NTV Telugu Site icon

Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే యూటర్న్..? టైం కోసం ఎదురుచూస్తున్నారా..?

Aroori Ramesh

Aroori Ramesh

Off The Record: పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగి, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కాషాయ కండువా వదిలేసి తిరిగి కారెక్కేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. బీజేపీ నుంచి లోక్ సభ బరిలో నిలిచిన ఆరూరి…. ఆ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొనడం లేదట. బయట కూడా అంత యాక్టివ్‌గా తిరక్కపోవడంతో… ఇక పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటి దాకా మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకున్నా… స్థానిక సంస్థల ఎన్నికలకు కాస్త అటు ఇటుగా ఆయన పార్టీ మారడం ఖాయమని మాత్రం మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా స్టేషన్ ఘనపూర్‌లో పోటీ చేసి ఓడిపోయిన రమేష్‌… తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ నుంచి వర్ధన్నపేటలో పోటీ చేసి గెలిచారు. గులాబీ పార్టీ తరపున రెండు సార్లు మంచి మెజార్టీతో విజయం సాధించిన ఆరూరి రమేష్‌…అంచనాలు 2023 ఎన్నికల్లో తల్లకిందులయ్యాయి. ఇక ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ తరపునే ఎంపీ పోటీ చేయాలని అనుకున్నారు. కానీ… ఆ సీటును పార్టీ అధిష్టానం కడియం కావ్యకు డిసైడ్‌ చేయడంతో…

Read Also: Off The Record: గుర్తింపు లేనప్పుడు ఎందుకు..! ఫ్రస్ట్రేషన్‌లో తాడికొండ ఎమ్మెల్యే..

నొచ్చుకున్న ఆరూరి…. నాటకీయ పరిణామాల మధ్య బీజేపీలో చేరారు. అనుకున్నట్టుగానే ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకుని వరంగల్ లోక్ సభ బరిలో నిలిచినా విజయం దక్కలేదు. క్షేత్రస్థాయిలో ఆయనతో పాటు అనుచరులపై ఉన్న వ్యతిరేకత మైనస్‌ అయినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత కూడా కొంతకాలం బిజెపి జిల్లా నేతలు, కార్యకర్తలతో టచ్ లోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. కానీ… ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం ఉంటున్నట్టు తెలిసింది. పార్టీ హైకమాండ్‌ ఆదేశాలతో… మహారాష్ట్ర ఎలక్షనీరింగ్‌కి వెళ్ళి వచ్చినా…. జిల్లాలో మాత్రం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఆరూరికి సమాచారం ఇచ్చినా ఏ కార్యక్రమానికి హాజరవడంలేదని బీజేపీ నేతలు చెబుతున్నారంటే… ఇక ఆయన పార్టీకి దూరం జరిగినట్టే భావించాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో టచ్‌లోకి వెళ్ళినట్టు ప్రచారం మొదలైంది.

Read Also: Supreme Court: ‘‘రిలేషన్‌షిప్ చెడిపోయిన తర్వాత రేప్ కేసులు’’.. సుప్రీం ఆందోళన..

హరీష్‌రావుతో అనుబంధం ఉందని, ఆ లింక్‌తోనే కేటీఆర్‌ని కూడా కలిసి మాట్లాడారని చెప్పుకుంటున్నారు స్థానికంగా. కేటీఆర్‌ కూడా ఓకే అన్నా… కేసీఆర్‌ హోల్డ్‌లో పెట్టారని, వేచి చూద్దాం.. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పడంతో… ఆ ఉద్దేశ్యంతోనే ఆరూరి బీజేపీకి దూరం జరిగి ఉండవచ్చని అనుకుంటున్నారు. మొత్తంగా ఆరూరి రమేష్‌ యూ టర్న్‌ ఖాయమని, స్థానిక సంస్థల ఎన్నికల టైంకి ఆయన తిరిగి గులాబీ కండువా కప్పుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇంతవరకు బీఆర్ఎస్ నేతలెవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో ఇక పెద్దగా అడ్డంకులేవీ ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా అందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నట్టు తెల్సింది. బయట ఇంత చర్చ జరుగుతున్నా… ఆరూరి వైపు నుంచి మాత్రం ఇంకా క్లారిటీ లేదు.