Site icon NTV Telugu

Karimnagar Hot Politics.. Off The Record: ఇద్దరి మధ్య రాజీకుదిరిందా?

knr gangula

Maxresdefault (3)

ఒకప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని ఇబ్బందుల్లో పడేశాయ్. ఇది తట్టుకోలేని ఆ నేత పార్టీలోంచి జంప్ అయ్యారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఐతే…గతంలో విభేదించిన నేతతోనే మళ్లీ పని చేయాల్సి రావటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చేందుకు ఏకంగా అధినేత జోక్యం చేసుకోవాల్సింది. ఇంతకీ…ఆ ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదిరినట్లేనా?

తిరిగి పార్టీలోకి వచ్చినా…రవీందర్‌ సింగ్‌ సొంతంగానే కార్యక్రమాలు
కరీంనగర్ జిల్లా బిఆర్‌యస్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత కొంతకాలంగా మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇద్దరూ కొద్దిరోజుల పాటు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉండేవారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, మంత్రి గంగులతో స్థానిక నాయకులు అంటీముట్టనట్లుగానే వ్యవహరించేవారట. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డారు రవీందర్ సింగ్. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బిఆర్‌యస్‌లోని ముఖ్య నేతలపై రవీందర్ సింగ్ బాహాటంగానే విమర్శలు చేయడంతో దూరం మరింతగా పెరిగింది. తిరిగి పార్టీలోకి వచ్చిన తరువాత కూడా రవీందర్‌ సింగ్‌ సొంతంగానే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారని పార్టీలో టాక్‌.

మంత్రి గంగుల వర్గం పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదులు
సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రవీందర్ సింగ్ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండేవారట. నగరంలోనే పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. దాంతో మంత్రి గంగులకు రవీందర్ సింగ్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ జోరుగా జరిగింది. రవీందర్ సింగ్ వర్గం నేతలు అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మంత్రి గంగుల వర్గం నేతలు పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేశారు. రవీందర్ సింగ్‌ను, ఆయన వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కూడా.

గంగుల పర్యవేక్షించే సివిల్ సప్లయ్ శాఖ అనుబంధ చైర్మన్
ఐతే…తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌లో రవీందర్ సింగ్ కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి కూడా వెళ్లారు. దీంతో మంత్రి గంగుల, రవీందర్ సింగ్‌ మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కరీంనగర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు గాను రవీందర్ సింగ్‌కు నామినేటెడ్ పదవి ఇవ్వడం…పైగా మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షించే సివిల్ సప్లయ్ శాఖ అనుబంధ చైర్మన్ పదవి కావడంతో ఇప్పుడు పార్టీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

రవీందర్ సింగ్‌కు నామినేటెడ్ పోస్టు ఇవ్వడం వెనుక పెద్ద కథ
మరోవైపు…మాజీ మేయర్ రవీందర్ సింగ్‌కు నామినేటెడ్ పోస్టు ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉందట. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌-రవీందర్ సింగ్‌కు మధ్య దూరం వల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని టాక్‌. అందుకే పార్టీని బలోపేతం చేయడం కోసమే రవీందర్ సింగ్‌కు పదవి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కెసిఆర్‌కు రవీందర్ సింగ్ అవసరం అని అందుకే ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి ఉండొచ్చనే వాదనలు సైతం ఉన్నాయి.

ఉద్యమకారులకు పార్టీ అండగా ఉందనే సంకేతం
కరీంనగర్ అధికార పార్టీలో గత కొంతకాలంగా నెలకొన్న విబేధాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. దాని కోసమే రవీందర్ సింగ్‌కు పదవి కట్టబెట్టారు. ఉద్యమకారులకు పార్టీ అండగా ఉందనే సంకేతం పార్టీ శ్రేణులకు పంపారట. ఇక మంత్రి గంగుల మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఒకే శాఖలో కలిసి పనిచేయడం ఇప్పుడు జిల్లా పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఉప్పునిప్పులా ఉన్న ఇరువురు నేతలు పైకి బాగానే ఉన్నా అంతర్గతంగా ఏం జరుగుతుందనేది మాత్రం ప్రస్తుతానికైతే అంతుబట్టడం లేదు.

Exit mobile version