NTV Telugu Site icon

OTR about Pilot Rohit Reddy: రోహిత్‌రెడ్డికి ఈడీ సమన్ల వెనుక ఏం జరిగింది? తాండూరు ఫైల్స్‌ పాత్ర ఉందా?

Pilot Rohit Reddy

Pilot Rohit Reddy

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేయడంతో BRS- BJP మధ్య రాజకీయం మరింత హీటెక్కింది. వ్యాపార, బ్యాంకు లావాదేవీల సమాచారంతో రావాలని కోరింది ED. అయితే ఏ కేసులో ఈ సమన్లు జారీ చేశారన్నది స్పష్టత లేదంటున్నారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. పైగా ఈడీ నోటీసుల వెనుక మతలబేంటి అని లెక్కలు వేసుకుంటున్నారట. ఈడీ నోటీసులు.. ఈడీ ఎదుట హాజరు కావడం ఎలా ఉన్నా.. ఇది రాజకీయ వైరంలో భాగంగా జరిగిందా? లేక పార్టీలో తనకు ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ల పాత్ర ఏదైనా ఉందా అని ఆరా తీస్తున్నారట రోహిత్‌రెడ్డి. దీంతో తాండూరు గులాబీ రాజకీయాలపై ఫోకస్‌ మళ్లుతోంది. అక్కడ రోహిత్‌రెడ్డికి ఎవరితో వైరం ఉంది? రోహిత్‌రెడ్డిని ఇరికించడం వల్ల వారికి కలిగే పొలిటికల్ లబ్ధి ఏంటి? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పైలెట్‌ రోహిత్‌రెడ్డి తాండూరులో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్‌రెడ్డి ఓడిపోయారు. మారిన రాజకీయ పరిణామాలతో రోహిత్‌రెడ్డి గులాబీ కండువా కప్పేసుకున్నారు. అది మహేందర్‌రెడ్డికి రుచించ లేదు. నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య ఉప్పునిప్పులా ఉంది. పట్నం మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పలు సందర్భాలలో చెబుతున్నారు. అది సమస్యను మరింత జఠిలం చేస్తోంది. పార్టీ పెద్దలు సైతం రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు కూడా. ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారంలో రోహిత్‌రెడ్డి నిత్యం అధిష్ఠానంతో టచ్‌లో ఉంటున్నారు. పైగా సిట్టింగ్‌లకే వచ్చే ఎన్నికల్లో టికెట్స్‌ ఇస్తామని హైకమాండ్ ప్రకటించింది. దీంతో తాండూరులో పైచెయ్యి సాధించేందుకు ఇంకెవరైనా రోహిత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారా అని ఎమ్మెల్యే అనుచరులు అనుమానిస్తున్నారట.

రాజకీయాల్లోకి రాకమునుపే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి పలు వ్యాపారాలు ఉన్నాయి. తెలంగాణలోనూ కాంట్రాక్టు వర్క్స్‌ చేస్తున్నారు. ED వ్యాపారాలను గురిపెట్టిందా? లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాజకీయ ప్రత్యర్థులు అస్త్రాలను అందచేస్తున్నారా? అని మల్లగుల్లాలు పడుతున్నారట. దీనిపై పార్టీ పెద్దలతోనూ.. న్యాయ నిపుణులతోనూ ఆయన చర్చిస్తున్నారు. ఈడీ నోటీసులపై రోహిత్‌రెడ్డి తీసుకునే తదుపరి కార్యాచరణపై పార్టీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.