NTV Telugu Site icon

మోహన్‌బాబు స్వీట్‌ వార్నింగ్‌ ఎవరికి..? వైసీపీతో చెడిందా..?

Mohan Babu

Mohan Babu

తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అధినేతను ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి ఆ ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు మోహన్‌బాబు. రాజకీయంగా ఆయన అనుకున్నది జరిగినా.. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. అధికారపార్టీతో టచ్‌మీ నాట్‌గా ఉంటున్నారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ప్రభుత్వంలో ఆయన చర్చలు జరిపింది లేదు. మొన్నటి మా ఎన్నికల్లో మంచు విష్ణుకు వైసీపీ తెర వెనక మద్దతుగా ఉందని ప్రచారం జరిగింది. దాంతో మంచు ఫ్యామిలీకి.. వైసీపీకి గ్యాప్‌ రాలేదని చర్చ సాగింది. కానీ.. తాజగా తిరుపతిలో మోహన్‌బాబు చేసిన కామెంట్స్‌ మాత్రం మరో అర్థం వచ్చేలా ఉన్నాయి.

తన కాలేజీలోని అధ్యాపకులతో ముచ్చటిస్తూ.. తాను ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నానని చెప్పారు మోహన్‌బాబు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని చెప్పుకొచ్చారు. ఆ కామెంట్స్‌ చుట్టూనే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కుటుంబసభ్యులతో వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు మోహన్‌బాబు. అప్పుడే బీజేపీలో చేరిపోతారని అనుకున్నారు. కానీ.. ఆయన కండువా మార్చింది లేదు. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలలోనూ మోడీకి మద్దతుగా మాట్లాడారు కూడా. తిరుపతిలో మాత్రం ఆ డోస్‌ పెంచినట్టే కనిపిస్తోంది. పైగా మోహన్‌బాబు తిరుపతి పర్యటనలో ఆయన వెంట బీజేపీ నేత కోలా మోహన్‌ కనిపించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ ఛైర్మన్‌ లేదా.. రాజ్యసభ సీటు ఇస్తారని మోహన్‌బాబు ఆశించారని ప్రచారం జరిగింది. చివరకు ఫిలిం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన పదవి విషయంలోనూ ఆయన పేరు చర్చల్లో నలిగింది. కానీ.. ఏ పదవీ దక్కలేదు. పైగా ఎప్పటి నుంచో పోరాడుతున్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదట. ఆ బకాయిల కోసం గతంలో రోడ్డుపై ధర్నా చేస్తేనే కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగానే కోర్టు వాయిదాకు వచ్చారు మోహన్‌బాబు. ఆయన వాయిదాకు వస్తారని తెలిసినా.. పాదయాత్ర చేయడం.. బీజేపీకి అనుకూలంగా కామెంట్స్‌ పాస్‌ చేయడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని అనుమానిస్తున్నారట. మనసులో ఏదో పెట్టుకుని.. ఒకరికి పరోక్షంగా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారని చర్చ జరుగుతోంది. మరి.. పాదయాత్ర.. కామెంట్స్‌ ద్వారా ఆయన ఆశిస్తున్నదేంటో కాలమే చెప్పాలి.

Show comments