మునుగోడు అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోందా? పాత వారికి టికెట్ ఇస్తే జరిగే పరిణామాలపై అంచనాలు వేస్తోందా? కొత్త వారికి టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నారా? ఇంతకీ వడపోతలు ఎంతవరకు వచ్చాయి? లెట్స్ వాచ్..!
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోయినా.. ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థి ఎంపికే పెద్ద సవాల్‌గా మారింది. క్యాండిడేట్ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేది తేల్చుకోలేకపోతున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న నలుగురు… బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే. పల్లె రవి, కైలాష్ నేతతోపాటు.. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె స్రవంతి.. మరో నాయకుడు చెలమల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ బలమైన వ్యూహ రచనలో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన కూడా ఆ స్థాయిలో ఉండాలని లెక్కలేస్తున్నారట.
సీనియర్లను గుర్తించడం.. క్యాడర్‌ను కాపాడుకోవడం.. ఆర్థికంగా ఫైట్ ఇవ్వడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. ఈ కోణంలోనే అభ్యర్థి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఆర్థికంగా బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారట చలమల కృష్ణారెడ్డి. డబ్బులు పెట్టడంతోపాటు నియోజకవర్గంలో ఫేస్ కూడా ఉందనే చర్చ నడుస్తోందట. అయితే కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే… క్యాడర్ ఆయనకు సహకరిస్తారా? పాల్వాయి స్రవంతి వర్గం ఎలా స్పందిస్తుంది? అనే అనుమానాలు ఉన్నాయట.
ఒకవేళ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇస్తే… కలిసి వచ్చేది ఎంత మంది..? క్యాడర్‌ను కాపాడుకోగలరా? అనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట. మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ తన సీటును కాపాడుకోవాలి.. లేదా రెండో ప్లేస్‌లోనైనా ఉండలి. ఈ రెండూ లేదంటే రాజకీయంగా కాంగ్రెస్‌కు తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళన నాయకుల్లో ఉందట. అందుకే కృష్ణారెడ్డి, స్రవంతిలలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్నది తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం.
పార్టీ నాయకత్వమే ఎన్నికల ఖర్చు భరిస్తే.. బీసీ అభ్యర్థిని బరిలో దించి.. టీఆర్ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టాలనే వాదన ఉందట. ఈ అంశంపై కూడా పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మరి.. వడపోతలు.. సమీక్షలు.. సమావేశాల తర్వాత ఢిల్లీకి ఎవరి పేరును పంపుతారు? ఎవరికి అవకాశం ఇస్తారనేది కాంగ్రెస్ వర్గాలకు ఆసక్తి కలిగిస్తోంది. మరి హైకమాండ్ ఎవరికి టిక్ పెడుతుందో చూడాలి.