Site icon NTV Telugu

Off The Record: లిక్కర్ కేసులో చెవిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాయా..?

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy

Off The Record: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు గురించి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో డిఫరెంట్‌ చర్చ జరుగుతోంది. ఇందులో భాస్కర్ రెడ్డి ఏ 38గా, ఆయన కుమారుడు ఏ 39 గా ఉన్నారు. మద్యం ముడుపుల డబ్బుని ఎన్నికల సమయంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడంతోపాటు మరికొన్ని వ్యవహారాల్లో చెవిరెడ్డి కీలకపాత్ర పోషించినట్టు ఇప్పటికే చార్జ్‌షీట్‌లో పేర్కొంది సిట్‌. అందులో భాగంగానే ఆయన అరెస్ట్ అయ్యారు. రిమాండ్‌ ఖైదీగా జైలులో సుమారు 100 రోజులకు నుంచి కొనసాగుతున్న పరిస్థితి. అదంతా ఒక ఎత్తయితే… జైలు నుంచి కోర్ట్‌కు తీసుకువచ్చి, తిరిగి తీసుకువెళ్ళే ప్రతి సందర్భంలోనూ…మాజీ ఎమ్మెల్యే చేస్తున్న హంగామా గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కేసు విచారణ సందర్భంగా నిందితులు అందర్నీ రిమాండ్‌ ముగిసే సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలన్నది నిబంధన. అందుకోసమే.. అలాంటి ప్రతి సందర్భంలోనూ.. నిందితులు అందర్నీ విజయవాడ జైలు నుంచి ఏసీబీ కోర్టుకి తీసుకువస్తున్నారు అధికారులు. ఆ సమయంలో మిగతా నిందితులంతా… మీడియాతో మాట్లాడకుండా కోర్టు దగ్గరికి వచ్చిన తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటున్నారు.

Read Also: Off The Record: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది..?

అయితే చెవిరెడ్డి మాత్రం కోర్టుకు వచ్చే, తిరిగి వెళ్ళే సమయాల్లో మీడియాతో మాట్లాడ్డంతో పాటు రకరకాల నినాదాలివ్వడం, తనకు నచ్చిన వ్యాఖ్యలు రివాజుగా మారిందని అంటున్నారు. చివరికి ఇది సిట్ అధికారులకు కూడా తలనొప్పిగా మారిందట. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అక్రమ కేసులు పెట్టారంటూ… వచ్చిన ప్రతిసారి చెవిరెడ్డి కోర్టు దగ్గర నానా హంగామా చేస్తుండటంతో… ఆ దెబ్బకు సిట్‌ అధికారులు కూడా ఇక లాభం లేదనుకుని ఆయన్ని వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపరిచే ప్రయత్నం చేశారట. అయితే న్యాయమూర్తి అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చెవిరెడ్డిని కోర్టుకి తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డి పాత్ర ఉందని ఇప్పటికే సిట్ ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. మరోవైపు ఆయన కుమారుడు, ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. కేసులో చెవిరెడ్డి పాత్ర కీలకంగా ఉందంటూ పలు పిటిషన్లను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చింది సిట్‌. ఇదంతా ఒకవైపున జరుగుతుంటే ఆయన మాత్రం పదేపదే తనపై అక్రమ కేసులు పెట్టారని, కావాలంటే దేవుడి దగ్గర ప్రమాణం చేస్తానని, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు జైలుకు వెళ్లక తప్పదంటూ మాట్లాడ్డంపైనే అనుమానాలు వస్తున్నాయట.

Read Also: Bigg Boss 9 : నాగార్జుననే తప్పు బట్టిన మాస్క్ మ్యాన్ హరీష్‌.. ఏంట్రా ఇది..

మామూలుగా అయితే.. ఆయన ఏదన్నా చెప్పదల్చుకుంటే ఒకటి రెండు సార్లు చెబితే సరిపోతుందిగానీ… ఇలా ఒకే మాటను ప్రతిసారి చెప్పడం వెనక కచ్చితంగా వ్యూహం ఉండి ఉంటుందని అంటున్నారు. ఒకే మాటని పదేపదే చెప్పడం ద్వారా తాను నిర్దోషినంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, అదే సమయంలో జైల్లో ఉండి కూడా పోరాటం చేస్తున్నానంటూ జగన్‌ దృష్టిలో పడే ప్లాన్‌ కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఇంకోరకమైన మాటలు కూడా వినిపిస్తున్నాయి. చెవిరెడ్డి తనకోసం తాను ఇలా చేసుకోవటం కరెక్ట్ అనిపించినా…. అది ఇతర నిందితులకు ఇబ్బందిగా మారిందట. కేసు విషయంలో తాము ఏమీ మాట్లాడకుండా కోర్టు లోపల వ్యవహారంపై దృష్టి పెడుతుంటే…భాస్కర్‌రెడ్డి ఇలా బహిరంగంగా మాట్లాడుతుంటే.. ఆయన ఒక్కరే తప్పు చేయలేదా? మాట్లాడకుండా ఉన్నందుకు మేం తప్పు చేశామని ఒప్పుకున్నట్టా అన్న డిస్కషన్‌ జరుగుతోందట మిగతా నిందితుల్లో. ఏం జరిగినా కోర్టు లోపల అయితే… బాగుంటుందని, అలా కాకుండా… ప్రతిసారి ఆయన ఇలా యాగీ చేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏమీ లేకపోగా… ఏదన్నా తేడా కొడితే అందరం ఇబ్బందిపడతామని భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదేం రచ్చ అన్న చర్చ అటు వైసీపీ వర్గాల్లో జరుగుతోందట. చెవిరెడ్డి నినాదాల్ని, ఆయన మాటల్ని తాడేపల్లి హెడ్డాఫీస్‌ వింటోందో లేదో మరి.

Exit mobile version