Off The Record: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. ఈ సామెతను మర్చిపోకుండా ఉంటే…. మీకే మంచిదంటూ… భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పదేపదే చెబుతున్నారట మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ హస్తం పార్టీ నేతలు. అంతేకాదు… ఏ రోటికాడ ఆ పాట పాడితే… తర్వాత మేం వేసే మ్యూజిక్ వేరేగా ఉంటుందని సీరియస్‌గా వార్నింగ్స్ సైతం ఇస్తున్నట్టు తెలిసింది. ఆ హెచ్చరికల మోత మోగిపోవడంతో… ఎంపీ సాబ్ ఏం చేయలేక చివరికి చాలామంది నాయకుల ఫోన్ నంబర్స్‌ని బ్లాక్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ చామల ఏమన్నారు? మునుగోడు కాంగ్రెస్ నాయకులు ఆ స్థాయిలో ఎందుకు దండయాత్ర చేస్తున్నారంటే… స్టోరీ చాలానే ఉందట. ఇటీవలి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సమయంలో దీనికి బీజం పడిందని అంటున్నారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్‌లు ఆశించగా… ఎంపీ ఏ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్‌గా మాట్లాడారట.
Read Also: Hyderabad: లవర్‌తో కలిసి తల్లిని చంపిన ప్రియురాలు.. తప్పేం లేదన్న ప్రియుడి తల్లి..
దీంతో… ఎక్కడో కాలిపోయిన మునుగోడు నాయకులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి మరీ… దబిడిదిబిడే అనడం మొదలుపెట్టినట్టు తెలిసింది. మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీ స్థాయిలో కూడా గట్టి లాబీయింగ్ చేసినా… ఉపయోగం లేకుండా పోయింది… అది వేరే సంగతి. కానీ.. ఆయన ట్రయల్స్‌లో ఉన్న సమయంలో… రాజగోపాల్‌రెడ్డికి పదవి ఇవ్వాల్సిందేనని చౌటుప్పల్ మీటింగ్‌లో గట్టిగా మాట్లాడారు ఎంపీ చామల. ఆ తర్వాత తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న మరో సెగ్మెంట్‌లో పర్యటించారాయన. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవికి పూర్తి అర్హుడేనని, ఆయనకు పదవి ఇవ్వాల్సిందేనని బల్లగుద్దిమరీ చెప్పేశారట. ఇక్కడే మునుగోడు కాంగ్రెస్ నాయకులకు మండిందని చెప్పుకుంటున్నారు. సదరు ఎమ్మెల్యేది కూడా రెడ్డి సామాజికవర్గమే కావడంతో విస్తరణలో ఇద్దరు రెడ్లకు ఎలా ఇస్తారని అనుకున్నారు? అలా జరగదని తెలిసి కూడా ఎంపీ…. ముఖస్తుతి కోసం ఏ రోటి కాడ ఆ పాట పాడి మా నాయకుడిని అవమానించారంటూ మండిపడుతున్నారు రాజగోపాల్‌రెడ్డి అనుచరులు.
Read Also: Iran-Israel War : ట్రంప్ వార్నింగ్.. దాడులు ఆపేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటన..
చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అలా ఎలా నాలుక మడతేస్తారన్నది వాళ్ళ ప్రశ్న. ఈ క్రమంలోనే… ఎంపీ పేరు చెబితే చాలు…. ఫైరైపోతోందట మునుగోడు కాంగ్రెస్ కేడర్. ఏం…. ఆయన మాటల్లో తప్పేముంది? రాజకీయాల్లో ఇలాంటివి మస్తు చెబుతుంటారు? మీరు ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏముందని ఎవరన్నా అడిగితే… మీకేం తెలుసు భయ్యా… అసలు మేటర్ వేరే ఉంది. చామల కిరణ్… రాజగోపాల్‌రెడ్డికి అనుకూలంగా మాత్రమే మాట్లాడాలని క్లారిఫికేషన్ ఇస్తున్నారట. ఇంతకీ… మునుగోడు కాంగ్రెస్ నేతల వెర్షన్ ఏంటంటే… భువనగిరి ఎంపీగా చామలను గెలిపించడానికి రాజగోపాల్‌రెడ్డి చాలా కష్టపడ్డారు. అధిష్టానానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆయన కాళ్ళు అరిగేలా తిరిగి…. సొంత డబ్బులు కూడా ఖర్చుపెట్టుకున్నారు. ఇంతా చేస్తే… ఆయనకు కాకుండా ఇంకెవరికో… మంత్రి పదవి ఇవ్వాలని అనడమంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కాదా అని నీలదీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా అలా ఫీలై ఊరుకోకుండా…. వరుసబెట్టి ఎంపీకి ఫోన్స్ చేసి నిలదీస్తున్నట్టు సమాచారం. అలా నిలదీతలు, విసిగింతలు పెరిగిపోవడంతో… మునుగోడు నుంచి కాల్ వస్తోదంటే చాలు… కంగారు పడుతున్నారట ఎంపీ. ఆ క్రమంలోనే నియోజకవర్గానికి చెందిన చాలా మంది నాయకుల ఫోన్ నంబర్స్‌ని బ్లాక్‌లో పెట్టినట్టు తెలిసింది. ఈ పరిణామం ఎంపీకి ఇబ్బందికరమవుతుండగా.. ఆయన సన్నిహితులు మాత్రం ఆడుసు తొక్క నేల.. కాలు కడగనేల అంటూ సెటైర్లు వేస్తున్నట్టు తెలిసింది. ఎవరి మెప్పు కోసం అలా మట్లాడావంటూ నిలదీస్తున్నారట కొందరు. ఇలా…. మొత్తంగా తన నోటి మాటలతో ఇరుకున పడి ఉక్కిరి బిక్కిరవుతున్నారట భువనగిరి ఎంపీ.