నిజామాబాద్ కమలంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు, మూడు వర్గాలుగా నాయకులు.. కార్యకర్తలు విడిపోయారు. ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు ముదురుపాకాన పడుతున్నాయి కూడా. ఇందుకు హనుమాన్ శోభాయాత్రలో జరిగిన గొడవలే తీవ్రతను తెలియజేస్తున్నాయి.
బీజేపీలో గొడవలు సమసి అంతా గాడిన పడుతున్నారని అనుకుంటున్న తరుణంలో ముఖ్య నాయకులే రోడ్డెక్కి చొక్కాలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి కాస్త పట్టుందని భావిస్తున్న అర్బన్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ నాయకులంతా కలిసి పనిచేశారు. ఆ ఐక్యత మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. విభేదాలను పరిష్కరించాల్సిన నాయకులే వాటికి ఆజ్యం పోస్తున్నట్టు తాజాగా తెలియడంతో ఒక్కసారిగా బీజేపీలో కలకలం రేగుతోంది.
ఈ గొడవలకు కారణం అర్బన్ సీటును ఆశించే నాయకులు ఎక్కువ కావడమే. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్యనారాయణ గుప్త, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్యలు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో బస్వా లక్ష్మీనర్సయ్య కాస్త తటస్థంగా ఉన్నా.. ధనపాల్, యండల మధ్య తీవ్ర పోటీ ఉంది. హనుమాన్ శోభాయాత్రలో ఇద్దరూ తోసుకోవడం ఉద్రికత్తకు దారితీసింది.
ఘర్షణపై బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట ధనపాల్. ఈ ఫిర్యాదు వెనక బీజేపీ ఎంపీ ఒకరు ఉన్నారట. ఆయన ప్రోద్బలంతోనే యెండలపై కంప్లయింట్ చేసినట్టు సమాచారం. యెండలకు ఆ ఎంపీకి ఎప్పటి నుంచో పడటం లేదు. తాజా ఘర్షణను అనుకూలంగా మలుచుకుని పైచెయ్యి సాధించే పనిలో పడ్డారట ఆ ఎంపీ. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సర్దిచెప్పాల్సిన ఎంపీనే ఈ విధంగా అగ్నికి ఆజ్యం పోయడం చర్చగా మారింది. ఈ ఎపిసోడ్‌లో ఎంపీ పాత్రను బీజేపీ సీనియర్లు తప్పుపట్టినట్టు తెలుస్తోంది.
బీజేపీ సిద్ధాతంతాలకు కట్టుబడి పనిచేస్తున్న వాళ్లకు పార్టీలో గౌరవం దక్కడం లేదనే ఆవేదన ఉందట. ఇటీవల కాలంలో కాషాయ కండువా కప్పుకొన్నవాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఓల్డ్ బీజేపీ శ్రేణులకు రుచించడం లేదట. ఇలాంటి సమయంలో వర్గపోరును.. అసంతృప్తిని పక్కన పెట్టాల్సిన పార్టీ ఎంపీ.. అందుకు భిన్నంగా వెళ్లడం కాషాయ శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే వైఖరి కొనసాగితే బీజేపీ బలంగా ఉందని అనుకున్నచోటే పార్టీని బొంద పెట్టేస్తారేమోనని కేడర్ ఆందోళన చెందుతోందట.
