Site icon NTV Telugu

Off The Record: AB వెంకటేశ్వర రావు పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేస్తున్నారా..?

Ab Venkateswara Rao

Ab Venkateswara Rao

Off The Record: ఏబీ వెంకటేశ్వరరావు… రిటైర్డ్ ఐపీఎస్. 2014 – 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో… ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా వెలుగు వెలిగినట్టు చెప్పుకుంటారు. అప్పట్లో ఆయన నిర్ణయాలు, సలహాలకు తూచా తప్పకుండా అమలయ్యేవని చాలాసార్లు చెప్పేవారు వైసీపీ నాయకులు. కారణం ఏదైనా…. 2019లో వైసీపీ పవర్‌లోకి వచ్చాక ఏబీవీకి చుక్కలు కనపడ్డాయన్నది విస్తృతాభిప్రాయం. ఆయన మీద అప్పటి ప్రభుత్వం సస్పెన్శన్‌ వేటు, ఆయన న్యాయ పోరాటం గురించి అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఆ పోరాటంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్‌ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. టీడీపీ కూడా సందర్భాన్ని బట్టి ఆ ఇష్యూని వాడుకుందన్న అభిప్రాయాలున్నాయి. అదే ఊపులో… 2024 ఎన్నికల్లో ఏబీవీ నూజివీడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని చెబుతారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ మాజీ ఐపీఎస్‌ వ్యవహారశైలి కాస్త తేడాగా ఉందన్న చర్చలు మొదలయ్యాయి.

Read Also: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఏబీవీకి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ చైర్మన్ పదవి ఇచ్చింది కూటమి సర్కార్‌. కానీ… నెలలు గడిచిపోతున్నా… ఇప్పటి వరకు ఆ కుర్చీలో కూర్చోలేదాయన. తన స్థాయి, అప్పట్లో తాను చేసిన సేవలకు అది చాలా చిన్న పోస్ట్‌ అన్నది ఆయన అభిప్రాయంగా చెప్పుకుంటారు. నచ్చకనే ఛార్జ్‌ తీసుకోలేదట. ఇటీవల తన సొంత ప్లాట్ ఫాం ద్వారా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారాయన. అందులో… గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడిన వారిని పరామర్శించడం, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించడం లాంటివి ఉన్నాయి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి లబ్ధి చేకూరుతుందని, కేంద్రం అనుమతి ఇవ్వాలని ఒకవైపు ప్రభుత్వం కోరుతుంటే…. దానివల్ల నష్టం జరుగుతుందని పార్టీ మనిషిగా చెప్పుకునే ఏబీ వెంకటేశ్వరరావు మీటింగులు పెట్టి మరీ ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది. అంటే… దీన్ని బట్టి తాను టీడీపీకి అనుబంధంగా లేనని, సొంత ప్లాట్‌ఫాం ద్వారానే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు చెప్పదల్చుకున్నారా అన్నది కొత్తగా వస్తున్న డౌట్‌. ఈ క్రమంలో తాజాగా నూజివీడులో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆయన ఎవరిని టార్గెట్ చేశారంటూ.. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Read Also: Donald Trump: భారత్, రష్యాపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. టారిఫ్స్కు సిద్ధం కావాలని హెచ్చరిక!

నూజివీడులో డ్వాక్రా గ్రూపు బుక్ కీపర్ విషయమై ఏబీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు కష్టపడి ప్రభుత్వాన్ని మార్చినా….వైసీపీ గుండాలు టిడిపిలో చేరి ఇంకా అరాచకాలు చేస్తున్నారని కామెంట్‌ చేశారాయన. వైసీపీ హయాంలో డబ్బు దోచుకున్న వారంతా… టిడిపి కండువా కప్పుకుని ఇప్పుడు కూడా అలాగే… జనాలను వేధిస్తున్నారని, ఈ వ్యవహారంపై టిడిపి అధిష్టానం దృష్టి పెట్టాలని కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారాయన. దీంతో ఎవర్ని టార్గెట్‌ చేశారన్న ఆరాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రి పార్థసారధి ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారే. స్థానికుడు కాకున్నా… కూటమి హవాలో గెలిచారన్న టాక్‌ ఉంది సారధి విషయంలో. ప్రస్తుతం ఆయన వర్గం నేతలను ఉద్దేశించే ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ గుండాలు టిడిపిలో చేరారంటూ మాట్లాడి ఉండవచ్చంటున్నారు. శివ సాయి అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకుడుగా ఉన్నాడని, వాళ్ళ వెనకాల కొంతమంది పెత్తందారులు కూడా ఉన్నారంటూ ఏబీవీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ మాటలకు అటు మంత్రి మనుషులు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏబీ వెంకటేశ్వరరావు స్వరం పెంచితే… అది టీడీపీకి ఇబ్బంది కావచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.

Exit mobile version