NTV Telugu Site icon

Off The Record: ఎర్రబెల్లి భద్రత తొలగింపుతో వరంగల్ ఈస్ట్‌లో రాజకీయ సెగలు..

Errabelli Pradeep Rao,

Errabelli Pradeep Rao,

Off The Record: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హాట్ హాట్ రాజకీయాలకు వేదిక వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గం. ప్రస్తుతం తూర్పు సెగ్మెంట్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అదీ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ద్వారా. ప్రదీప్‌రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు. మొన్నటి వరకు అధికారపార్టీలోనే ఉన్నారు. ఈ మధ్యే బీజేపీలోకి జంప్‌ చేశారు. అప్పటి నుంచి తూర్పులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు ప్రదీప్‌రావు. వాస్తవానికి గులాబీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేతో ఆయనకు పడేది కాదు. ఇప్పుడు కండువా మార్చేయడంతో వ్యూహాలు మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ ప్రదీప్‌రావుకు భద్రతగా ఉన్న టు ప్లస్‌ టు గన్‌మెన్‌ను తొలగించారు. తనకు భద్రతను తొలగించడం వెనుక ఎమ్మెల్యే నరేందర్‌ ఒత్తిడి ఉందనేది ప్రదీప్‌రావు ఆరోపణ. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారిపోయాయి.

ప్రదీప్‌రావు 2009లోనే పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో టీఆర్ఎస్‌ టికెట్‌ ఆశించినా.. కొండా మురళీ దంపతులు గులాబీ కండువా కప్పుకోవడంతో వాళ్లకోసం ప్రదీప్‌రావు సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక 2018 ఎన్నికల్లోనూ నిరాశ తప్పలేదు. అప్పటికే వరంగల్‌ మేయర్‌గా ఉన్న నన్నపనేని నరేందర్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చింది. అలాగే దయాకర్‌రావుకు టికెట్‌ ఇవ్వడం కూడా ప్రదీప్‌రావుకు మైనస్‌గా మారింది. అయితే ప్రదీప్‌రావును ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడం.. అధికారపార్టీలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో తూర్పు టికెట్‌ రాదనే ఆలోచనతో బీజేపీ కండువా కప్పేసుకున్నారు ప్రదీప్‌రావు.

మొన్నటి వరకు వరంగల్‌ తూర్పులో ముసుగులో గుద్దులాటలా ఉన్న విభేదాలు.. జెండాలు వేరుకావడంతో ఓపెన్‌ అయిపోయాయి. ప్రదీప్‌రావును నేరుగా ఢీకొట్టేందుకు ఎమ్మెల్యే నరేందర్‌ సిద్ధపడినట్టు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ప్రదీప్‌రావు, ఎమ్మెల్యే నరేందర్‌ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పుడు గన్‌మెన్‌ను తొలగించడంతో అది పరాకష్టకు చేరిందనేది బీజేపీ నేతల ఆరోపణ. తన ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో భద్రత కల్పించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో సెక్యూరిటీ తొలగించారో చెప్పాలని ప్రదీప్‌రావు డిమాండ్ చేస్తున్నారు. ప్రదీప్‌రావు అధికారపార్టీలో ఉన్న సమయంలోనే భద్రత తొలగించాలని ఎమ్మెల్యే నరేందర్‌ విఫలయత్నం చేశారని.. ఇప్పుడు ఆయనకు పని ఈజీ అయ్యిందనే ఒక వాదన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ సమయంలోనే ప్రదీప్‌రావుకు భద్రత కల్పించారు. తర్వాత కాంగ్రెస్‌ సర్కార్‌ సమయంలో ఆయన సెక్యూరిటీని ఉపసంహరించారు. తిరిగి 2016లో తిరిగి భద్రతా కవచంలోకి వచ్చారు ప్రదీప్‌రావు. ఈ విషయంలో బీజేపీ నేత వాదన ఎలా ఉన్నప్పటికీ.. గన్‌మెన్‌ల తొలగింపు అంశం మాత్రం తూర్పులో రాజకీయ సెగలు రేపుతోంది.