దొంగ చేతికే తాళలు ఇచ్చినట్టుగా ఉందట.. ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై విచారణ. దర్యాప్తు అధికారిగా DH శ్రీనివాసరావును నియమించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్య అంతా DH చుట్టూ తిరుగుతుంటే ఆయనే దర్యాప్తు అధికారిగా ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారట. దీంతో అసలు దోషులను వదిలి.. అమాయకులను బలి చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట వైద్య సిబ్బంది.
రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 25న నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ విఫలమై నలుగురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి సంబంధంలేని వారిపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవడం చర్చగా మారింది. ఇంతలో విచారణ అధికారిగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఘటనపై విమర్శలు ఏ స్థాయిలో వస్తున్నాయో.. DHను దర్యాప్తు అధికారిగా వేయడంపై అంతకంటే ఎక్కువగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో పలు సందర్భాలలో DH శ్రీనివాసరావు చేసిన కామెంట్స్‌ను వెలికి తీసి చర్చకు పెడుతున్నారు. ఫుడ్ ఎఫెక్ట్ వల్లే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించాయన్న ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షణ డిహెచ్ పరిధిలోనే ఉండేది. మూడు నెలల క్రితమే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు ఈ ఆసుపత్రిని అప్పగించారు. శ్రీనివాసరావు హెడ్‌గా ఉన్న డిపార్ట్మెంట్‌లో పొరపాట్లు జరిగితే.. వాటిపై విచారణ అధికారిగా ఆయన్నే నియమించడం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఈ చర్యతో అమాయకులు ఇబ్బంది పడి.. అసలు దోషులు తప్పించుకుంటారనే సందేహాలు ఉన్నాయట. ఆస్పత్రిలో అనేక సమస్యలు పరిష్కారం కాక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. లక్షల రూపాయల బిల్లులు చెల్లించలేదు. ఆ సమస్యలను పరిష్కరించంది ఎవరు? శ్రీనివాసరావుకు అంతా తెలిసి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అప్పట్లోనే DH చొరవ తీసుకుని ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదన్నది కొందరి వాదన. అయితే శస్త్రచికిత్సలు వికటించిన ఘటనలో డాక్టర్ శ్రీధర్‌ను సస్పెండ్ చేశారు.
నిజానికి ఆరోజు డాక్టర్ శ్రీధర్ డ్యూటీలో లేరు. ఆయన సూపరింటెండెంట్ కూడా కాదు. క్యాంపు నిర్వహణ బాధ్యతల్లో ఉన్న మరో మహిళా అధికారి.. DH శ్రీనివాసరావుకు బాగా కావాల్సిన వారనే చర్చ ఉంది. నిత్యం జిల్లాలోని ఆసుపత్రుల మానిటరింగ్ చేయాల్సిన జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మీ సొంత పనుల్లో బిజీగా ఉంటారని.. ఆమె శిష్యురాలుగా ఉన్న మరో అధికారి ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలకు, ఇతర పనులకు వెళ్తారట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సిబ్బంది కొరత పక్కన పెట్టి.. తమకు లాభం చేకూర్చే పనులకే ప్రాధాన్యం ఇస్తారట. ఇదంతా DH శ్రీనివాసరావుకు తెలుసనేది వైద్యవర్గాల వాదన. అలాగే చనిపోయిన మహిళల కుటుంబాలకు డిహెచ్ ఎలా పరిహారం ప్రకటిస్తారని రాజకీయ నాయకులు నిలదీస్తున్నారు. జిల్లా కలెక్టర్ పరిహారం ప్రకటించకుండా… డీహెచ్ హడావిడి చేయడం కేసును పక్కదారి పట్టించడమేనని అనుమానిస్తున్నారట.
వైద్య ఆరోగ్య శాఖలో డీహెచ్ శ్రీనివాసరావు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వాటిపై విజిలెన్స్ విచారణ జరిగింది. విజిలెన్స్ విచారణలో అవినీతి వాస్తవమే అని ధ్రువీకరించారట. అలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావునే ఇబ్రహీంపట్నం ఘటనపై విచారణ అధికారిగా నియమించడం హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎవరికి మింగుడు పడటం లేదట. కరోనా సమయంలో శ్రీనివాసరావు చేసిన హడావిడిని డిపార్ట్‌మెంట్‌లో ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. డిహెచ్ శ్రీనివాసరావు ప్రభుత్వ పెద్దల వద్ద మెప్పు కోసం వ్యాధులు, వైరస్లు, కొత్త కొత్త జబ్బుల పట్ల ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సింది పోయి… దృష్టి మరల్చే వ్యాఖ్యలు చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విధి నిర్వహణను పక్కన పెట్టి రాజకీయ పరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. త్వరలోనే ఉద్యోగానికి టాటా చెప్పి ఇంకేదో చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఇబ్రహీంపట్నం ఘటనలో ఆయన పాత్రపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారట ఉద్యోగులు. దొంగ చేతికే తాళాలు ఇచ్చారని గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారట.