Site icon NTV Telugu

Off The Record: దెందులూరులో పొలిటికల్‌ హీట్‌.. కాలు దువ్వుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar

2019 అసెంబ్లీ ఎన్నికలు దెందులూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తనకు ఎదురే లేదని అనుకున్న టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఓడిపోగా.. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి గెలిచారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో.. సీన్‌ మారిపోయింది. దెందులూరులో పొలిటికల్‌ గేమ్‌ కూడా ఆ స్థాయిలో రక్తికట్టిందనే చెప్పాలి. ఇప్పటికీ నియోజకవర్గంలో నేతల మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో ఓడినా దూకుడు తగ్గించని చింతమనేని ఈ మూడున్నరేళ్ల కాలంలో అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. ఆయన పరిస్థితి పోలీస్‌ స్టేషన్‌ లేదా కోర్టు లేదా జైలు అన్నట్టుగా మారిపోయింది. తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి.

Read Also: Off The Record: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పట్టించుకోని బీజేపీ అధిష్ఠానం?

ఈ కేసులకు చింతమనేని విరుగుడు మంత్రం వేస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అది ఎంత వరకు వచ్చిందో ఏమో.. కొద్దికాలం సైలెంట్‌ అయ్యారు. దెందులూరులో పూర్తిగా వైసీపీదే హవా. అక్కడ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పిందే నడుస్తుంది. అయితే ఇన్నాళ్లు ఇద్దరి మధ్య సాగిన రాజకీయ ఎత్తుగడలు.. సరిపోవని అనుకున్నారో ఏమో.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మార్చేశారు. పందెంకోళ్లు మాదిరి కాలు దువ్వుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటున్న చింతమనేని మరోసారి తన నోటికి పని చెబుతున్నారు. ఓ రేంజ్‌లో బూతులు వాడేస్తున్నారని తెలుగు తమ్ముళ్లే గగ్గోలు పెడుతున్నారు. వైసీపీపై విమర్శలు చేయొచ్చు కానీ.. ఈ స్థాయిలో బాదుడు ఉంటే.. అసలుకే ఎసరు రావొచ్చని వాళ్లు ఆందోళన చెందుతున్నారట. ఈ దూకుడే 2019 ఎన్నికల్లో ఓడించిందనేది వారి అభిప్రాయం. మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకుంటే ఎన్నికల్లో బోల్తా పడే ప్రమాదం ఉందని కేడర్‌ హెచ్చరిస్తోందట. వార్‌ వన్‌సైడ్‌ చేసుకోవద్దని హితవు పలుకుతున్నారట.

Read Also: Off The Record: వైసీపీ ఓపెన్ ఆఫర్‌..! ముద్రగడ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వస్తారా?

ఇక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిది మరో తీరు. దెందులూరు రాజకీయాల్లో తానేమీ తక్కువ కాదన్నట్టుగా జూలు విదిలిస్తున్నారు. సరైనోడు తగలనంత వరకు ఎవరైనా పేలతారని చింతమనేనికి ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడు శాంపిల్స్‌ చూస్తున్నారని.. అసలు సినిమా ముందు ఉందని రాజకీయ ప్రత్యర్థికి చిన్నపాటి వార్నింగ్‌లు ఇస్తున్నారు. తనకు ఎదురొచ్చి సత్తా చాటుకోవాలని సవాళ్లు విసురుతున్నారు ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో దెందులూరులో గెలిచేది వైసీపీనేనని.. అందులో అనుమానమే అక్కర్లేదనేది అబ్బయ్య చౌదరి వాదన. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య తాజాగా జరుగుతున్న ఈ మాటల యుద్ధమే దెందులూరులో పొలిటికల్‌ అటెన్షన్‌ తీసుకొస్తోంది. అయితే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇద్దరూ పావులు కదుపుతుండటం ఆ హీట్‌ గ్రౌండ్‌ లెవల్‌కూ పాకుతోంది. మరి.. ఎవరి వ్యూహాలు వర్కవుట్ అవుతాయో కాలమే చెప్పాలి.

Exit mobile version