వారిద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఒకరినొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడరని టాక్. ఇప్పుడు ఆ వార్.. పార్టీలోనూ చిచ్చు పెడుతోందట.
విభేదాలు రోడ్డెక్కి రచ్చ రచ్చ..!
ఈయన కాసు మహేష్‌రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే. ఇంకో నేత జంగా కృష్ణమూర్తి. వైపీపీ ఎమ్మెల్సీ. ఇద్దరిదీ గుంటూరు జిల్లా గురజాల. పల్నాడు ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు నాయకులు అధికారపార్టీలోనే ఉన్నా.. ఒకరినొకరు వైరిపక్షాలుగా చూసుకుంటారు. ఇద్దరి మధ్య విభేదాలు ఎప్పటికప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంటాయని చెబుతాయి పార్టీ వర్గాలు. నిన్న మొన్నటి వరకు తెరవెనక సాగిన ఎత్తులు.. జిత్తులు.. ఇప్పుడు రోడ్డెక్కాయి. ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేలా చేస్తున్న పనులు రచ్చ రచ్చ అవుతున్నాయి.
ప్రాధాన్యతల విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్..!
గురజాల నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జంగా కృష్ణమూర్తి. కాసు మహేష్‌రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యే అయ్యారు. వాస్తవానికి కాసు కుటుంబానిది నరసరావుపేట. కానీ.. గురజాలలో పోటీ చేసిన గెలిచారు. అప్పటికే జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నా.. తర్వాత విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన జంగాకు ఇక్కడ సొంత వర్గం ఉంది. ఆ వర్గానికి ఎమ్మెల్యే కాసు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది జంగా అనుచరులు ఆరోపణ. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది. కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే మానేశారు.
రెండుసార్లు ప్రమాణస్వీకారం చేసిన ఎంపీటీసీలు..!
పరిషత్ ఎన్నికల తర్వాత జంగా కృష్ణమూర్తి సొంత మండలం దాచేపల్లిలో ఎంపీటీసీల ప్రమాణస్వీకారం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరు కావడంతోపాటు దగ్గరుండి MPTCలతో ప్రమాణస్వీకారం చేయించి వెళ్లారు జంగా. ఎమ్మెల్సీ అలా వెళ్లగానే ఎమ్మెల్యే కాసు అక్కడికి వచ్చారు. కాసును చూడగానే ఏమనుకున్నారో ఏమో.. MPTCలు ఎమ్మెల్యే సమక్షంలో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా రెండుసార్లు ప్రమాణస్వీకారంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
ప్రొటోకాల్‌పై కలెక్టర్‌కు జంగా ఫిర్యాదు..!
పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికల్లో 31 మంది వైసీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ గుంటూరు వైసీపీ ఆఫీస్‌కు తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు జంగా. ఈ కార్యక్రమం గురించి ఎమ్మెల్యే కాసుకు తెలియదట. ఏకగ్రీవాల కోసం ఎమ్మెల్యే కష్టపడితే.. ఆ క్రెడిట్ అంతా తనదే అన్నట్టు జంగా చెప్పుకొన్నారని కాసువర్గం ఫైర్ అయ్యింది. మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన కౌన్సిలర్లకు సీట్ల కేటాయింపూ రచ్చకు దారితీసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల ప్రారంభోత్సవంలో కూడా వర్గపోరు బయటపడింది. ప్రొటోకాల్ పాటించడం లేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు జంగా.
ఫ్లెక్సీల విషయంలో రెండు వర్గాల రగడ..!
తాజాగా దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే కాసు వర్గీయులు చించేశారు. దీంతో రెండు వర్గాల మధ్య మరోసారి నిప్పు రాజుకుంది. గ్రామ సచివాలయ ఓపెనింగ్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నారని జంగా వర్గం ఫ్లెక్సీలు పెట్టింది. అయితే ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఫ్లెక్సీలు అలాగే వదిలేశారు. సీఎం జగన్ పుట్టినరోజు పేరుతో ఎమ్మెల్యే కాసు వర్గీయులు.. ఆ ఫ్లెక్సీలను పీకేసి తమవి ఏర్పాటు చేశారు. దీంతో గొడవ జరిగింది. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు చేసిన ఎత్తుగడలు.. ఇప్పుడు రోడ్డెక్కడంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందా అన్న ఆందోళన అధికారపార్టీ కేడర్‌లో ఉందట. మరి.. సమస్య మరింత ముదరకుండా ఇద్దరి మధ్య సఖ్యతకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తారో లేదో చూడాలి.