Off The Record: టెక్కలి. అధికార వైసీపీ దృష్టి సారించిన కీలక నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కానీ.. టెక్కలి వైసీపీలో మూడు గ్రూపులు. నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీని చేసి అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పినా.. గ్రౌండ్‌లో పరిణామాలు మరోలా ఉన్నాయని పార్టీ వర్గాల మాట. అధినేత తిలకం దిద్దినా.. దువ్వాడ సరిగా కుదురుకోలేకపోతున్నారట. ఇంటా బయటా రాజకీయాల్లో గెలవలేకపోతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండా ఎగరేయాలనేది అధిష్ఠానం ఆలోచన. అందుకే ఎన్నికలకు రెండేళ్ల ముందే దువ్వాడను అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. దువ్వాడపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండటంతో.. ఆయనతో విభేదించేవాళ్లు కలిసి పనిచేయలేమని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ.. అధిష్ఠానం మాటను కాదనలేక కామ్‌గా ఉండిపోయారు. వాస్తవానికి టెక్కలి వైసీపీలో దువ్వాడ, పేరాడ తిలక్, కిల్లి కృపారాణిల వర్గాలు యాక్టివ్. వీళ్లందరినీ కలుపుకొని వెళ్లాల్సిన దువ్వాడ మాత్రం ఆ పనిలో ఒక అడుగు కూడా ముందుకేయలేదని చెబుతున్నారు. గతంలోలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోయినా.. అంతర్గతంగా ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారట ఈ ముగ్గురు నేతలు.
Read Also: Off The Record: చేరికల్లేక టి.బీజేపీలో నేతలు దిగాలు.. వచ్చేవారిని అడ్డుకుంటున్నారా?
టెక్కలి వైసీపీ వర్గపోరును పరిష్కరించే బాధ్యత ధర్మాక కృష్ణదాస్, బొత్స సత్యనారాయణకు అధిష్ఠానం అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో దువ్వాడ ఎమ్మెల్యేగా గెలిస్తే.. పేరాడ తిలక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. అయినప్పటికీ గడపగడపకు తిరుగుతున్న దువ్వాడకు నందిగాం మండలంలో పట్టున్న పేరాడ కలిసి రాలేదట. ఏ పదవీ లేక ఉస్సూరుమంటూ ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. వైసీపీకి ఆమె విధేయత ప్రకటిస్తున్నా.. దువ్వాడ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. పైగా ఇటీవల పార్టీలో చేరిన ఓ మహిళకు టెక్కలి వైసీపీ మహిళా అధ్యక్ష పదవి ప్రతిపాదించడంతో రెబల్స్ ఇంకా మండిపోతున్నారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్నవారిని కాదని కొత్తవారికి పదవులు కట్టబెట్టడంపై విమర్శలు రావడంతో దువ్వాడ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. టెక్కలి వైసీపీలో ఈ కుమ్ములాటలు ఎన్నికల్లో తమకు ప్లస్ అవుతాయని టీడీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారట. స్థానిక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌పై విమర్శలు చేసినప్పుడల్లా అంతే స్థాయిలో దువ్వాడ విరుచుకుపడుతున్నారు. అయితే నోరు పారేసుకోవడం తప్పితే దువ్వాడ వైసీపీ బలోపేతానికి చేసింది ఏమీ లేదని పార్టీ వర్గాల విమర్శ. ముందు ఇంటిపోరు చక్కదిద్ది.. తర్వాత జనాల్లోకి వెళ్తే మంచిదని సలహా ఇస్తున్నారట. అందుకే టెక్కలి సమస్యను కొలిక్కి తెచ్చేందుకు అధిష్ఠానం కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోందని చెబుతున్నారు. అయితే అభ్యర్థిని మారుస్తారా లేక అందరినీ దారిలోకి తెస్తారా అనేది ప్రశ్న.