Site icon NTV Telugu

Off The Record: అక్కడ కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా విలవిలలాడుతున్న టీడీపీ నేతలు..!!

Gali Bhanu Prakash

Gali Bhanu Prakash

Off The Record: తానొకటి తలిస్తే… సెక్రటేరియెట్‌లోని ఉన్నతాధికారి మరొకటి తలిచాడన్నట్టుగా ఉందట చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ పరిస్థితి. తాను అనుకున్నది జరిగీ జరగనట్టుగా ఉండటం ఒక ఎత్తయితే… దాన్ని బేస్‌ చేసుకుని ప్రత్యర్థి ఫైర్‌బ్రాండ్‌ లీడర్ చెలరేగిపోతుండటంతో… సార్‌ పరిస్థితి రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిస్తే ఎలాగన్నట్టు ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో… నగరి చరిత్రలోనే అత్యంత ఎక్కువగా 45 వేలకు పైగా మెజార్టీతో మాజీ మంత్రి రోజా మీద విజయం సాధించారు భానుప్రకాష్‌. ఇక వచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా… తన తండ్రి ముద్దుకృష్ణమనాయుడిలాగే… నగరిని తన అడ్డాగా మార్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారన్నది లోకల్‌ వాయిస్‌. నగరిలోని పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు. అందుకు అనుగుణంగా, అధికారంలోకి రాగానే సిఎం ,విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ఇచ్చిన హామీని గుర్తు చేశారు భానుప్రకాష్‌. ఈ క్రమంలోనే… రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వడానికి గత మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

దాంతో… ఇంకేముంది, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది. ఇచ్చిన హామీ నెరవేరిపోయింది. ఇక తిరుగులేదనుకుంటూ… నియోజకవర్గంలో భారీ సభ పెట్టి ధూం ధాం చేసేశారు భానుప్రకాష్‌. ఆయన అనుచరులైతే…. ఇంకో అడుగు ముందుకేసి… తమ నాయకుడు, సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేసేశారు. కట్‌ చేస్తే…. ఆరు నెలలు గడిచినా…. కేబినెట్‌ నిర్ణయం అమల్లోకి రాలేదు. అటు చేనేత కార్మికుల్లో అసహనం పెరగడంతోపాటు ఇదే అంశాన్ని టార్గెట్‌ చేసుకుని పొలిటికల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశారు మాజీ మంత్రి రోజా. అంతా అయిపోయింది… అదిగో, ఇదిగో… అంటూ అప్పట్లో తెగ పాలు పోసేశారు…. ఆ పాలన్నీ నేల పాలయ్యాయి తప్ప… పవర్‌ మాత్రం ఉచితంగా రాలేదంటూ వాయిస్‌ పెంచారామె. ‌‌‌అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అబద్దాలు చెప్పారని, అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టడం టీడీపీ వాళ్ళకే చెల్లిందంటూ ఛాన్స్‌ దొరికినప్పుడల్లా ఆడేసుకుంటున్నారామె. ఇక వైసీపీ కేడర్‌ సోషల్‌ మీడియా వార్‌ సంగతైతే సరేసరి. దీంతో ఏం చెప్పాలి, చేనేత కార్మికుల్ని ఎలా సముదాయించాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట ఎమ్మెల్యే. వాస్తవానికి ఈ ఉచిత కరెంట్‌ ప్రభావం ఒక్క నగరికే పరిమితం కాదు. అమల్లోకి వస్తే… రాష్ట్ర వ్యాప్తంగా పాతికమంది ఎమ్మెల్యేలకు రాజకీయంగా ప్లస్‌ అవుతుంది. స్వయానా మంత్రి లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా ఎక్కువమంది చేనేత కార్మికులున్నారు‌‌‌‌. అంత ప్రాముఖ్యత ఉన్న హామీ… కేబినెట్‌ నిర్ణయం జరిగాక కూడా అమల్లోకి రాలేదు సరికదా… నోరున్న అపోజిషన్‌ లీడర్‌ కారణంగా… నగరి ఎమ్మెల్యేకు మాత్రం తలనొప్పి పెరుగుతోందట. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కోసం మీ హయాంలో హామీ ఇచ్చి అమలు చేశారా? అసలు నేతన్నలకు మీరు ఒరగబెట్టిందేంటని నగరి తమ్ముళ్ళు రివర్స్‌ కౌంటర్స్‌ అయితే ఇస్తున్నారుగానీ…. కేబినెట్‌లో ఓకే అయ్యాక అమలవకుండా ఎవరు అడ్డు పడుతున్నారు? అసలు సమస్య ఎక్కడుంది? లోకేష్‌సహా పాతిక మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ప్లస్‌ అయ్యే నిర్ణయం అమల్లోకి రాకుండా ఎక్కడ తొక్కి పెడుతున్నారని ఆరాతీస్తే… విషయం తెలిసి అవాక్కయ్యారట ఎమ్మెల్యే భానుప్రకాష్‌. ఒక్క లెటర్‌తో పని పూర్తయ్యేదానికి ఇన్ని నెలలు ఆపేశారా? రాజకీయంగా మమ్మల్ని ఇరుకున పెడుతున్నారా అంటూ సన్నిహితుల దగ్గర ఎమ్మెల్యే వాపోతున్నట్టు తెలిసింది.

ఇంతకీ… విషయం ఏంటంటే… నేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ విషయంలో కేబినెట్‌ నిర్ణయం అయితే తీసుకుందిగానీ… దాని అమలు కోసం…. చీఫ్‌ సెక్రెటరీ కమ్‌ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అనుమతి లేఖ ఇవ్వాల్సి ఉంది. ఆయన నుంచి ఆ క్లియరెన్స్‌ లెటర్‌ వస్తే… అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉన్నా.. ఆక్కటి మాత్రం జరగడం లేదట. ఈ క్రమంలోనే… ఇటీవల భానుప్రకాష్‌ విజయానంద్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చి వచ్చారట. అయినా నో రియాక్షన్‌. ఇదొక్కటే కాదు… నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ను 8 నెలల క్రితమే సంబంధింత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించినా… ఇప్పటివరకు అనుమతుల ఊసే లేదట. దాని కోసం నగరి టూ అమరావతి అంటూ ఎమ్మెల్యే ఇప్పటికి పదుల సార్లు తిరిగినా సదరు అధికారి మాత్రం చూద్దాం చేద్దాం అంటూ నెలలు గడిపేస్తున్నారని సన్నిహితులతో చెప్పుకుని వాపోతున్నారట భానుప్రకాష్. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్టుగా నా పరిస్థితి మారిపోయిందని మొత్తుకుంటున్నట్టు సమాచారం. నగరి ఎమ్మెల్యే మొరను ఉన్నతాధికారులు ఆలకిస్తారో లేదో చూడాలి మరి.

Exit mobile version