NTV Telugu Site icon

Rajole YCP: రాజోలు వైసీపీలో రచ్చ.. బొంతు వర్సెస్ రాపాక

Rajole Ysrcp

Rajole Ysrcp

కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో మళ్ళీ రచ్చ మొదలైంది. రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనుచరులతో జరిగిన సమావేశంలో బొంతు రాజేశ్వరరావు మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.

రెండు రోజుల క్రితమే బొంతు రాజేశ్వరరావు ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రాజీనామా సమర్పించిన బొంతు ప్లీనరీకి వెళ్ళొద్దని తన అనుచరులకు బొంతు తేల్చి చెప్పారట. ఈ అంశం ఇప్పుడు రాజోలు వైసీపీ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Read Also: OTR: దర్శి టీడీపీలో కొత్తగా దుబాయ్ గోల.. పోయేదెపుడు?

బొంతు రాజేశ్వరరావు 2014, 2019లో రాజోలు వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. జనసేన అభ్యర్ధి రాపాకపై సుమారు 700 ఓట్ల తేడాతోనే బొంతు ఓడిపోయాక కొద్దిరోజుల్లోనే రాపాక జనసేన నుంచి వైసీపీకి జంప్ అయ్యారు. ఆ తర్వాత బొంతు రాజేశ్వరరావును వైసీపీ కో ఆర్డినేటర్, నియోజకవర్గ ఇంఛార్జ్ పదవుల నుండి అధిష్టానం తొలగించి, రాజోలు వైసీపీ కో ఆర్డినేటర్‌గా పెద్దపాటి అమ్మాజీకి బాధ్యతలు అప్పగించింది. కానీ, ఆమెకు బొంతు సహకరించలేదనే టాక్‌ ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అధిష్ఠానం రాజోలు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించింది. రాపాకకు బాధ్యతలు అప్పగించడం బొంతు రాజేశ్వరరావులో అసంతృప్తిని పెంచింది.

ఇరిగేషన్‌లో ఇంజినీర్‌ ఇన్ ఛీఫ్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు బొంతు రాజేశ్వరరావు. అయితే అనూహ్యంగా వరుస పరాజయాలతో పార్టీలో ఇరకాటంలో పడిన బొంతు రాజేశ్వర్రావుకు వచ్చే ఎన్నికల్లో రాజోలు వైసీపీ టికెట్ వస్తుందనే గ్యారంటీ లేదనే టాక్‌ ఉంది. ఈ సమయంలో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న బొంతు రాజేశ్వర్రావు, రాజీనామా పత్రాన్ని అధిష్ఠానానికి పంపారు. కానీ లేఖ పంపి 10 రోజులు గడిచినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజోలు నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా లేదా మరో పార్టీలో చేరతారా లేక వైసీపీలోనే కొనసాగుతారా అనే అంశంలో ఆయన డైలమాలో ఉన్నారనే టాక్‌ నడుస్తోంది.