Off The Record: నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ… దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్నట్టు తెలిసింది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్‌ను తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించమని పట్టుబడుతున్నారట నిజామాబాద్ ఎంపీ అర్వింద్. జక్రాన్ పల్లి మండలం కలిగోట్‌లో పెట్టాలంటూ… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట ఎంపీ. ఆ మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం కలిగోట్‌లో ప్రతిపాదిత స్దలాన్ని పరిశీలించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు దాదాపుగా ఖాయమని అనుకుంటున్న టైంలో… సీన్‌లోకి వచ్చారు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నవోదయ స్కూల్‌ను ఆచన్‌పల్లిలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ స్ధలంలో ఏర్పాటు చేయాలంటూ తాజాగా ప్రతిపాదనలు పంపారు. దీంతో…ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియక అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇక ఇక్కడే పొలిటికల్ వార్ కూడా మొదలైపోయింది.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నవోదయ స్కూల్‌ను బోధన్ తరలించుకుపోయే ప్లాన్ ఉన్నారంటూ… తీవ్రంగానే టార్గెట్ చేశారు ఎంపీ అర్వింద్. ఇక బీజేపీ శ్రేణులు ఓ అడుగు ముందుకేసి.. మాజీ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. నవోదయ విద్యాలయం ఏర్పాటు సంగతేమోగానీ…. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అర్వింద్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. బీజేపీ నేతలు బోధన్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండటం పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతోంది. ఎంపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతలు సైతం ఆందోళనకు సిద్ధమవుతున్నారట. జిల్లాలో సీనియర్ నేత అయిన సుదర్శన రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తున్నా.. స్థానిక హస్తం నేతలు మౌనం దాల్చడంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్ అయినట్టు తెలిసింది. పార్టీ పెద్దలు తలంటాక నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కదలిక వచ్చి… కౌంటర్ అటాక్స్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక్కడ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది జిల్లా వాసుల దశాబ్దాల డిమాండ్. అలాంటిది.. ఆ డిమాండ్ ను నెరవేరుస్తూ కేంద్రం ఓ విద్యాలయాన్ని మంజూరు చేస్తే.. వీళ్ళిలా పొలిటికల్ పోట్లాటలు పెట్టుకుని రచ్చ చేయడం ఏంటంటూ… మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
అటు ఎంపీ అర్వింద్ మాత్రం ఈ విషయంలో ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అసలు నిజాం షుగర్స్ భూముల్లో నవోదయ విద్యాలయాన్ని పెట్టడం సాధ్యమేనా? సుదర్శన్‌రెడ్డి సోయి ఉండే మాట్లాడుతున్నారా అంటుూ మండిపడ్డారు. మంత్రి పదవి కోసం కలలుగంటే కనవచ్చుగానీ… దాని కోసం ఇలా రచ్చచేసి పిల్లల భవిష్యత్‌తో ఆడుకోకూడదని అంటున్నారు. ఇలా… మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న నవోదయ చిచ్చు ఎలా చల్లారుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు. పెట్టాలనుకుంటున్నది స్కూల్‌గనుక ప్రజా ప్రతినిధులు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి పిల్లల గురించి ఆలోచించమంటున్నారు తల్లిదండ్రులు.