ఆయన చేసే కామెంట్స్ విపక్షాలకు అస్త్రాలుగా మారితే.. సొంత పార్టీ ఇరుకున పడుతోందా? సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్‌పై రచ్చ
దేశంలో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని.. కొత్తగా పాగా వేయాలని బీజేపీ అధిష్ఠానం వేయని ఎత్తుగడలు లేవు. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్, జేపీ నడ్డాలు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ అయ్యాయి. యూపీలో యోగికి ఓటు వేయకపోతే బుల్డోజర్లు వస్తాయన్న రాజాసింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైరిపక్షాలు భగ్గుమంటే.. కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. 24 గంటల్లో వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
జాతీయస్థాయిలో చర్చగా మారిన రాజాసింగ్ కామెంట్స్
రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రోల్ లేదు. రాజాసింగ్‌కు అక్కడ ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించలేదు బీజేపీ. అయినప్పటికీ ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం.. అంతే వేగంగా అది వైరల్ కావడం.. జాతీయ స్థాయిలో చర్చగా మారడం చకచకా జరిగపోయింది. రాజాసింగ్ కామెంట్స్‌పై జాతీయ స్థాయిలో కానీ.. తెలంగాణలో కానీ బీజేపీ నేతలు స్పందించలేదు. అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడింది లేదూ. విపక్ష పార్టీలు ఎన్ని ప్రశ్నలు వేసినా పట్టించుకోలేదు కమలనాధులు.
రాజాసింగ్ తీరుపై బీజేపీలో అంతర్గతంగా తీవ్ర చర్చే జరుగుతోందా?
పైకి చెప్పకపోయినా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్‌పై కాషాయ శిబిరంలో అంతర్గతంగా తీవ్రచర్చే జరుగుతోందట. ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసెంబ్లీ ఎన్నికలను పార్టీ సీరియస్‌గా తీసుకుని పనిచేస్తున్న సమయంలో ఎవరేం మాట్లాడాలో పార్టీయే సూచిస్తుంది. అది తెలిసి కూడా రాజాసింగ్ ఎందుకు లైట్ తీసుకున్నారు? ఈ సమయంలో ఆ కామెంట్స్ చేయకుండా ఉంటే పోయేది అని అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఏదైనా వ్యాఖ్యలు చేసి ఉంటే.. దానికి కౌంటర్ ఇస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదని.. ఇలా కొత్త తలనొప్పులు తలకెత్తుకోవడం ఎందుకని నిలదీస్తున్నారట.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా?
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌కు తెలియదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారట. ఒక్కోసారి అలాంటి వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ పెద్దలు రాజాసింగ్‌తో మాట్లాడారో లేదో కానీ.. ఆయన మారతారని.. మౌనంగా ఉంటారని అనుకోవడం భ్రమగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఎవరేమనుకున్నా.. హిందూ అజెండాపై సూటిగా సుత్తిలేకుండా మాట్లాడేస్తుంటారు రాజాసింగ్. తాజా ఎపిసోడ్‌లో జరిగింది అదే. మరి.. ఈసీ శ్రీముఖం తర్వాత ఈ ఫైర్‌బ్రాండ్ బీజేపీ ఎమ్మెల్యే ఏం చేస్తారో చూడాలి.