Site icon NTV Telugu

Off The Record: ఆ సమస్యను వైసీపీ లీడర్స్‌ ఎందుకంత లైట్‌ తీసుకున్నారు..?

Kolleru Ycp

Kolleru Ycp

Off The Record: దశాబ్దాల కలగా మిగిలిన కొల్లేరు సమస్యల పరిష్కారం ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో త్వరలోనే అది సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు కొందర్ని అనుమానాలు, అసంతృప్తి వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. రెండు రోజుల పాటు అయా ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించింది. దాదాపు 122 గ్రామాల ప్రజలు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కమిటీతో తమ గోడు వెళ్ళబోసుకున్నారు, అభిప్రాయాలు చెప్పారు. రకరకాల నిబంధనలు, ఆంక్షల కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఇక రాజకీయ నాయకులైతే… ప్రజలకు మద్దతుగా నిలబడటంతోపాటు…. తమ ఓట్‌ బ్యాంక్‌ చెదరకుండా జాగ్రత్త పడ్డారన్న విశ్లేషణలున్నాయి. ఇంత జరుగుతున్నా…బాధితుల తరపున స్వరం వినిపించిన నాయకుల లిస్ట్‌లో వైసీపీ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలు కొందర్ని కంగారు పెడుతోందట. అందరితో పాటు మనమూ కనిపించి ఉంటే… రేపటి రోజున కనీసం మాట్లాడ్డానికి ఉండేది కదా అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read Also: Revanth Reddy : ఎన్ కన్వెన్షన్ ను కూల్చినా నాగార్జున చెరువు కోసం రెండెకరాలు ఇచ్చాడు

ఏలూరు రూరల్, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు, ఉండి నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు విస్తరించి ఉంది. మూడు లక్షలకు పైగా జనాభా ఈ ప్రాంతంలో ఉంది. అంత మంది సమస్యకు సంబంధించిన అంశంపై కనీసం తమ పార్టీ తరపున ఓ వినతి పత్రాన్ని నేరుగా సాధికారిక కమిటీ సభ్యులకు అందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట పార్టీ వర్గాల్లో. కొల్లేరు గ్రామాల ప్రజలకు అండగా ఉన్నామనే భరోసా ఇచ్చినట్టుగా ఉండేదని, దానివల్ల ప్లస్సే తప్ప వీసమెత్తు మైనస్‌ కూడా ఉండదని…. అయినా సరే…. జిల్లా పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదన్న చర్చ నడుస్తోందట వైసీపీ సర్కిల్స్‌లో. మొత్తం ఐదు నియోజకవర్గాల్లో ఒక్కరంటే… ఒక్క వైసీపీ నేత కూడా కొల్లేరు వాసుల తరపున గట్టిగా వాదన వినిపించలేదన్న విమర్శలు ఆల్రెడీ మొదలైపోయాయి. దీంతో…. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని మాట్లాడుకుంటున్నారట ఇప్పుడు కొల్లేరు ప్రాంత వైసీపీ కార్యకర్తలు. అటు కేంద్ర సాధికారిక కమిటీ రెండు రోజుల పర్యటన ముగించుకుని తుది నివేదికను సుప్రీం కోర్టుకు అందించేందుకు సిద్ధమవుతోంది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఒకవేళ కొల్లేరు వాసులు ఆశిస్తున్నట్టుగా, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటూ… లక్షల మంది ప్రజలకు అనుకూలంగా సుప్రీం కోర్ట్‌ తీర్పు వెలువడితే అది ఖచ్చితంగా కూటమికి మేలు చేసే అంశం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వైసిపి తరపున ఏ ఒక్కరు ఎలాంటి వినతులు అందించకపోవడంతో ఆ పార్టీకి ఐదు నియోజకవర్గాల్లో ఎంతో కొంత మైనస్ కావచ్చన్న విశ్లేషణలున్నాయి. తీర్పు సంగతి పక్కనపెడితే ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అంశంలో ఆ పార్టీ నాయకులు వెనుకడుగు వేయడం ఫ్యాన్‌ పార్టీకి గట్టి దెబ్బేనని మాత్రం చెప్పుకుంటున్నారు. కొల్లేరు వాసులంతా ఏకమై సీఈసీ సభ్యుల ముందు గోడు వినిపించిన సమయంలో అదే ప్రజల తరపున అక్కడి నాయకులంతా కలిసి పార్టీ తరపున ఒక మెమోరాండం ఇచ్చి ఉంటే… ఆ లెక్కే వేరుగా ఉండేదని అంటున్నారు. ఇప్పటికే కొల్లేరు గ్రామాల్లో వైసీపీకి పట్టు ఉందని, అది మరింత పెరిగే అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకున్నామన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందట కేడర్‌లో. గతంలో కొల్లేరు విషయంలో అన్నిపార్టీలు ఇచ్చిన హామీలు అమలు జరగలేదన్న ఆవేదనతో ఉన్న ప్రజలకు భవిష్యత్తులో నమ్మకం కలిగించాలన్నా ఇపుడు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ విషయంలో కొల్లేరు ప్రాంత వైసిపి నేతలు వెనుకబడ్డారన్నది లేటెస్ట్‌ వాయిస్‌. జరిగిన డ్యామేజీని అక్కడి నేతలు ఏరకంగా కవర్ చేసుకుంటారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

Exit mobile version