NTV Telugu Site icon

Off The Record: దీక్షా దివస్ వెనుక BRS అధిష్టానం వ్యూహమేంటి.?

Brs

Brs

Off The Record: నవంబర్ 29. నేటి బీఆర్‌ఎస్‌, నాటి టీఆర్‌ఎస్‌ చరిత్రలో మర్చిపోలేని రోజు. తెలంగాణ ఉద్యమ పథంలో… ఆఖరి అస్త్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న రోజు. 2009లో అదే రోజున ఆయన దీక్ష ప్రారంభించడం, ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామన్న నాటి కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్‌ దీక్ష విరమించడం తెలిసిందే. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా పదేళ్ళు అధికారంలో ఉంది బీఆర్‌ఎస్‌. నవంబర్‌ 29ని దీక్షా దివస్‌గా ప్రకటించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా… అవి ఎప్పుడూ సాధారణంగానే ఉండేవి. కానీ… మొట్టమొదటిసారి… ఈ విడత దీక్షా దివస్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది పార్టీ. గత పదేళ్ళలో లేనంత హంగు ఆర్భాటం కనిపించింది. ఇక్కడే రకరకాల డౌట్స్‌ వస్తున్నాయట రాజకీయవర్గాలకు. తాము అధికారంలో ఉన్నప్పుడు చాలా ఘంగా నిర్వహించే అవకాశం ఉన్నా… అప్పుడెప్పుడూ ఆ ప్రయత్నం చేయకుండా… ఇప్పుడే ఎందుకు ఆ ప్రోగ్రామ్‌ని అంత ఘనంగా జరిపారన్న చర్చ జరుగుతోంది. అంటే…అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత డీలా పడ్డ పార్టీ కేడర్‌ను రీ ఛార్జ్‌ చేసేందుకు ఈ రోజును పార్టీ అధిష్టానం ఉపయోగించుకుందా అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.

భారీగా జన సమీకరణ, జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాల ద్వారా… నాడు కేసీఆర్‌ చేసిన త్యాగం వల్లే రాష్ట్రం వచ్చిందని ఇప్పుడు… తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తు చేయాలనుకున్నారా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చి… తెలంగాణ బ్రాండ్‌ను వాడుకోవాడానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమైందా? ఛాంపియన్‌ కేసీఆరేనని మళ్ళీ మళ్ళీ చెప్పడంతోపాటు జనంలోకి ఎక్కించాలన్న ప్లాన్‌ ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. అలాగే కరీంనగర్‌లో కేటీఆర్‌, సిద్దిపేటలో హరీష్‌రావు స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొని కేడర్‌లో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అంతకు మించి… జైలుకు వెళ్లి వచ్చాక పూర్తి స్థాయిలో పొలిటికల్‌ మౌనం పాటించిన ఎమ్మెల్సీ కవిత… తొలిసారి దీక్షా దివస్‌ కోసం తెలంగాణ భవన్‌కు వచ్చారు. అంటే ఆమె కూడా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యేందుకు దీన్నో మంచి వేదికగా ఉపయోగించుకున్నారన్న వాదన బలంగా ఉంది. రాష్ట్ర సెంటిమెంట్‌కు సంబంధించిన కార్యక్రమంతో రీ ఎంట్రీ ఇచ్చారుగనుక ఇక ఆమెకు పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండదని, అందుకే ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారన్న వాదన సైతం ఉంది. పూర్తి ప్రతికూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో… ఈ దీక్షా దివస్‌ పార్టీ రీ ఛార్జ్‌కు బాగానే ఉపయోగపడి ఉంటుందన్నది తెలంగాణ పొలిటికల్‌ పండిట్స్‌ చెప్పే మాట.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి ఇది బూస్ట్‌ ఇస్తుండవచ్చని కూడా లెక్కలేసుకుంటున్నారట. ఉద్యమ సెంటిమెంట్ మరోసారి జనంలో బలపడితే… రాజకీయంగా తమకు తేలిక అవుతుందన్నది బీఆర్ఎస్‌ పెద్దల భావనగా తెలుస్తోంది. మొత్తం మీద ఇలా రకరకాల కోణాల్లో దీక్షా దివస్‌ బీఆర్‌ఎస్‌కు పొలిటికల్‌ ఉపయోగపడుతుండవచ్చని అంటున్నారు. అందుకే పార్టీ అధిష్టానం కూడా అధికారం ఉన్నప్పటికంటే ఇప్పుడే కార్యక్రమాలను నిర్వహించి ఉండవచ్చన్నది విస్తృతాభిప్రాయం. పార్టీ ప్లాన్‌ ఏ మేరకు వర్కౌట్‌ అయ్యిందన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.