Site icon NTV Telugu

Off The Record: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రెచ్చిపోతూ గుట్లు బయటేసుకుంటున్నారా?

Medak

Medak

Off The Record: సూది కోసం సోదికెళ్తే… పాతవి ఏవేవో బయటపడ్డాయన్నది సామెత. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అలాగే ఉందట. ఇద్దరూ రెచ్చిపోతూ… పరస్పరం గుట్లు బయటేసుకుంటున్నారట. ఇది చూస్తున్న జనం మాత్రం… అమ్మనీ… వీళ్ళిద్దరూ ఇంతింత తింటున్నారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతోందా బాగోతం? ఎవరా ఇద్దరు నేతలు?

Read Also: Sundeep Kishan: తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆనందదాయకం..!

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. 2016లో పట్లోళ్ల కిష్టారెడ్డి చనిపోయాక జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి ఇక్కడ గులాబీ పార్టీ జెండా ఎగిరింది. ఉప ఎన్నికలో మెదటిసారి భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదే గెలుపు. ఇక 2023లో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతూ రాజకీయం రక్తి కడుతోంది. నువ్వు డ్యాష్‌ అంటే నువ్వే డ్యాష్‌ డ్యాష్‌ అని పరస్పరం విమర్శంచుకుంటూ.. ఇద్దరి పాత వ్యవహారాలను తవ్వి పోసుకుంటూ.. జనానికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతున్నారు. నిరుడు అక్టోబర్‌లో నియోజకవర్గంలోని సంజీవన్ రావుపేటలో కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయిన ఘటన నుంచి తాజాగా ఓ గర్భిణిని రోడ్డు మార్గం లేక భుజాల మీద మోసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఘటన వరకు ప్రతిది రాజకీయమే అవుతోంది.

Read Also: Red Sandalwood smuggling: కర్ణాటక పుష్ప.. ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్‌ దందా!

అయితే, నియోజకవర్గంలో పంపిణీకి రెడీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు మంజూరు చేయాలంటూ ఇటీవల సబ్ కలెక్టర్ కార్యలయం ఎదుట ధర్నా చేశారు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి. కమీషన్ ఇవ్వడం లేదన్న కారణంతోనే… ఎమ్మెల్యే ఇండ్లు పంపిణీ చేయడం లేదని ఆరోపించారాయన. దీనికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. కమీషన్లకు కక్కుర్తి పడటం మాజీ ఎమ్మెల్యేకు బాగా అలవాటని రివర్స్‌ అటాక్‌ చేశారు. అక్కడితో ఆగకుండా ఈ నెల 10న నాగల్ గిద్ద మండలం మున్యానాయక్ తండాలో ఓ గర్భిణీ ప్రసవవేదన అనుభవించింది. తండాకు అంబులెన్స్ వెళ్లే రోడ్డు మార్గం లేక 2 కిలోమీటర్ల వరకు ఆమెను భుజాలపై ఎత్తుకుని వచ్చారు. ఆ తండాకు రోడ్డు మంజూరు అయినా ఎమ్మెల్యే సంజీవరెడ్డి 10 శాతం కమీషన్ అడగడం వల్లే కాంట్రాక్టర్ ముందుకు రాలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో బీఆర్ఎస్ హయంలో శంఖుస్ఖాపనలు తప్ప ప్రారంభోత్సవాలు లేవని తమ ప్రభుత్వం వచ్చాకే పనులు పూర్తవుతున్నాయని చెప్పారు. ఇక్కడి వరకు రాజకీయ విమర్శలు సాధారణమే అయినా తాజాగా సంబంధం లేని ఓ వాట్సాప్ పోస్ట్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వివాదానికి దారి తీసిందట.

Read Also: Youth Awardees Meet President: రాష్ట్రపతిని కలిసిన యువజన అవార్డు గ్రహీతలు..

కాగా, పెద్దశంకరంపేట మాజీ ఎంపీపీ వాట్సాప్ గ్రూప్ లో పోస్టు పెట్టడంతో దానికి కౌంటర్ గా కాంగ్రెస్ నాయకులు రివర్స్‌ అయ్యారు. ఈ అంశం ఏకంగా ఆ మాజీ ఎంపీపీ ఇంటిపై దాడి చేసేవరకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వాహనంపై దాడికి యత్నించారట కాంగ్రెస్ నాయకులు. ఇక పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఎక్కడ ఏం జరిగినా దానికి పొలిటికల్‌ కలర్‌ పులిమేస్తున్నాయి రెండు వర్గాలు. వాస్తవానికి ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కుటుంబాలు రెండూ కాంట్రాక్టర్లే. అధికారంలో ఎవరుంటే వారు తమ వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తుంటారు. అందుకే కమీషన్ల విషయం ఈ ఇద్దరు నేతలకు తెలిసినంతగా మరేవరికి తెలియదంటూ గుసగుసలాడుకుంటున్నారు నియోజకవర్గంలో. ఇదిలా ఉంటే నారాయణఖేడ్ లో ఫామ్ ల్యాండ్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నేళ్ళ నుంచి జోరుగా జరుగుతోంది.

Read Also: Special Police for Dogs: కుక్కలకు ప్రత్యేక పోలీసులు.. ఏ దేశంలో అంటే..!

ఇందులోనూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కమీషన్లు తీసుకున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తుంటే మరి మీ నాయకుడు ఏమైనా తక్కువా తిన్నారా ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన వాటా ఆయన తీసుకోవడం లేదా అంటూ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇలా కమీషన్ల కహానీ నారాయణఖేడ్‌లో కాకరేపుతోంది. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకు ఎవరు ఎంత తిన్నారో లెక్కలతో సహా బయటపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజం. కానీ ఇద్దరు నేతలు ప్రజా సమస్యలను వదిలేసి ఇలా కమీషన్ల గురించి మాట్లాడటమేంటని నియోజవవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారట.

Exit mobile version