Magunta Srinivasulu Reddy : ఆ ఎంపీ మరోసారి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఆగడం లేదా? స్వయంగా ఆయనే స్పష్టత ఇచ్చారా? కాకపోతే తన మనసులోని మాటను కూడా బయట పెట్టేయడంతో ఇంకో చర్చ మొదలైందా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన చెప్పిన అంశం ఏంటి?
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతోనే ఎంపీగా గెలిచారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మాగుంట అభిమానులు ఉన్నప్పటికీ.. రాజకీయంగా ఆయన శైలి భిన్నంగా ఉంటుంది. 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 2014లో టీడీపీ చేరి.. మరోసారి బరిలో నిలిచినా నెగ్గుకు రాలేదు. అయినప్పటికీ టీడీపీ ఆయన్ను ఎమ్మెల్సీని చేసింది. 2019 ఎన్నికల సమయానికి ఆయన మనసు మరోసారి మార్పు కోరుకుంది. వైసీపీలో చేరి.. మళ్లీ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు శ్రీనివాసులరెడ్డి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఈ కారణమో ఏమో ఆయన పార్టీ మారిపోతున్నారనే చర్చ మరోసారి సోషల్ మీడియాలో జోరందుకుంది.
ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో మాగుంటకు పొసగడం లేదని చెబుతారు. ఇంతలో కుమారుడు రాఘవరెడ్డిని ఎమ్మెల్యేగా బరిలో దించేందుకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వెతుకుతున్నారనే ప్రచారం మొదలైంది. గిద్దలూరు బరిలో దించుతారని కొందరి అనుమానం. వ్యాపారంలో బిజీగా ఉన్న రాఘవరెడ్డి.. కరోనా సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలతో జనాల్లో నానుతున్నారు. ఇదే టైమ్‌లో మాగుంట పార్టీ మారుతున్నారనే చర్చ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీల్లో ఒకదాంట్లో చేరబోతున్నారని కథనాలు వండి వార్చేస్తున్నారు. వీటి సెగ గట్టిగానే ఉండటంతో.. సీఎం జగన్ కూడా అసంతృప్తిగా ఉన్నారని వార్తలొచ్చాయి. దాంతో పార్టీ మారడం లేదని.. ఆ ప్రచారం వెనక కుట్ర ఉందని స్పష్టం చేశారు ఎంపీ మాగుంట.
కేవలం వివరణకే పరిమితం కాకుండా.. తన మనసులోని మాటను కూడా బయట పెట్టేశారు మాగుంట. 2024 ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం వైసీపీ నుంచే పోటీ చేస్తుందని అది రాసి పెట్టుకోవాలని చెబుతూనే.. కుమారుడి ఎంట్రీపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డిని పోటీ చేయించే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అయితే తను ఎంపీగా… రాఘవరెడ్డి ఎమ్మెల్యేగా బరిలో ఉండబోరని.. ఎంపీగా కుమారుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించారట. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి హామీ లభించకపోయినా.. వచ్చే ఎన్నికల్లో మహిళలకు, యువతకు ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉందని లెక్క లేస్తున్నారట మాగుంట. ఈ క్రమంలో రాఘవరెడ్డికి తప్పక ఛాన్స్ ఇస్తారనే అంచనాల్లో ఉన్నారు.
పార్టీ మారడం లేదని స్పష్టత ఇస్తూనే.. కుమారుడి ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునేందుకు గట్టిగానే పనిచేస్తున్నారు ఎంపీ మాగుంట. మరి.. ఆయన విన్నపాన్ని వైసీపీ అధిష్ఠానం మన్నిస్తుందా? లేక తర్వాత చూద్దామని సర్ది చెబుతుందా? అప్పుడు మాగుంట రియాక్షన్ ఏంటి? సర్దుకుపోతారా లేదా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.