Site icon NTV Telugu

Off The Record: దసరా అంటేనే అక్కడ నాయకులకు దడపుడుతోందట..!

Adilabad District

Adilabad District

Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులకు విచిత్రమైన సమస్య వచ్చి పడిందట. పండగ అన్న మాట వినిపిస్తే చాలు… నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. ఎవరికి వారు పండగల్ని హాయిగా, జాలీగా, కుటుంబ సమేతంగా చేసుకుంటుంటే… వీళ్ళకు మాత్రం అదీఇదీ అని లేదు. ఏదో ఒకటి… పండగ… అన్న మాట వినిపిస్తే చాలు దిగాలుగా ఫేస్‌లు పెట్టేసి జేబులు తడుముకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలకే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ..కౌన్సిలర్‌… ఇలా పోస్ట్‌ ఏదైనాసరే… లోకల్‌ బరిలో నిలవాలనుకున్న నాయకులు జనం దృష్టిలో పడటం కోసం చాలా రోజుల నుంచి కాస్త చెయ్యి విసరడం మొదలు పెట్టారట. మొదట్లో ఇది బాగానే ఉన్నా… అంతా ఆహో ఓహో అన్నా…. ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ… ఉన్నది ఖర్చయిపోతూ… రేపు ఎలక్షన్స్‌ ఖర్చులు ఎలాగన్న టెన్షన్‌ కూడా కొందరిలో మొదలైందంటున్నారు. ముందు అలవాటు చేసి ఇప్పుడు మానేస్తే రేపు పోలింగ్‌ బూత్‌లో తేడా కొడుతుందని, అలాగని ప్రతి పండక్కి జనం కోసం ఖర్చు పెట్టాలంటే తడిసి మోపెడవుతోందని సణుక్కుంటున్నట్టు సమాచారం. వీటన్నిటికీ మించి రాబోయేది దసరా పండగ. మందు, ముక్క, ఆ లెక్కే వేరుగా ఉంటుంది.

Read Also: PM Modi: ప్రధాని మోడీని పాకిస్తాన్ ఎందుకు ప్రమాదంగా చూస్తోంది..? కారణాలు ఏంటి.?

చాలా ఏరియాల్లో. దాంతో దసరా అన్న మాట వింటేనే తడిసిపోతోందట జిల్లాలోని స్థానిక నాయకులకు. దాదాపు ఏడాదిన్నర నుంచి అవిగో ఎన్నిక‌లు, ఇవిగో ఎన్నిక‌లంటూ ప్రచారం జరగడం, నాయకులు అలర్టయిపోయి జేబులో చేతులు పెట్టడం, తర్వాత తూచ్‌ ఎలక్షన్స్ ఇప్పుడు కాదు అడం షరా మామూలు కావడంతో నాయకుల్లో కలవరం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి కదా అనుకుంటూ…నిరుడు వినాయ‌క‌ చ‌వితికి అడిగిన వాళ్ళకు అడిగినట్టు మండ‌పాల‌ ఖర్చులు, అన్నదానాలు, విగ్రహాల కోసం చందాలు… ఇలా బాగా ఖర్చు చేశారు నేతలు. ఆ త‌ర్వాత ద‌స‌రా వ‌చ్చింది. అప్పుడు మందు, మ‌ట‌న్‌, కొన్ని చోట్ల మ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీలు కూడా జరిగాయి. ఇలా ప్రతిపండక్కి ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప ఎలక్షన్స్‌ మాత్రం జరగడం లేదు. అలా ఏడాది గడిచిపోయి తిరిగి వినాయ‌క‌చ‌వితి వచ్చింది. సేమ్‌ సీన్‌ రిపీట్‌. మళ్ళీ దసరా కూడా ముంచుకొస్తోంది. మళ్ళీ యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు విన్యాసాలు, మ‌హిళ‌లకైతే బ‌తుక‌మ్మ కానుక‌లు… ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్‌. లక్షల్లో ఖర్చు కళ్ళ ముందు కనిపిస్తూ.. ఆశావహులకు నిద్ర పట్టడం లేదట. పోనీ ఇవ్వకుండా ఆపేద్దామంటే… నిరుడు ఇచ్చి ఇప్పుడు ఆపేస్తే… రేపు పోలింగ్‌ బూత్‌లో బోల్తాపడతామన్న భయంగా ఉందట. దీంతో కొందరైతే… ఫ్రస్ట్రేషన్‌లో ఆ స్థానిక సంస్థల ఎన్నికలేవో వెంటనే జరిపించొచ్చుకదా… మాకు గొడవ వదిలిపోతుంది అంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారట. తిర్యాణి మండ‌లంలో ఓ నేత అడ‌గ్గానే ఒక్కో వినాయ‌క మండ‌పానికి వేల‌కు వేలు ఇచ్చేశారట. మామూలుగా పిల్లికి బిచ్చమేసే అలవాటులేని వ్యక్తి అలా ఎందుకు చేశాడని ఆరా తీస్తే… సార్‌ జ‌డ్పీటీసీ కానీ, ఎంపీపీ గానీ అవ్వాలని ఆశిస్తున్న తేలిందట.

తాండూరు మండ‌లంలో ఓ పార్టీ నుంచి జ‌డ్పీటీసీ టిక్కెట్టు ఆశిస్తున్న నేత ఇప్పటికే ప‌ది ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు సమాచారం. ప్రతి చోట ఇలాంటి బాపతు చాలామందే ఉన్నారు. మొన్ననే వినాయక చవితి పేరుతో చేతిచమురు వదిలించుకున్న వాళ్ళంతా ఇప్పుడు దసరా పండగ పేరు వింటేనే దడుసుకుంటున్నారట. ఓవైపు ఆల్రెడీ పాలిటిక్స్‌లో ఉన్నవాళ్ళ సంగతి అలా ఉంటే… మరోవైపు కొత్తగా ఎంట్రీ ఇద్దామనుకుంటున్న వాళ్ళు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నట్టు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఓ ఉద్యోగి రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాల్లో భాగంగా సేవా కార్యక్రమాలతో పాటు వినాయక మండపాల కోసం లక్షలు ఖర్చు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అటు కొమురం భీం జిల్లాలో సైతం ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సేవ పేరుతో… జనం మీద ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తోందట. ఇలాంటి వాళ్ళంతా ఆశావహుల్ని టెన్షన్‌ పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నదంతా పండగల సీజనే కావడంతో.. నాయకులు బ్యాంక్‌ బేలన్స్‌ తలుచుకుని దిగులుపడుతున్నట్టు సమాచారం. ఫైనల్‌గా వీళ్ళందరిదీ ఒకటే మాట. ఆ లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌ ఏవో త్వరగా పెట్టేయండయ్యా బాబూ… అని

Exit mobile version