Off The Record: తెలంగాణ పొలిటికల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు మళ్ళుతోంది. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో… హోరా హోరీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి ప్రధాన రాజకీయపక్షాలు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే పొలిటికల్ వార్ మొదలైపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిందేనన్న కసితో బీఆర్‌ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు ఈసారి రాష్ట్రంలో ఈసారి పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ కూడా దీన్నో టెస్ట్‌గా భావిస్తోందట. అందుకే కాషాయదళం కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టైమ్ దొరికితే చాలు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నారట. ఆయన హైదరాబాద్‌లో ఉంటే… తప్పకుండా నియోజక వర్గాన్ని విజిట్ చేస్తూ… బస్తీలు, కాలనీల్లో తిరుగుతున్నారు. నియోజక వర్గ సమస్యల మీద ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల మీద కేంద్ర మంత్రి హోదాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
కిషన్‌రెడ్డి సిటీలో ఉంటే… సాధారణంగా… తన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో… లోకల్ ఎంపీగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ మీదే ఫోకస్ పెట్టి ఎక్కువ టైం కేటాయిస్తున్నారట. ఈ సీట్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం వ్యక్తిగతంగా తనకు కూడా ప్రతిష్టాత్మకం కావడంతో… ఆయన సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోందన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ కోసం మానిటరింగ్ కమిటీని కూడా వేసింది బీజేపీ. బూత్ స్థాయి కమిటీలకు ఇన్చార్జిల నియామకం పూర్తయిపోయింది. ఇతర నియోజక వర్గాలకు చెందిన నేతలకు బాధ్యతలు అప్పగించింది రెగ్యులర్‌గా ఆ కమిటీలతో రివ్యూలు చేస్తున్నారు కిషన్ రెడ్డి. ఆయన సంగతి అలా ఉంటే…
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు కూడా ఇది అగ్నిపరీక్షేనంటున్నారు. ఆయన రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకున్నాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ట్రాక్ రికార్డ్ బీజేపీకి ఉంది. ఇప్పుడు రామచంద్రరావు కూడా ఆ పరంపరను కొనసాగిస్తారా? లేదా అని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. రామచంద్రరావు నాయకత్వంలో ఫస్ట్ ఎలక్షన్ కావడంతో… ఆయన ఎన్నికల వ్యూహం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కూడా ఉంది బీజేపీ వర్గాల్లో. ఒక రకంగా ఇది ఆయనకు సవాలేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొత్త అధ్యక్షుడి సమన్వయ శక్తికి ఇది నిజమైన పరీక్షేనన్న అభిప్రాయం బలపడుతోంది. రామచంద్రరావుది గోల్డెన్ హ్యాండా లేక మరోటా అన్నది కూడా ఈ ఉప ఎన్నికతో తేలిపోతుందన్న చర్చ సైతం ఉంది బీజేపీ సర్కిల్స్‌లో. స్థానిక సంస్థల ఎన్నికలు తనకి సవాల్ అని ఇప్పటికే ప్రకటించారాయన. మరి గ్రేటర్ హైదరాబాద్‌లో బలం ఉన్న పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్‌గా రామచంద్రరావు వ్యూహాలవైపు ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీలోని ఇద్దరు ముఖ్యులకు అగ్ని పరీక్షేనన్న అభిప్రాయం బలపడుతోంది.
