Site icon NTV Telugu

Off The Record: తేడా తేడాగా నరసరావుపేట టీడీపీ నేతల తీరు..

Otr Narasaraopet Tdp

Otr Narasaraopet Tdp

Off The Record : తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట పల్నాడు జిల్లా నరసరావుపేట. తర్వాత ఇక్కడ పార్టీ దారుణంగా దెబ్బతిని గత ఎన్నికల్లో తిరిగి కోలుకున్నా…. ప్రస్తుత పరిస్థితులు బాగా తేడాగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అనుచరులమంటూ… ఆయన పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న వ్యవహారాలు పార్టీకి షాకిస్తున్నాయట. ఇంకా, నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… మళ్ళీ కప్పెట్టేసేలా ఉన్నాయన్న మాటలు కేడర్‌ నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వా కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2004, 2009లో కూడా ఓడిపోయారాయన. ఇక 2014, 2019 ఎన్నికల్లో నర్సరావుపేటనుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఆ విధంగా ఒకప్పటి కంచుకోటలో రెండు దశాబ్దాలపాటు పసుపు జెండా ఎగరలేదు. కానీ… 2024 ఎన్నికల్లో పరిస్థితులు మారాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన చదలవాడ అరవిందబాబు గెలిచారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ కార్యకర్తలు ఆనందించేలోపే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందట. ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారశైలితో సొంత పార్టీలోనే కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేకించి ఓ సామాజికవర్గానికి చెందిన వాళ్ళయితే… అసలు ఆయన్ని పట్టించుకోవడం మానేశారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.

మరోవైపు అరవిందబాబు అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది చేస్తున్న పనులు, వాళ్ళ తీరు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది. వాళ్ళ వ్యవహారంపై సొంత పార్టీ నేతలు కూడా మండిపడే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే పేరుచెప్పి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ గల్లా పెట్టెలు పెట్టేశారట. వసూల్‌ రాజాల అవతారం ఎత్తి విభాగాల వారీగా పంచుకుని మెక్కేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ ఛోటా నేత పోలీస్ స్టేషన్స్‌ పంచాయితీల్లో మునిగి తేలుతున్నారన్నది లోకల్‌ వాయిస్‌. ఏదైనా వివాదం స్టేషన్‌కు వెళ్తే చాలు…. వెంటనే సదరు నేత అక్కడ వాలిపోతున్నాడట. పోలీసులకంటే ముందే తాను జోక్యం చేసుకుని మాట్లాడుకుందా రమ్మంటూ కలెక్షన్‌ పర్వానికి తెరలేపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అతని వ్యవహారశైలితో చివరికి పోలీసులు సైతం విసిగిపోయారట. ఈ దందాలో సదరు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు చివరికి తెలుగుదేశం కార్యకర్తల్ని కూడా స్పేర్‌ చేయడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మన పార్టీ లేదు, పక్క పార్టీ లేదు. ఎవరు క్యాష్‌ కొడితే వాళ్ళే మనోళ్ళు అన్నట్టుగా ఉందట వ్యవహారం. యాక్షన్‌ తీసుకుందామా అంటే…. మాటకు ముందు ఎమ్మెల్యే పేరు చెబుతుండటంతో… పోలీసుల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా ఉందట. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టు ఒకటి దక్కించుకుని నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ లక్షలు దండుకుంటున్నట్లు పేటలో ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యేకి మరో భూజాన్ని అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ మైనార్టీ నేత చేతివాటం చూసి టీడీపీ వాళ్ళే షాక్ తింటున్నారట. వైద్య సాయం కోసం పేదలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకుంటే… అందులో కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేత ఎక్సైజ్, విద్యుత్ విభాగాల్లో జోక్యం చేసుకుంటూ దండుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక మున్సిపాలిటీలో పనులు, బిల్లుల వరకు అంతా తానే అంటూ మరో నాయకుడు వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదంగా మారింది. మున్సిపల్‌ కాంట్రాక్టులు దక్కించుకున్నవారు తమకు పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని ఓ నాయకుడు రూల్‌ పాస్‌ చేసినట్టు తెలిసింది. ఇక ఎమ్మెల్యే ఆఫీసులో కనిపించే ఓ ఛోటా లీడర్‌ చేతివాటం కూడా టాక్‌ ఆఫ్‌ది టౌన్‌ అవుతోంది. అయితే… ఇక్కడే చాలా మందికి ఒక బేసిక్‌ క్వశ్చన్‌ వస్తోంది. అనుచరులంతా ఎవరికి వారు ఎమ్మెల్యే పేరు చెప్పి అడ్డగోలు దందాలు చేస్తున్నారు. వాటి గురించి నియోజకవర్గం మొత్తం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా… ఈ సంగతి ఆయనకు తెలియడం లేదా? ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చే వేగులు కరవయ్యారా…? లేక తెలిసి కూడా… ఆయనే తెలియనట్టు నటిస్తున్నారా అన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి నరసరావుపేటలో. రెండు దశాబ్దాల తర్వాత నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే…. దాన్ని కాపాడుకోవాల్సింది పోయి…. ఇలా ఎవరికి వారు బరితెగించి వసూళ్ళకు పాల్పడితే… పార్టీ ఇక్కడ తిరిగి నిలబడుతుందా అన్నది సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. ఎమ్మెల్యే అరవిందబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవకుంటే… ఆయన పొలిటికల్‌ కెరీర్‌తో పాటు లోకల్‌గా పార్టీ కూడా ఖతమవడం ఖాయమన్నది పేట టీడీపీ టాక్‌.

Exit mobile version