Site icon NTV Telugu

Off The Record: పశ్చిమ గోదావరి జిల్లా కూటమి రాజకీయం ఎలా మారబోతుంది..?

West

West

Off The Record: 2024 ఎన్నికల్లో ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు. గెలుపు కోసం ఐదేళ్ళు ఎదురు చూసిన కొందరు పొత్తు ధర్మంలో భాగంగా అప్పటిదాకా తాము వర్కౌట్‌ చేసుకున్న సీట్లను జనసేనకు వదులుకోవాల్సి వచ్చింది. సర్దుకుపోవాల్సిందేనని పార్టీ పెద్దలు తెగేసి చెప్పడంతో టిడిపి సీనియర్లు సైతం నోరుమెదపలేకపోయారు అప్పట్లో. అంత వరకు ఓకే అనుకున్నా… ఆ తర్వాతే అసలు టెన్షన్‌ మొదలైందట. నాడు సీట్లు త్యాగాలు చేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తారని ఆశించినా… ఇన్నాళ్ళు ఎలాంటి కదలిక లేకపోవడంతో వెస్ట్‌ తమ్ముళ్ళలో అసంతృప్తి, ఆందోళన పెరిగిపోయాయి. ఇటు సీట్లు వదులుకుని దగ్గరుండి గెలిపించుకున్న జనసేన నేతలు పట్టించుకోడంలేదు.. అటు సొంత పార్టీ పెద్దలు గుర్తించడం లేదని తెగ ఫీలైపోతున్న దశలో… తాజాగా ప్రకటించిన నామినేటెడ్‌ పోస్ట్‌లు మండుటెండల్లో మంచు జల్లులా అనిపించాయట ఉమ్మడి జిల్లా నాయకులకు. ఇన్నాళ్ళు నిడదవోలు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం లాంటి నియోజకవర్గాల్లో బాహాటంగానే అసంతృప్తిని ప్రకటించారు టిడిపి కీలక నాయకులు. కొందరైతే చాప చుట్టేద్దామని కూడా అనుకున్నారట. కానీ.. అధికారంలో ఉన్నప్పుడు ఆవేశపడకూడదని కాస్త ఆగినట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Kangana Ranaut: ట్రంప్‌పై కంగనా రనౌత్ పోస్ట్.. నడ్డా ఆదేశాలతో తొలగింపు.. పోస్ట్‌లో ఏముందంటే..!

ఈ పరిస్థితుల్లో మిగతా జిల్లాల కంటే ఉమ్మడి పశ్చిమగోదావరికి పెద్దపీటవేస్తూ నామినేటెడ్‌ పదవులు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారట నాయకులు. జరుగుతున్న డ్యామేజ్‌ని కవర్ చేసుకోడానికేనని ఇప్పుడు అంత ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. 2024ఎన్నికల్లో టిడిపి బలంగా ఉన్న ఉంగుటూరు, భీమవరం, నర్సాపురం, నిడదవోలు, పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిపోయాయి. ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జ్‌లంతా ఇన్నాళ్ళు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. పదవులు దక్కక, నియోజకవర్గంలో ప్రాధాన్యత లేక దాదాపుగా ఇళ్ళకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా జనసేన ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో పాతుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా వాళ్ళని కంగారు పెడుతున్నట్టు సమాచారం. ఇక భవిష్యత్‌లో అవకాశాలు దక్కవని, తమకి ఎలాంటి ప్రాధాన్యత ఉండదని ఫిక్సయిన కొందరు పార్టీ వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారన్న ప్రచారం నడుమ… అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని సమాచారం. అందుకే ఈసారి ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో మూడోవంతు ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా నేతలకే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Software Job: లక్షల్లో వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..

జనసేన ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని టీడీపీ పెద్దలు చెబుతున్నా తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఉంగుటూరు, నర్సాపురం నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి లేదంటున్నారు. పైగా అక్కడి టిడిపి నేతల్ని పక్కనపెట్టి జనసేన పాతుకుపోయే ప్రయత్నంలో ఉందని, కంచుకోటలాంటి పశ్చిమలో టిడిపి ప్రాధాన్యత తగ్గుతోందన్న విశ్లేషణలున్నాయి. ఇటీవల తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. టిడిపి ఇంఛార్జి వలవల బాబ్జి మద్య దూరం పెరగడం.. నిడవోలులో మంత్రి కందుల దుర్గేష్‌కు వ్యతిరేకంగా టిడిపి నాయకులు సమావేశాలు నిర్వహించడం, మిగతా చోట్ల నాయకులు పార్టీకి దూరంగా ఉండటం వంటి పరిణామాలను పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుని ఈసారి జాబితాలో జిల్లాకు ప్రాధాన్యత కల్పించినట్టు అంచనా వేస్తున్నారు. తాజాగా నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్నవారిలో తాడేపల్లిగూడెం ఇంఛార్జి బాబ్జి, నిడదవోలు ఇంఛార్జి బూరుగుపల్లిశేషారావు, ఉంగుటూరు ఇంచార్జి గన్ని వీరాంజనేయులతో పాటు మాజీ మంత్రులు పీతల సుజాత, కెఎస్ జవహర్‌లు ఉన్నారు.

Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. షాకిచ్చిన నూజివీడు కోర్టు..

అయితే పదవులు వచ్చాయి కాబట్టి అంతా సెట్‌ అవుతుందా అంటే… చెప్పలేమన్నది పొలిటికల్‌ పరిశీలకుల మాట. వాళ్ళకు పదవులు లేవు కాబట్టి ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా పరిస్థితి మారిపోయి అసలు కథ ఇప్పుడే మొదలవుతుందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. ఇంతకాలం గుర్తింపులేదని ఆందోళనపడ్డ నాయకులు ఇకపై రివెంజ్‌ తీర్చుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు కొందరు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి పశ్చిమ కూటమి రాజకీయం ఇంకా రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పదవులు లేవని ఇన్నాళ్ళు పక్కనపెట్టిన జనసేన ఎమ్మెల్యేలు… ఇపుడు టిడిపి ఇన్ఛార్జ్‌లకు ఇప్పుడు గుర్తింపు ఇవ్వాల్సి ఉన్నందున కోల్డ్‌వార్‌ ఏ టర్న్‌ తీసుకుంటుందోనని ఆసక్తిగా చూస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version