ఒకప్పుడు ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు పాలు-నీళ్లలా ఉండేవారు. ఇప్పుడు ఉప్పు-నిప్పుగా మారిపోయారు. ఈ మార్పు వెనక పెద్ద కథే ఉందట. సీటు నీదా నాదా అన్నంతగా వైరం వచ్చేసిందట. ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి పార్టీ శ్రేణులు. వాళ్లెవరు? ఏంటా రగడ? లెట్స్ వాచ్..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌లో వర్గపోరు పీక్స్‌కు చేరుకుంటోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పార్టీలో చర్చగా మారుతున్నాయి. రాష్ట్రంలో మిగతాచోట్ల మాదిరే కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్టుగా వార్ సాగుతోందట. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రాజకీయ పోరు ఎటు వెళ్తుందో అనే చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మధ్య అసలు పడటం లేదు. నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో కలిసి సాగిన ఇద్దరూ.. ప్రస్తుతం ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఆధిపత్యపోరు రకరకాలుగా మలుపులు తిరుగుతోందట. అవి అధికారపార్టీలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కుత్బుల్లాపూర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు వివేకానంద. గతంలో మరో పార్టీ నుంచి గెలిచినా.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి.. 2018లోనూ పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. శంబీపూర్‌రాజు మాత్రం మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా. అధికార పార్టీ నేతలిద్దరూ ఉప్పు నిప్పుగా మారడంతో ఎవరి వర్గాన్ని వారు మెయింటైన్ చేస్తున్నారు.
ఇద్దరి మధ్య ఈ స్థాయిలో గ్యాప్ రావడానికి బలమైన కారణాలే ఉన్నాయనేది పార్టీ వర్గాల మాట. కుత్బుల్లాపూర్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో శంభీపూర్‌రాజు ఉన్నారట. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ టికెట్ దక్కించుకుని.. బరిలో ఉండాలనే తలంపుతో నియోజకవర్గంలో గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టేశారట. కుత్బుల్లాపూర్‌లో తనకంటూ ఒక వర్గం ఉండాలని భావించి.. స్థానిక నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారట. అలా తన శిబిరాన్ని బలోపేతం చేసుకునేందుకు చురుకుగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ శంభీపూర్ రాజును దూరం పెట్టారట ఎమ్మెల్యే వివేక్. ఆయన కూడా ఎమ్మెల్సీకి ధీటుగా రాజకీయాలు చేస్తున్నట్టు టాక్. నియోజకవర్గంపై పట్టు సడలకుండా.. తన వర్గాన్ని మరింత బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారట వివేక్.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే సమయంలో ప్రతిచోటా జరిగేది ఇదే కదా అనేది కొందరు టీఆర్‌ఎస్ నేతల అభిప్రాయం. కాకపోతే కేడర్ గందరగోళంలో పడుతున్నట్టు సమాచారం. ఇద్దరూ ప్రజాప్రతినిధులే. హోదాలో ఉన్నవారే. ఒకరిని కాదని ఇంకొకరి దగ్గరకు వెళ్తే ఇబ్బందేనని ఆందోళన చెందుతున్నారట. అయితే కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను పార్టీ పెద్దల దృష్టిలో పెట్టారట ఎమ్మెల్యే వివేక్.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. కుత్బుల్లా పూర్‌లోనూ అదే జరుగుతుందని కొందరి విశ్లేషణ. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ మరింత పెరగొచ్చని.. పోటాపోటీ కార్యక్రమాలు ఊపందుకుంటాయనే వాదన ఉంది. మరి.. చివరకు ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.