Site icon NTV Telugu

Off The Record: పేరుకే కూటమి..! ఆ నియోజకవర్గం కూటమిలో కుతకుతలు..

Otr Nellimarla

Otr Nellimarla

Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. పొత్తు కింద నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నాయకుల్లో అసంతృప్తి అంతకంతకూ కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కానీ పట్టు లేని జనసేనకు కేటాయించడంపై నువ్వా నేనా అన్న తరహాలో వార్ సాగుతోంది. అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్నా వీరి తీరు మారలేదు. మళ్లీ వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీలో కూటమి నేతల మధ్య వర్గపోరు బయటపడిందని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి వర్సెస్ కర్రోతు బంగార్రాజు, చంద్ర శేఖర్, రవిశేఖర్ గా కోల్డ్‌వార్ మారిపోయింది.

Read Also: Off The Record: వాళ్ల ప్రేలాపనంతా ఆయన మెప్పుకోసమేనా..? అధినేత ప్రాపకం కోసమే నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారా..?

ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వర్గాలను చేసి రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఏ కార్యక్రమాలకు టీడీపీ నాయకులకు ఏలాంటి ఆహ్వానాలు ఉండడంలేదని పార్టీ నాయకులే బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధి పనులు కూడా ఎమ్మెల్యే అనుయాయులకు ఇస్తున్నారన్న వాదన బలంగా ఉంది. మండల స్థాయిలో టీడీపీ నాయకుల పనులు ఏమీ అవ్వడం లేదని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో బహిరంగంగానే పోస్టు పెడుతున్నారు. ఏమాత్రం ప్రజాబలంలేని లోకం మాధవిని దగ్గరుండి గెలిపిస్తే…కనీసం ఖాతరు చెయ్యకపోవడమేటని కార్యకర్తలు సైతం నాయకులను ప్రశ్నిస్తున్నారట. అధినాయకుడి సూచనలతో పనిచేస్తే.. అందర్నీ కరివేపాకులా వాడుకున్నారని నేతలే ఇప్పుడు ఇలా వ్యవహరించడంపై రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి తన స్టైల్లో నియోజకవర్గాన్ని నడపాలని చూస్తున్నారని.. ఎన్నికలప్పుడు మమ్మల్ని శ్రమ పెట్టించారు..ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడిపోతున్నారు. మండలాలలో ఎవరితో పని చేయాలి, ఎవరికీ పని ఇవ్వాలి అన్నది..ఎమ్మెల్యే ఏకపక్షంగా డిక్టేట్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

తాజాగా వరద ప్రభావిత మత్స్యకార గ్రామాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో వర్గపోరు మరోసారి బయటపడింది. ప్రభుత్వం అందించాల్సిన సాయం గురించి స్థానిక టీడీపీ నాయకులకు చెప్పకుండానే ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేపట్టడం…తెలుగు తమ్ముళ్లకు అసలు నచ్చలేదు. కర్రోతు బంగార్రాజు సొంత మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అసమ్మతి బయటపడింది. పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తే ఆటంకాలు సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఇదంతా నాయకులే వెనకుండి నడిపిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం కత్తులు నూరుతోంది. ఇదంతా చూస్తుంటే కూటమికి కూటమి నాయకులే శత్రువులుగా మారారని ఇరు పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి నెల్లిమర్లలో కూటమి కంటే కుట్రలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఇలా కొనసాగితే భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.

Exit mobile version