Site icon NTV Telugu

Off The Record: జగన్ అడ్డాలో టీడీపీలో ఆధిపత్యపోరు..!

Pulivendula Tdp

Pulivendula Tdp

Off The Record: పులివెందుల. ఈ నియోజకవర్గం పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైయస్ కుటుంబం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్యం కోసం అక్కడ టిడిపి నేతల కుమ్ములాటలు కూడా మామూలుగా లేవు. ఓవర్గం అవినీతిని ప్రోత్సహిస్తే….మరో వర్గం తాము అవినీతికి వ్యతిరేకం అంటూ ఫిర్యాదులకు తెరలేపారు. తొండూరు మండలంలో విద్యా కమిటీ ఎన్నికల్లో తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక వర్గానికి చెందిన నేతల చిన్నచిన్న చెట్లను మరో వర్గం నరికేస్తే…అందుకు తామేమి తీసిపోమంటూ మరో వర్గం ఏకంగా కార్లతో ఢీకొట్టి, రాడ్లతో చితకబాది హత్య చేయడానికి ప్రయత్నించారట. ఇద్దరూ ప్రత్యర్థి పార్టీలేం కాదు..ఒకే పార్టీకి చెందిన నేతలే. హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన తెలుగు తమ్ముళ్లు, తమను పోలీసులు కొట్టారంటూ కోర్టులో జడ్జీలకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఆధిపత్యంపై అక్కడ పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

Read Also: AP High Court: చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..

పులివెందుల టిడిపి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యవహరిస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తమ వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబడుతున్నారట… మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అండదండలతో వేముల మండలంలో ఓ టిడిపి నేత తెగించారన్న చర్చ జరుగుతోంది. కోర్టు కేసులో ఉన్న పది కోట్ల విలువ చేసే ముగ్గురాయిని రాత్రికి రాత్రి తరలించేశారట. అక్రమ మైనింగ్‌పై రగిలిపోయారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. అంతేకాకుండా జిలెటిన్ స్టిక్స్ అక్రమంగా నిలువు చేసి ముగ్గురాయి గనుల్లో ఉపయోగించడం వల్ల అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారట. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో విస్తారంగా ముగ్గురాయి గనులు ఉన్నాయి.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ తవ్వకాలు ఎక్కువయ్యాయట. ప్రతిరోజు దాదాపు 100 లారీల ముగ్గురాయి ఇక్కడి నుంచి తరలిపోతోందంటే ఏ మేర అక్రమ మైనింగ్ జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా టిడిపి నేతల కనుసన్నల్లోనే జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. ముగ్గురాయి అక్రమ రవాణా పై ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేయడంతో, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య పోరు ఘర్షణలకు దారితీస్తోంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా తాము తగ్గేదేలే అంటున్నారట మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు. అవినీతి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటున్నారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయులు. ఇలా ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు క్యాడర్ ను అయోమయంలో పడేస్తున్నాయి. పులివెందులలో టిడిపి మీటింగ్ పెట్టాలంటే జిల్లా ఇన్చార్జి మంత్రి సైతం వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఇరు వర్గాలు ఎప్పుడు ఎక్కడ ఎలా తలపడతాయోనన్నా ఆందోళన నెలకొంది. పులివెందుల నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదానికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

Exit mobile version