NTV Telugu Site icon

Boda Janardhan: చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్న నేత.. అయోమయంలో క్యాడర్

Boda Janardhan

Boda Janardhan

పార్టీలు మారుతున్నా ఫలితం లేదు. ఎన్ని కండువాలు మార్చినా పదవి దక్కటం లేదు. అన్ని పార్టీలను ఓ రౌండ్‌ వేసిన ఆయన, చివరికి హస్తం గూటికి చేరారు. ఇక్కడైనా ఉంటారా? లేక మరో గూటికి చేరతారా? పూటకో పార్టీలో చేరితే, కేడర్‌ పరిస్థితేమిటనే చర్చ నడుస్తోంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా పనిచేసిన బోడ‌ జ‌నార్థన్ మరోసారి పార్టీ మారారు. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలు మార్చడంలో ఆయన రికార్డు చెరిగిపోనిదనే టాక్‌ మొదలైంది.చెన్నూర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోడ జనార్థన్‌ చంద్రబాబు హయంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. టిడిపి శాసన సభ్యుడిగా 1985లో గెలిచిన ఆయన ఆ తర్వాత మంత్రిగా, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గా, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. అయితే టిడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయన , ఆ తర్వాత బీజేపీలో చేరారు. అక్కడితో ఆగకుండా, మళ్లీ సొంతగూటికి చేరుకొని టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు జనార్థన్‌. అన్ని చోట్లా తిరిగి వెనక్కి వచ్చిన జనార్థన్‌ టిడిపిలో కూడా ఉండిపోకుండా, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Read Also: Narsapur Congress: అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.. ఇప్పుడు సీన్ రివర్స్

అక్కడితో ఆగకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వక‌పోవ‌డంతో బ‌హుజ‌న్ లెఫ్ట్ ఫ్రంట్ నుంచి పోటీ చేశారు. తిరిగి మళ్లీ బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయ‌న‌కు సముచిత స్థానం దక్కకపోవడంతో సైలెంట్ గా ఉండి, ఎప్పుడు గోడ దూకుతారా అనేలా చూసే పరిస్థితి వచ్చింది. చివరికి ఏడాది తర్వాత మళ్లీ హస్తం గూటికి చేరారు బోడ జనార్థన్‌. అయితే ఆయన చొక్కాలు మార్చినంతా ఈజీగా కండువాలు మార్చడం క్యాడర్ లో అయోమయం నెలకొంది.

తమ నేత అలవోకగా పార్టీలు మారుతుంటే ఆయన వెంట నడిచే క్యాడర్‌లో అయోమయం ఏర్పడుతోందనే టాక్‌ ఉంది. ఏ పార్టీలో ఉన్నా, ఎమ్మెల్యే పదవే కీలకం అనుకుంటున్న బోడ జనార్థన్‌ తీరు ఆయన సన్నిహితులకు సమస్యగా మారిందట.

అయితే చెన్నూర్ కాంగ్రెస్ లో ఇంతకంటే ముందే నల్లాల ఓదెలు దంపతులు చేరిపోగా ఇప్పుడు బోడ జనార్థన్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సైతం వస్తున్నాయట.. పార్టీ మారినా ఫలితం ఉంటుందా…చెన్నూర్ నుంచి బరిలో ఉడండం సాద్యమేనా..లేదంటే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బరిలో నిలుస్తారా అనే చర్చ సైతం ఊపందుంకుంది.

ఇవన్నీ చూస్తూ బోడ జనార్థన్‌ది పార్టీలు మారడంలో చెరగని రికార్డ్‌ అనే టాక్‌ మొదలైంది. ఇన్ని పార్టీలు మారిన తర్వాతైనా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారా? లేక మరో కండువా కప్పుకుంటారా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.