NTV Telugu Site icon

Off The Record: ఏపీలో ర్యాంకుల లొల్లి.. మంత్రుల్లో అభద్రతా భావాన్ని పెంచుతుందా..?

Ap Ministers Ranks

Ap Ministers Ranks

Off The Record: మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు అంటారు. కానీ…. ఏపీలో మాత్రం మంచో చెడో తెలియదుగానీ…. మొత్తం మైకులో చెప్పేశారు. ఇప్పుడిదే రాష్ట్రంలో చర్చోప చర్చలకు కారణం అవుతోంది. తనతో సహా… మంత్రివర్గ సహచరులందరికీ ర్యాంక్స్‌ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. వాటి చుట్టూనే ఇప్పుడు కొత్త ప్రశ్నలు, అనుమానాలు రేగుతున్నాయట. సాధారణంగా చంద్రబాబు స్టైల్‌ ఆఫ్‌ ఫంక్షనింగ్‌ అంటే… ర్యాంకులు…గ్రేడ్లు….అంటూ రకరకాల తూనికలు-కొలతలు ఉంటాయి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనని గతంలో అంటూ… అధికారులు, కెబినెట్‌ సహచరుల్ని పరుగులు పెట్టించిన సందర్భాలున్నాయి. దాంతో చిర్రెత్తుకొచ్చిన కొందరు ఆఫీసర్స్‌, ప్రజాప్రతినిధులు ఆయనకు నిద్ర రాకుంటే… మా నిద్ర చెడగొడతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన సందర్భాలు సైతం ఉన్నాయట గతంలో. కానీ… అదంతా గతం. ఇప్పుడు బాబు మాట మారింది. నేను మళ్ళీ 95 సీఎంలా మారతానంటూనే…. నైన్‌ టు ఫైవ్‌ పనిచేయండి ఫర్లేదని చెబుతున్నారు. ఆదివారం ఫ్యామిలీస్‌తో గడపండని మంత్రులకు కూడా చెప్పేశారాయన. దాంతో కాస్త రిలీఫ్‌గా ఫీలవుతున్న మినిస్టర్స్‌ నెత్తిన ఇప్పుడు కొత్తగా ర్యాంకుల పిడుగు పడిందని అంటున్నారు. తాజా క్యాబినెట్‌ మీటింగ్‌లో ర్యాంక్స్‌ రిజల్ట్‌ ఇచ్చేశారు చంద్రబాబు. దాంతో ప్రిపరేషన్‌ లేకుండా ఎంసెట్‌ ఎగ్జామ్‌ పేపర్‌ చేతికి వచ్చినట్టు ఫీలవుతున్నారట కొందరు మంత్రులు. పరస్పరం ఫోన్లు చేసుకుని మరీ పలకరించుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఒక కామన్‌ క్వశ్చన్‌ లేవనెత్తుతున్నట్టు సమాచారం. దేని ఆధారంగా ర్యాంక్స్‌ ఇచ్చారంటే… ఫైళ్ళ క్లియరెన్స్‌ను బేస్‌ చేసుకుని అన్నది సమాధానం.

