Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి ఎందుకు పదవులు వస్తాయి అనేది పార్టీ శ్రేణులకు, లీడర్స్‌కు అంతుచిక్కడం లేదు. పార్టీ కోసం పని చేసిన వారికి.. పదవులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయని… ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఇటీవల పార్టీలో భర్తీ అయిన పదవుల్లో ఈ ఫార్మలా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. తాజాగా ఏఐసీసీ సభ్యుల నియామకంలో జరిగిన పరిణామాలను చూస్తే అది అర్థం అవుతోంది. ఏఐసీసీ సభ్యుల జాబితాలో కోట నీలిమ అనే మహిళా నేతను కోఆప్షన్ సభ్యురాలిగా నియమించారు. ఏఐసీసీ సభ్యురాలిగానే కాదు.. పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలోనూ నీలిమకు అవకాశం ఇచ్చారు. నీలిమ అప్పటి వరకు కాంగ్రెస్‌లో పని చేసింది లేదనేది పార్టీలో మహిళా నేతల నుంచి వస్తోన్న విమర్శ. కాంగ్రెస్ కోసం రోడ్డెక్కిన దాఖలాలూ లేవని చెవులు కొరుక్కుంటున్నారు. నీలిమ పేరు బయటకు రాగానే పార్టీ వర్గాల్లో ఆమె ఎవరు అని ఆరా తీస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది.
Read Also: Off The Record: చీరాల వైసీపీలో జగడాలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా?
నీలిమ కాంగ్రెస్‌లోకి వచ్చీ రాగానే ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారని..పీసీసీలో పదవి ఇచ్చినప్పుడే కొంత చర్చ జరిగితే.. ఇప్పుడు AICC సభ్యుల జాబితాలోనూ ఆమె పేరు ఉండటంతో పార్టీ వర్గాల్లో అటెన్షన్ వచ్చింది. టీ కాంగ్రెస్‌లో మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్లు ఉన్నా.. వారికెవరికీ AICCలో చోటు దక్కలేదు. దీంతో పరపతి ఉంటే చాలు పదవులు వస్తాయా.. పిలిచి పట్టం కడతారా అనే విమర్శలు గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఇంత చర్చకు కారణమైన కోట నీలిమ ఎవరు? ఏఐసీసీలో మీడియా అండ్ పబ్లిసిటీ కమిటీకి చైర్మన్‌గా ఉన్న పవన్ ఖేరా భార్యే నీలిమ. ఆ కారణంగానే కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే పదవులు ఇచ్చారని కుతకుతలాడుతున్నారట మహిళా నేతలు. కాంగ్రెస్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి రావాలంటే ఎంతో కష్టపడాలని.. ఏళ్లకు ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న వాళ్లను అడిగితే ఆ బాధ తెలుస్తుందని కొందరు వాదిస్తున్నారట. కాంగ్రెస్‌లో తమకు పదవులు దక్కడం లేదని గొంతెత్తే నాయకులు ఈ విషయంలో మాత్రం ఎక్కడా పెదవి విప్పకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు ఇంకొందరు. ఈ అంశంపై నోరు విప్పకపోవడానికి కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న నాయకుడి కుటుంబం కావడంతో.. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని సైలెంట్ అయ్యారట.
Read Also: Off The Record: కంటోన్మెంట్ సీటుపై నేతల ఆశలు..! పోటీకి ఆ ముగ్గురు తహతహ..!
టాప్ టు బోటమ్ అంతా మౌనంగా ఉన్నప్పుడు మనం చూస్తూ ఊరుకోవాలని పవన్ ఖేరా ఎపిసోడ్‌పై కొందరు వ్యాఖ్యానిస్తున్నారట. కొన్ని కొన్ని అలా జరుగుతాయి. అలా జరక్కపోతే ఇది కాంగ్రెస్సే కాదు అని సెటైర్లు వేస్తున్నారట. మొత్తానికి పలుకుబడి ఉంటే కాంగ్రెస్‌లో పదవులు అవంతట అవే వస్తాయని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కాంగ్రెస్‌లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న మహిళా నేతలే తాజా పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారట.
