తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బిజీలో పడింది. సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీని సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డారు నాయకులు. ఎన్నికల కోసమే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్‌లకు వ్యూహకర్తగా ఉన్నారు సునీల్ కనుగోలు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహన్ని ఆయన పార్టీకి అందజేశారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన త్రిశూల వ్యూహాన్ని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Off The Record: వైసీపీలో పరిణామాలతో టీడీపీలో కలవరం..! నాటి సీన్ రిపీట్ అవుతుందా..?
మొత్తం 119 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఈజీగా గెలిచే పరిస్థితి ఉందని సునీల్ తెలిపారట. నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించి కీలక సూచనలు చేశారట. అందులో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనేది వివరించారట. గ్రేటర్ హైదరాబాద్‌లో MIM నియోజకవర్గాలుగా ముద్రపడ్డ చోట పార్టీ ఆశలు వదిలేసుకున్నట్టు సమాచారం. కాకపోతే ఆ వర్గాలకు ఇంకా దగ్గరవ్వాలనే సూచన చేశారట వ్యూహకర్త. సునీల్ చెప్పినట్టుగా 119 నియోజకవర్గాలను మూడు విభాగాలుగా వర్గీకరించి పనిచేయాలని అనుకుంటున్నారట. నియోజకవర్గాలను గ్రీన్.. ఆరెంజ్.. రెడ్ జోన్‌లుగా విభజించారు వ్యూహకర్త. కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే నియోజకవర్గాలను గ్రీన్‌జోన్‌గా ప్రస్తావించారు. ఈ విభాగంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు.. గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన సెగ్మెంట్లు.. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన నియోజకవర్గాలు ఉన్నాయట. వీటిల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణ ఉందని సునీల్ తెలిపారట.
Read Also: Off The Record: బైరెడ్డి టోన్ మారుతోందా? మళ్లీ టీడీపీకి చేరువ అవుతున్నారా..?
ఇక ఆరెంజ్ జోన్‌లో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకాస్త ఎఫర్ట్ పెడితే ఫలితం సానుకూలంగా ఉంటుందని ఆయన తేల్చారట. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని.. అన్ని రకాలుగా ఫోకస్ పెడితే పార్టీ ఆశించిన రిజల్ట్స్ వస్తాయని నివేదికలో పొందుపర్చారట. గ్రీన్, ఆరెంజ్ జోన్‌లోకి రాని మిగతా నియోజకవర్గాలను రెడ్ జోన్‌లో ఉంచారు వ్యూహకర్త సునీల్. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలను ఈ జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ల విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. వ్యూహకర్త చెప్పిన ఈ మూడ్ జోన్‌లనే త్రిశూల వ్యూహంగా చర్చిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి.. ఈ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో.. ఎన్నికల సమర తంత్రాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో కాలమే చెప్పాలి.