కానీ… కొందరు మినిస్టర్స్‌కి ఇక్కడే అభ్యంతరాలు ఉన్నట్టు తెలుస్తోంది. శాఖల వారీగా చూసుకుంటే… కొన్ని విభాగాల్లో ఎక్కువ ఫైల్స్‌ ఉంటాయి, మరికొన్ని చోట్ల తక్కువ ఉంటాయి. అదీకాకుండా అత్యంత సమస్యాత్మక, ఇబ్బందికరమైన ఫైల్స్‌ కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఉంటాయి. అలాంటి వాటిని తన టేబుల్‌ మీదికి రాగానే ఏ మంత్రి అయినా సంతకం చేసేసి పంపేయడం కుదరకపోవచ్చు. మరి దాన్ని మంత్రి పనితీరుతో ముడిపెడితే ఎలాగన్నది క్వశ్చన్‌. తక్కువ రిస్క్‌, తక్కువ ఫైల్స్‌ ఉండే చోట పెండింగ్‌ లేకుండా వాళ్ళు బాగా పని చేసినట్టు, రిస్క్‌ ఉన్న ఫైల్స్‌ పెండింగ్‌లో పెడితే వాళ్ళు పనిచేయనట్టు అంటే ఎలాగంటూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. క్షేత్ర స్థాయిలో జనం మధ్య ఎక్కువగా తిరిగే వాళ్ళకు క్లియరెన్స్‌లో కాస్త టైం పట్టవచ్చని కూడా అంటున్నారు. ఈ ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకించడం లేదని, మంత్రుల పని తీరును ఇంటర్నల్‌గా చెప్పడం మంచిదే గానీ… ఇలా బాహాటంగా ప్రకటిస్తే… రేపు జనంలో ఇబ్బందికరమైన పరిస్థితులు రావా అన్నది ఒకరిద్దరి బాధగా తెలుస్తోంది. ఓవరాల్‌ పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా…కేవలం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చేసి ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని డైరెక్ట్‌గా ముఖ్యమంత్రే చెప్పేసినట్టు అయిందని, దీన్ని రేపు ప్రతిపక్షాలు అందిపుచ్చుకుని పనిచేయని మంత్రులు అంటూ నిందలేస్తే పరిస్థితి ఏంటని కొందరు మినిష్టర్స్‌ బాధపడుతున్నట్టు సమాచారం. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉందండోయ్‌…. ముఖ్యమంత్రి స్వయంగా తాను ఆరో స్థానంలో ఉన్నానని ప్రకటించుకోవడం అంటే… ఆయనకంటే మిగతా ఐదుగురూ సమర్ధవంతంగా పని చేస్తున్నారనా? సీఎంకంటే ఆ ఐదుగురి వర్క్‌ సూపర్‌గా ఉందనా? లేక ర్యాంకుల గోలలో సీఎం తనను తానే తక్కువ చేసుకుంటున్నారా? అన్న చర్చ కూడా జరుగుతోందట కేబినెట్‌ సహచరుల మధ్య.

ఇదిలా ఉంటే… అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పదో ర్యాంక్ వచ్చింది. ఆయన వైరల్‌ ఫీవర్‌తో కేబినెట్‌ భేటీకి హాజరవలేదు. ఆయన లేనప్పుడు ఇలా పదో ర్యాంక్‌ అంటూ ప్రకటించడం, డిప్యూటీ సీఎం గురించి స్వయంగా సీఎమ్మే అలా చెప్పడంతో… అసహనంగా ఉన్నారట జనసేన నాయకులు. పవన్‌ను తక్కువ చేశారంటూ… ఆ పార్టీ ముఖ్యులు కొందరు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా బహిరంగంగా ర్యాంకులు, గ్రేడ్స్‌ అని సీఎం ప్రకటనలు చేస్తుంటే…. మంత్రుల్లో ఒకరకమైన అభద్రతా భావం పెరుగుతుందని, అది అంతిమంగా వాళ్ళ పనితీరుపై నిజంగానే ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలున్నాయి. నేను చేసే ప్రతి పనిని ఎవరో గమనిస్తున్నారన్న ఫీలింగ్‌ పెరిగితే… మంత్రులు కంఫర్ట్‌గా ఉండలేకపోవచ్చని కూడా అనుకుంటున్నారు. ర్యాంకులకు బదులు పెండింగ్‌ లేకుండా ఫైల్స్‌ క్లియర్‌ చేసిన మంత్రుల్ని ప్రత్యేకంగా అభినందించడం లాంటి పనిని అదీ అంతర్గతంగా చేసుకుంటే బాగుండేదని, ఇలా… నీట్‌, ఎంసెట్‌ ర్యాంకుల్లా బహిరంగ ప్రకటనలు చేయడం వల్ల వాళ్ల నైతిక స్థైర్యం దెబ్బ తినదా అన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. రాబోయే రోజుల్లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే.. ర్యాంకుల ప్రకటన తర్వాత ఎక్కడో తేడా కొడుతోందని గ్రహించిన సీఎం… ఇది ఒకర్ని ఎక్కువ చేయడానికి, ఒకర్ని తక్కువ చేయడానికి కాదంటూ ట్వీట్‌ చేశారు. కానీ… అప్పటికే జరగాల్సిన చర్చ మాత్రం జరిగిపోయింది.