఆ… తనవాళ్ళ లిస్ట్‌లో లేరా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. శిల్పా రవి కోసం నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్‌.. పవన్‌కు మద్దతుగా కేవలం ఒక ఎక్స్‌ మెస్సేజ్‌తో సరిపెట్టడం ఏంటన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తం అయ్యాయి.

అంటే.. ఇద్దరి మధ్య పైకి కనిపించని అగాధం ఉందా? ఆధిపత్య పోరు నడుస్తోందా అన్న ప్రశ్నలు సైతం వచ్చాయి. దానికి కొనసాగింపుగా నాగబాబు పెట్టిన మరో మెస్సేజ్‌ ఇంకా కాక రేపింది. మేలు కోరే వాడు పరాయివాడైనా మనోడే… కోరని వాడు మనోడైనా పగోడేనంటూ నాగబాబు పెట్టిన మెస్సేజ్‌తో లోలోపల ఏదో జరిగిపోతోందన్న డౌట్స్‌ ఇంకా పెరిగిపోయాయి. నాలుగైదు రోజుల పాటు ఆ ఎపిసోడ్‌ అలా నడిచింది. తర్వాత నాగబాబు తన మెస్సేజ్‌ను ఎక్స్‌ నుంచి డిలీట్‌ చేసినా జనంలో పెరగాల్సిన డౌట్స్‌ మాత్రం పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు రావడం, జనసేన జయకేతనం ఎగరేయడంతో… ఆ ఎపిసోడ్‌ను మర్చిపోయారు అంతా. కానీ… ఇప్పుడో సినిమా ఆడియో ఫంక్షన్‌లో నటుడు హైపర్‌ ఆది మళ్ళీ తేనెతుట్టెను కదిపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ అల్లు అర్జున్‌కు, పవన్‌ కళ్యాణ్‌కు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, మీరు అనవసరంగా ట్రోలింగ్‌ చేయవద్దని అన్నారాయన. మెగా కాంపౌండ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆదికి గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడీ ప్రస్తావన చేయడం చుట్టూనే కొత్త చర్చ మొదలైంది. సరే… జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పవన్‌ సినిమాల కంటే పాలిటిక్స్‌ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇంకా అనవసర వివాదాలు ఎందుకనుకుంటూ.. టైం చూసి క్లారిటీ ఇచ్చేయమని పెద్దోళ్ళే ఆదిని పురమాయించారా? లేక ఆ ఫ్యామిలీ మీదున్న అభిమానంతో ఆయనే స్వతంత్రించి అలా చెప్పేశారా అని ఆరా తీసే పనిలో ఉన్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ వాళ్ళే చెప్పి ఉంటే… పవర్‌లో ఉన్న పవన్‌తో ఇక ఎందుకని అనుకున్నారా? అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. కారణం ఏదైనా సరే… తాజా సినిమా ఫంక్షన్‌లో హైపర్‌ ఆది చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశం అయ్యాయి.