Site icon NTV Telugu

Off The Record: టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతు ఎవరికి?

Brs

Brs

Off The Record: రంగారెడ్డి-హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన నామినేషన్ల పరిశీలన తర్వాత 21 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ సంఖ్య తగ్గుతుందో లేదో కానీ.. అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ మద్దతు ఎవరికి అన్నది పెద్ద చర్చగా మారుతోంది. పోటీలో ఉన్న AVN రెడ్డికి బీజేపీ సపోర్ట్ చేస్తోంది. గత ఎన్నికల్లో MLCగా గెలిచి.. తర్వాత గులాబీ పార్టీలో చేరిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి ఫీల్డ్‌లో ఉన్నారు. PRTU నుంచి చెన్నకేశవరెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులు MLC ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందు నుంచే ప్రచారం ప్రారంభించేశారు. మొత్తం 29 వేల 720 మంది ఓటర్లు ఉండటంతో వారందరినీ కలిసి ఓటు అభ్యర్థించే పనిలో ఉన్నారు క్యాండిడేట్స్‌.

Read Also: Off The Record: సిక్కోలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాల కుంపట్లు

గత ఎన్నికల్లో కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి గులాబీ పార్టీ మద్దతిచ్చింది. తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకొన్నా.. ఇప్పుడు పోటీ చేస్తున్నా.. ఆయనకే మద్దతు అనే ప్రకటన అధికార పార్టీ నుంచి లేదు. దీంతో BRS వైఖరి ఏంటన్నది ప్రశ్న. జనార్దన్‌రెడ్డి మాత్రం ప్రచారం ప్రారంభించేశారు. బరిలో ఉన్న PRTU నేత చెన్నకేశవరెడ్డి తప్పకుండా గెలిచి శాసనమండలిలో అడుగు పెడతాననే ధీమాతో ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు బీఆర్‌ఎస్‌ మద్దతు తమకే అని ప్రచారం చేసుకుంటున్నా.. అధికారిక ప్రకటన రాలేదు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చెన్నకేశవరెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపుతోందనే వాదన నడుస్తోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. దానికంటే మూడు నాలుగు నెలల ముందు జరిగే టీచర్‌ ఎమ్మెల్సీ ఎలక్షన్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఫలితం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న మూడ్‌ బయట పడుతుందనేది కొందరి వాదన. దాంతో టీచర్ల వైఖరి ఏంటి? ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటున్నారు? అని ఆరా తీస్తున్నారట. దీంతోపాటే జనార్దన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డిలలో ఎవరు అధికారపార్టీ మద్దతు సంపాదిస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బరిలో 21 మంది ఉండటంతో ఎవరు ఎన్ని ఓట్లు చీలుస్తారు? ఎక్కువ మొగ్గు ఎవరికి ఉంది అనేది కూడా కీలకంగా మారుతోంది.

Exit mobile version