Off The Record: అచ్చంపేట బీఆర్ఎస్‌లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం నడుస్తోంది. తమ రాజకీయ ప్రయాణానికి అడుగడుగునా స్పీడ్ బ్రేకర్‌గా మారిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టార్గెట్‌గా ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. దీంతో అచ్చంపేట గులాబీ పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం… అచ్చంపేట నియోజకవర్గ అధికార పార్టీలో చిచ్చు రేపింది . ప్రస్తుత నాగర్‌కర్నూలు ఎంపీగా ఉన్న రాములు కుమారుడు భరత్ ప్రసాద్ కల్వకుర్తి జడ్పీటీసీగా గెలుపొందారు. ఎస్సీ రిజర్వ్ అయిన చైర్మన్ పదవి కోసం రెండు సార్లు జడ్పీ చైర్మన్‌గా అవకాశం రాగా… అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతో కలిసి వేసిన ఎత్తుగడలతో… జడ్పీ పీఠం అందినట్లే అంది మిస్ అయింది. దీంతో జడ్పీ పదవిలో తన కుమారుడిని చూడాలని ఆశించి భంగపడ్డ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్‌లు… ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. దీంతో ఒకే పార్టీలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. జడ్పీ చైర్మన్ పీఠం రాజేసిన కుంపటితో ఇప్పుడు తండ్రీ కొడుకులిద్దరూ వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బరిలో నిలవాలనే లక్ష్యంతో నియోజకవర్గాన్ని చుట్టేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Off The Record: అసెంబ్లీకి గవర్నర్ తమిళిసై.. గవర్నర్, సర్కార్ మధ్య స్నేహం బలపడేనా?
అచ్చంపేట ఎమ్మెల్యేగా మూడు సార్లు, ఒకసారి మంత్రిగా పనిచేసిన ఎంపీ రాములుకు… నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పరిచయాలు ఉండటంతో పాటు సౌమ్యుడు , వివాదరహితుడుగా పేరుంది. ఆ ఇమేజ్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచి గెలవడానికి మరింత దోహద పడుతుందని తండ్రీకొడుకులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే ఆలోచనతోనే జడ్పీ చైర్మన్ పదవి అవకాశం ఇవ్వలేదని, ప్రస్తుతం గువ్వల బాలరాజుకు సన్నిహితంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని రాములు అండ్ భరత్ చెబుతుండటం ఆసక్తిగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రీకొడుకుల్లో ఎవరికో ఒకరికి అధిష్టానం అవకాశం కల్పిస్తుందని, లేదంటే రెబల్‌గానైనా బరిలో నిలవడం మాత్రం ఖాయమని ఎంపీ రాములు శిబిరం అభిప్రాయపడుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో గువ్వల పాత్ర, నియోజకవర్గ వ్యాప్తంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలించే అంశాలుగా చెప్పుకొస్తోంది రాములు వర్గం.
Read Also: Off The Record: నెల్లూరు వైసీపీలో లుకలుకల రచ్చ.. డబుల్ గేమ్ నేతలపై హైకమాండ్ సీరియస్
ఇదిలా ఉంటే, ఎంపీ రాములు ఎక్కువ సమయాన్ని అచ్చంపేట నియోజకవర్గంలో గడపడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య అనుచరులు, మిత్రులు, బంధుగణాన్ని ఏకం చేసే పనిలో బిజీ అయ్యారట. ఇతర పార్టీల్లో ఉన్న తన అనుచరులతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వలతో విభేదించే వారితో టచ్‌లోకి వెళ్తున్నారట . నియోజకవర్గంలో ప్రతిరోజు పర్యటనలు చేస్తూ… పరామర్శలు , శుభకార్యాలకు హాజరు కావడంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు తండ్రీకొడుకులు. ప్రతిరోజు ఏదో ఒకచోట చిన్నచిన్న సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారట. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విసృతంగా పర్యటిస్తున్న రాములు, ఆయన కుమారుడు భరత్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు హ్యాట్రిక్ విజయం ఖాయమనే ధీమాతో ఉంది ఆయన అనుచర వర్గం. సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం అని గులాబీ బాస్ చెప్పడాన్ని గుర్తు చేయడంతో పాటు, అధిష్టానం నిర్ణయాన్ని జిల్లా అధ్యక్షుడి హోదాలో జడ్పీ చైర్మన్ ఎపిసోడ్‌ను అమలు చేసినట్లు గువ్వల టీమ్ చెబుతోంది. మొత్తం మీద అచ్చంపేట బీఆర్ఎస్‌లో రాజుకున్న రాజకీయ కుంపటిని అధిష్టానం ఎలా ఆర్పుతుందో చూడాలి. మరి రానున్న రోజుల్లో మారే రాజకీయ పరిణామాలతో ఇక్కడ ఎవరికి లాభమో… ఎవరికి నష్టమో… చూడాలి.