రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి రుజువైందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్‌గా బరిలో దిగిన మాజీ మేయర్ ఘర్‌వాపసీ అవుతున్నారా? రవీందర్ సింగ్ మనసు మార్చుకున్నారా? తెరవెనక ఏం జరిగింది?
టీఆర్ఎస్‌లోకి రవీందర్‌సింగ్ ఘర్‌వాపసీ..!
రవీంద్ సింగ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్‌గా బరిలో నిల్చొని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినా.. గణనీయంగానే ఓట్లు సాధించారు. ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకుని ఉన్న ఈ మాజీ మేయర్.. రెబల్‌గా మారడంతో అధికారపార్టీలోనూ చర్చగా మారింది. ఇంతలో ఏమైందో ఏమో.. రవీందర్‌సింగ్ ఘర్‌వాపసీ అయిపోతున్నటు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ని సమర్ధించినవాళ్లంతా అవాక్కయ్యారు.
సీఎం కేసీఆర్ నుంచి రవీందర్‌సింగ్‌కు పిలుపు
కరీంనగర్‌లో రవీందర్‌సింగ్ బంధువులకు చెందిన కొన్ని కట్టడాలను అనుమతులు లేవని అధికారులు కూల్చివేశారు. ఆ విషయాన్ని మాజీ మేయర్‌తో సన్నిహితంగా ఉండే కొందరు ఉద్యమకారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. కూల్చివేతలపై ప్రస్తుత కరీంనగర్ మేయర్‌తోపాటు ఓ మంత్రిపై సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఆ తర్వాతే మాజీ మేయర్ రవీందర్‌సింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో రవీందర్‌సింగ్ భేటీ
తెలంగాణ ఉద్యమ సమయంలో సిక్కుల ప్రతినిధిగా ఉన్న రవీందర్ సింగ్.. గులాబీ దళపతికి సన్నిహితంగా ఉండేవారు. ఆ చనువు గుర్తు చేస్తూ కేసీఆర్ పిలవడంతో మాజీ మేయర్ ఆగలేదని తెలుస్తోంది. సహచర ఉద్యమకారులను వెంటబెట్టుకుని ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. సుదీర్ఘంగానే మంతనాలు జరిగాయట. కరీంనగర్ టీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు.. స్థానిక సమస్యలు.. ఉద్యమకారుల పరిస్థితిపై ముఖ్యమంత్రితో చర్చించినట్టు సహచరులకు చెప్పారట రవీందర్‌సింగ్. ఉద్యమకాలం నుంచీ టీఆర్‌ఎస్‌లో ఉన్నవారికి త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని.. రవీందర్‌సింగ్‌కు కూడా ఉన్నతమైన పదవిని ఇస్తామని బాస్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
కత్తులు దూసుకున్న నాయకులు కలిసి ఉంటారా?
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రవీందర్‌సింగ్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారని ప్రచారం జరిగింది. రెబల్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగడం వెనక ఈటల ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇకపై తాను ఈటల వెనకే ఉంటానని ఒకానొక సందర్భంలో రవీందర్ సింగ్ చెప్పారు. దాంతో మాజీ మేయర్ బీజేపీలోకి వెళ్తారని అనుకున్నారు. కానీ.. సింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా పరిణామాలు మారిపోయాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కత్తులు దూసుకున్న నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఎలా కలిసి ఉంటారు? వారి మధ్య సయోధ్య సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. మరి.. కరీంనగర్ టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందో చూడాలి.