Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాతోపాటు స్థానిక సంస్థల కేటగిరిలో 18 సీట్లకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది. 18లో ఏకంగా 14 సీట్లను SC, ST, BCలకే కేటాయించారు. అందులోనూ 11 స్థానాలను కేవలం BC సామాజికవర్గాలకే ఇచ్చారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం, స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉన్న పట్టు రీత్యా ఈ రెండు కోటాల్లోనూ అభ్యర్థుల గెలుపు లాంఛనమే. శాసనమండలికి ఇంత పెద్దఎత్తున బీసీలను పంపించటం అనేది వైసీపీకి రాజకీయంగా మైలేజ్ రావల్సిన అంశం. టీడీపీ హయాంలో బీసీలకు చట్టసభల్లో ఎన్ని స్థానాలు ఇచ్చారు? ఇప్పుడు జగన్ సర్కార్ ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారపార్టీ పెద్దలు నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే మంత్రులు, ఎంపీలు.. ఎమ్మెల్యేలు వరస పెట్టి మీడియాతో మాట్లాడేలా షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.
Read Also:Off The Record: కొత్తకోట దంపతుల కొత్త ఎత్తుగడ..! రెండు చోట్ల పోస్టర్ల యుద్ధం
సీఎం జగన్ బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని గట్టిగా చెప్పారు వైసీపీ నేతలు. ఇంత చేసినా.. ఎమ్మెల్సీల ఎంపికలో చేసిన సోషల్ ఇంజనీరింగ్‌పై వైసీపీకి అనుకున్న రాజకీయ ప్రయోజనం దక్కలేదనే టాక్ నడుస్తోంది. రావాల్సిన మైలేజ్ రాలేదన్నది అధికారపార్టీలో జరుగుతున్న చర్చ. దీనికంతటికీ గన్నవరంలో జరిగిన రచ్చే కారణమని అనుకుంటున్నారు. ఆ రోజున సవాళ్లు, ప్రతిసవాళ్లు, దాడులు, ప్రతిదాడులు, అరెస్టులతో గన్నవరం వార్తల్లోకి ఎక్కింది. దీంతో వైసీపీ సామాజిక న్యాయం వార్తలకు కొంత ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. పథకం ప్రకారం గన్నవరంలో టీడీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనేది అధికారపార్టీలో జరుగుతున్న చర్చ. టీడీపీ నేత పట్టాభి తాను గన్నవరం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం.. ఆ తర్వాత జరిగిన గొడవ అంతా ఒక టీడీపీ స్కీమ్‌లో భాగమే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ పథకాన్ని ఊహించైనా వైసీపీ నేతలు గొడవ పెరగకుండా చూసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. శాసనమండలికి ఒకేసారి ఏకంగా 11 మంది BCలను పంపించామనే పొలిటికల్ మైలేజ్ మొత్తం.. ఈ దాడుల ఎపిసోడ్‌లో కొట్టుకుపోయిందనే వాదన అధికారపార్టీలో ఉంది.