NTV Telugu Site icon

Off The Record: ఆ మాజీ మంత్రి మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నారా..?

Indrakaran Reddy

Indrakaran Reddy

Off The Record: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. దేవాదాయ, ఉమ్మడి జిల్లాలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టు సాగింది. మంత్రి పదవే కాదు…ఏ ఎన్నికలు వచ్చినా…పార్టీ ఏది చెప్పినా ఆయనే ముందు వరుసలో ఉండేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు…ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకించారు. నియోజకవర్గంలో ఆందోళనలు చేశారు. సీన్ కట్ చేస్తే…ఎలాగోలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో…కాంగ్రెస్‌ తరపున ప్రచారం కూడా చేశారు. కొంతకాలం హస్తం పార్టీకి టచ్‌లో లేకుండా పోయారట. ఆ మధ్య అక్కడక్కడా కనిపించినా…ఇప్పుడు మాత్రం దూరం దూరం అంటున్నారని కేడర్‌ చర్చించుకుంటోంది. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా…ఎక్కడా ఆ పార్టీ కార్యక్రమాల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా మంత్రి సీతక్క జిల్లాలోని పర్యటిస్తున్నా…ఐకే రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనే ప్రచారం ఊపందుకుంది.

Read Also: Sangareddy Crime: ఎల్ఐసీ డబ్బుల కోసం సొంత బావనే హత్య చేసిన బామ్మర్ది..

ఇంద్రకరణ్ రెడ్డి.. 2004 ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లోనూ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2014లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి…బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో…దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. మళ్లీ నిర్మల్ నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2023లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో…దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి వస్తుందని ఇంద్రకరణ్‌రెడ్డి ఆశించారట. అయితే ఎలాంటి పదవి ఇవ్వకపోవడం.. పార్టీలో సైతం బాధ్యతలు అప్పగించకపోవడంతో కేడర్‌ అసంతృప్తిలో పడిపోయిందట. నిర్మల్ జిల్లాతో పాటు సొంత నియోజకవర్గంలో…మాజీ మంత్రికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదట. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి పునరాలోచనలో పడినట్లు చర్చ సాగుతోంది. నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఉండటంతో…ఆయనతో కలిసి పని చేయాలా ? వద్దా ? అనే సందిగ్దంలో పడిపోయారట. శ్రీహరిరావుకు ఇంద్రకరణ్‌రెడ్డి శిష్యుడు అనే పేరుంది. ఏంచేయాలో పాలుపోక డైలమాలో పడ్డారట మాజీ మంత్రి. మరో శిష్యుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పార్టీ మారే అంశంపై…హైదరాబాద్‌లో రహస్య చర్చలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది.

Read Also: Mallesham Director: మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?

ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క…జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆదిలాబాద్, బైంసా, నిర్మల్ నియోజకవర్గంలో…ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వాటికి ఇంద్రకరణ్‌రెడ్డి హజరుకాకపోవడంతో…పార్టీ మార్పు ఊహగానాలకు మరింత బలం చేకూర్చుతోందని కాంగ్రెస్‌ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హస్తం పార్టీకి ప్రస్తుతం జనంలో ఉన్న ఇమేజ్, పార్టీలో ఆయనకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మాజీ మంత్రి ఓ నిర్ణయానికి వచ్చినట్టు నిర్మల్‌లో చర్చ జరుగుతోంది. ఇంద్రకరణ్‌ రెడ్డి సొంతగూటికి మళ్లీ చేరిపోతారని…దానికి స్థానిక సంస్థల ఎన్నికల గడువుగా పెట్టుకున్నట్లు సమాచారం. అటు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప సైతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా…ఇటీవలనే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని ప్రకటించడం దుమారం రేపుతోంది. ఇంతకీ ఇంద్రకరణ్‌రెడ్డి పీఛేమూడ్ అంటారా…? ఇప్పటి వరకు ఉన్నట్లుగానే పార్టీలో కొనసాగుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.