Konda Vishweshwar Reddy :
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఇటీవలే బీజేపీ కండువా కప్పుకొన్న చేవెళ్ల మాజీ ఎంపీ. కొత్త పార్టీలో చేరడం ద్వారా తన దృష్టి చేవెళ్ల లోక్‌సభ సీటుపై ఉందని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారని.. ఆ మేరకు బీజేపీ నుంచి హామీ లభించిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇక్కడే బీజేపీలో పంచాయితీ మొదలైంది. కొండా రాకపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. చేవెళ్ల లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలకే దిక్కుతోచడం లేదట. ఈ జాబితాలో గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్దన్‌రెడ్డి కూడా ఉండటంతో కాషాయ శిబిరంలో హాట్ టాపిక్‌గా మారింది.
గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డే పోటీ చేశారు. చివరి క్షణంలో టికెట్ ఖరారు చేసినా.. 13 శాతం ఓట్లు రావడం మామూలు విషయం కాదని పార్టీ నేతలు భావించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని జనార్దన్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. ఇదే సీటుపై అప్పట్లో బండారు దత్తాత్రేయ కుమార్తె పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. అయితే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాకతో వీరి పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్న. కొండా బీజేపీలో చేరే అంశంలో తనను సంప్రదించలేదని.. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని.. కావాలనే తనను పక్కన పెడుతున్నారని సన్నిహితుల దగ్గర చెప్పి వాపోతున్నారట జనార్దన్‌రెడ్డి. గత ఎన్నికల్లో ఓడినా.. చేవెళ్లను విడిచి పెట్టలేదని.. అక్కడే పర్యటనలు చేస్తున్నానని గుర్తు చేస్తున్నారట. కొండా చేరిక విషయంలో జనార్దన్‌రెడ్డి గట్టిగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
జరుగుతున్న పరిణామాలను అవమానంగా భావిస్తున్న జనార్దన్‌రెడ్డి తనకూ టైమ్ వస్తుందని పార్టీ నేతల దగ్గర చెబుతున్నారట. ఈ విషయం పార్టీ రాష్ట్ర నేతల వరకు వెళ్లినట్టు టాక్. మరి.. జనార్దన్‌రెడ్డిని బుజ్జగిస్తారో లేదో స్పష్టత లేదు. అలాగే వియ్యంకుడి విషయంలో దత్తాత్రేయ జోక్యం చేసుకోకపోవచ్చనే వాదన ఉంది. ఒక్క జనార్దన్‌రెడ్డే కాదు.. చేవెళ్ల లోక్‌సభ బీజేపీ సీటుపై కన్నేసిన వారిలో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవి యాదవ్‌లు ఉన్నారు. రవి యాదవ్ అయితే నిన్న మొన్నటి వరకు తన హోర్డింగ్స్‌లో చేవెళ్ల పార్లమెంట్ అని పెద్ద అక్షరాలతో రాయించుకున్నారు. కానీ.. సీన్ మారిపోవడంతో.. హోర్డింగ్స్‌లో పేరు పక్కన శేరిలింగంపల్లి నియోజకవర్గం అని పెట్టుకుంటున్నారు. ఇక వీరేందర్‌గౌడ్ పరిస్థితి ఏంటన్నదే తేలాలి. బండి సంజయ్ పాదయాత్రను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. పార్టీలో కూడా ప్రాధాన్యం పెరిగింది. ఆయనకు ఇంకేదైనా సీటుపై హామీ ఇచ్చారా? అందుకే కామ్‌గా ఉన్నారా అనే అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరిక కాషాయ పార్టీలో పెద్ద అలజడినే తీసుకొచ్చింది. చాలా మంది నాయకుల ఆశలు హుళక్కయ్యాయని చెవులు కొరుక్కుంటున్నారు.